మళ్లీ చిక్కుల్లో సిద్ధు ..
ఒంటెత్తు పోకడలపై సహచరుల ఆగ్రహం
మొన్న వాచీ వివాదం...
నేడు ఏసీబీ శాఖ ఏర్పాటుపై అధిష్టానం గరం గరం
వివరణ కోరిన వైనం
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్యది ప్రత్యేక స్థానం. ఆయన ముక్కుసూటి మనస్తత్వమే ఆయనను వివాదాల్లోకి లాగుతోంది. జేడీఎస్‌లో కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేసిన సిద్ధుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సిద్దు ఒంటెత్తు పోకడలు సహచరులకు మింగుడుపడటం లేదు. తొలిసారిగా రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరెప్షన్ బ్యూరో) శాఖను ఏర్పాటు చేసి అధిష్టానం ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. దీనిపై అధిష్టానం వివరణ కూడా కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి కేసుల దర్యాప్తు కోసం లోకాయుక్త ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా గుర్తింపు ఉంది. అయినా కూడా సిద్ధు అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం అధిష్టానానికి ఆగ్రహం కల్గిస్తోంది.
ఏసీబీని ఏర్పాటు చేయడం ఆ శాఖకు ఐపీఎస్ అధికారులను కూడా నియమించడం తెల్సిందే. అయితే ఈ శాఖను నిర్వీర్యం చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని విపక్షాలతో పాటు న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏసీబీ విషయమై కాంగ్రెస్ పార్టీ వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట మాత్రమైనా చర్చించలేదని ఆ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏసీబీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయని, ఇదే విషయాన్ని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా సిద్ధరామయ్య బడ్జెట్ రూపకల్పన సమయంలో కూడా పార్టీ సీనియర్ నేతలను సంప్రదించలేదని వారు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం కృష్ణ ‘బడ్జెట్ రూపకల్పనకు ముందు సీఎం సిద్ధు నన్ను సంప్రదించలేదు. ఇది సరికాదు. అడిగి ఉంటే సలహాలు ఇచ్చేవాడిని’ అని బహిరంగంగా ఆక్రోశించిన విషయం ఇక్కడ గమనార్హం.
ఇలా అన్ని విషయాల్లోనూ సిద్ధరామయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన నేతలు వాపోయారు. దీంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ విషయమై సీఎం సిద్ధును వివరణ కోరినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. అసలే వాచ్ వివాదం విషయంలో హైకమాండ్ ఆగ్రహానికి గురైన సిద్దుకు ఏసీబీ ఏర్పాటుతో తనకు తానుగా చిక్కుల్లో పడినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.