వేటు తప్పదా? | Congress defeat in BBMC election | Sakshi
Sakshi News home page

వేటు తప్పదా?

Published Wed, Aug 26 2015 4:14 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

వేటు తప్పదా? - Sakshi

వేటు తప్పదా?

♦ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి
♦ ముఖ్యమంత్రికి పొంచి ఉన్న పదవీ గండం!
♦ ఇన్‌చార్జ్ మంత్రులతో సీఎం మంతనాలు
 
 సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పెద్ద తలనొప్పిగా తయారైంది. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీ గండం ఎదురుకానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య వైఖరిపై పార్టీలోని అనేక మంది సీనియర్ నేతల్లో తీవ్ర అసహనం నెలకొన్న విషయం తెలిసిందే. అనేక సందర్భాల్లో ఈ అసమ్మతి భగ్గుమంది కూడా! అయితే ఇప్పటి వరకు సిద్ధరామయ్యపై పరోక్ష విమర్శలకే పరిమితమైన అసంతృప్త వర్గం ఇప్పుడిక సిద్ధరామయ్యను ఆ పదవి నుంచే తప్పించే దిశగా ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే అందుకు సీఎం పనితీరే ముఖ్య కారణమని, కింది స్థాయి కార్యకర్తలను, పార్టీకోసం శ్రమించే వారిని కలుపుకొని పోవడంలో సిద్ధరామయ్య చూపిన నిర్లక్ష్యమే బీబీఎంపీ పట్టం నుంచి కాంగ్రెస్ పార్టీని దూరం చేశాయని హైకమాండ్‌కు నివేదిక అందించే దిశగా అసంతృప్త వర్గమంతా సన్నద్ధమవుతోంది. బీబీఎంపీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సిద్ధరామయ్య స్వయంగా తానే ‘సిటీరౌండ్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు ఎన్నికల వేళ సిద్ధరామయ్య నగరమంతటా విస్తృత ప్రచారాన్ని సైతం నిర్వహించారు.

ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, నగరానికి చెందిన మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావ్, కృష్ణబేరేగౌడ, రోషన్‌బేగ్, కె.జె.జార్జ్‌లను బీబీఎంపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా కూడా నియమించారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌గా ఏర్పాటు చేశారు. ఇంత చేసినా బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం, టికెట్‌ల పంపకాల సమయంలో ఆ పార్టీలో చెలరేగిన అసమ్మతి వెరసి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

 ఇన్‌చార్జ్ మంత్రులతో సమావేశమైన సీఎం!
 బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన అనంతరం బీబీఎంపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులు, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశమైనట్లు సమాచారం. మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్‌ల పేరిట నగర వాసులపై హామీల వర్షం కురిపించినా నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతునివ్వలేదనే విషయాన్ని ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో దాదాపు 105 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌తో పాటు పార్టీ కూడా అంచనా వేసింది.

అయితే ఆశించిన ఫలితం రాకపోవడానికి అనేక ప్రాంతాల్లో స్థానిక నేతల సహాయనిరాకరణే ప్రధాన కారణమని ఇన్‌చార్జ్ మంత్రులు సీఎం సిద్ధరామయ్యకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం సాధించకలేకపోతే కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ఇన్‌చార్జ్ మంత్రులను హెచ్చరించిన నేపథ్యంలో, రానున్న మంత్రివర్గ విస్తరణలో ఈ మంత్రులకు కూడా పదవీగండం తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement