‘ఆపరేషన్ కమల’
సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో రోజుకో వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిని తమ పార్టీలోకి చేర్చుకు నేందుకు గాను బీజేపీ నేతలు ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర శాఖకు చెందిన ఓ ప్రముఖ నేత కాంగ్రెస్ కార్పొరేటర్‌తో జరిపిన వ్యాఖ్యలంటూ శుక్రవారం బయటపడ్డ ఆడియోటేపుతో పాటు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలపై గుప్పించిన విమర్శలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొనుగోలు చేయాలన్న బీజేపీ వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ ప్రతివ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లందరినీ నగరం నుంచి వేరే ప్రాంతానికి తరలించి, తమ కార్పొరేటర్లు ‘చే’జారి పోకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను బీజేపీ చూపిస్తున్న ఆశలకు తలొగ్గకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే కార్పొరేటర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరినీ మేయర్ ఎన్నిక వరకు ఏదైనా పర్యాటక ప్రదేశానికి తరలించి రిసార్ట్ రాజకీయాన్ని ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, నగరానికి చెందిన ఓ మంత్రికి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బీజేపీపై విమర్శలు
ఇక శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు రామలింగారెడ్డి,కృష్ణబేరేగౌడ, దినేష్ గుండూరావ్‌లు బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్ కార్పొరేటర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. గతంలో బీబీఎంపీలో అధికారంలో ఉన్న బీజేపీ అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటే గానీ వాటన్నింటిని కప్పిపుచ్చుకోలేమనే భావనతోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతోందని మంత్రులు విమర్శించారు.
కాంగ్రెస్, జేడీఎస్‌ల మైత్రి ప్రజాస్వామ్యయుతమైనదేనని, ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని పేర్కొన్నారు. ఇక బీబీఎంపీ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఎమ్మెల్సీ ఉగ్రప్ప పేరును న్యాయసమ్మతంగానే చేర్చామని, బీజేపీ నేతలు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా ఈ తరహా వైఖరిని మార్చుకోవాలని సూచించారు.