తెలుగు భాషాభిమానులు ఎటువైపు ?
► అయోమయంలో తెలుగు సంఘాలు
► ఎవరికి ఓటేయాలో తెలియక సంకట స్థితి
హొసూరు : తమిళనాడులో తెలుగువారు అధికంగా ఉన్న క్రిష్ణగిరి జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. దేశంలో తెలుగు వారికి ఎటువంటి సమస్య వచ్చిన తొలుత స్పందించే తమిళనాడులోని తెలుగువారే. జిల్లాలో 2.90 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో 20 శాతం తమిళులు, మిగలిన వారంతా తెలుగు, కన్నడ, ఉర్దూ భాషా ప్రజలే. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు తలపడుతున్నాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కే. గోపీనాథ్, అన్నాడీఎంకే పార్టీ తరుపున పి. బాలక్రిష్ణారెడ్డి తలపడుతున్నారు.
సంకట పరిస్థితుల్లో తెలుగు సంఘాలు : హొసూరు నియోజకవర్గంలో తెలుగు సంఘాలు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కే. గోపీనాథ్, బాలక్రిష్ణారెడ్డి ఇద్దరు తెలుగువారే, ఎవరికి ఓటేయ్యాలో తెలియక సంఘాలు సంకటస్థితిలో పడ్డాయి.
డీఎంకే హయాంలోనే నిర్బంధ తమిళం : 2006లో డీఎంకే హయాంలో నిర్బంధ తమిళభాషా చట్టం తీసుకువచ్చింది. అప్పుడు డీఎంకే తెలుగు వారికి వ్యతిరేకం కాదా అని తెలుగు భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు. గోపీనాథ్ తెలుగు భాషను కాపాడేందుకు కృషి చేసినా ప్రస్తుతం ఆయన కూటమి పార్టీ డీఎంకే కదా అంటూ నిలదీస్తున్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే ఈ సారి నిర్బంధ తమిళభాషా చట్టాన్ని సవరిస్తామని గోపీనాథ్ చెబుతున్నా, 2006లో నిర్బంధ తమిళం ఎందుకు అడ్డుకోలేదని భాషాభిమానులు అంటున్నారు.
తమిళ నిర్బంధానికి గురిచేసింది అన్నాడీఎంకే కాదా ?
హొసూరు అన్నాడీఎంకే అభ్యర్థి పి.బాలక్రిష్ణారెడ్డి తెలుగు వ్యక్తే. ఈయన అన్నాడీఎంకే పార్టీ తరఫున పోటీ చేయడంతో తెలుగువారంతా నిర్బంధ తమిళభాషా చట్టాన్ని పదును పెట్టి విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వం కాదా అని భాషాభిమానులు అంటున్నారు. పోరాటాలు చేసి జయ పట్టించుకున్న పాపన పోలేదని వారు మండిపడుతున్నారు. నిర్బంధ తమిళభాషా చట్టంపై ఎమ్మెల్యే అయితే మాట్లాడగలడా లేక ఆ చట్టంపై పార్టీని ఒప్పించగలడా అనే అనుమానాలు వ్యక్తవమవుతున్నాయి.
తెలుగు యువశక్తి ఆపగలదా ?
నిర్బంధ తమిళం తెలుగు యువశక్తి ఆపగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో అనేక ఉద్యమాలు నడిపి, తన జీవితం మొత్తం తెలుగు భాషకే అంకితం చేసిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హొసూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన తమిళ పార్టీల ఎదుట ఎంత వరకు నిలబడుగలుగుతాడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా జగదీశ్వర్ రెడ్డి జయలలిత పోటీ చేస్తున్న ఆర్కేనగర్‌తో పాటు హొసూరులో కూడా బరిలో ఉన్నారు. తెలుగు వాడి నాడి తెలుసుకోవడం ఇప్పుడే సాధ్యం కాదు మరి.