పిసి‘నారి’తనం
Published Thu, Nov 21 2013 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని పార్టీలదీ పిసినారితనమే... అని చెప్పుకోవాలేమో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే. అవకాశం దొరికిన ప్రతిచోటా మహిళా బిల్లు పేరెత్తి గంటలతరబడి ఉపన్యాసాలు దంచే పార్టీలు తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం వారికి పెద్దగా అవకాశం కల్పించడంలేదు. పార్టీ అధ్యక్షురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళే అయినప్పటికీ కాంగ్రెస్ కూడా ఈసారి ఎన్నికల్లో మహిళలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక అడుగడుగునా కాంగ్రెస్‌ను విమర్శించే బీజేపీ మహిళలకు సీట్లు కేటాయించే విషయంలో మాత్రం కాంగ్రెస్ అడుగుజాడల్లోనే నడిచింది.సమాజాన్ని మార్చేస్తామంటూ పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తామేమీ మిగతా పార్టీలకు భిన్నం కాదని నిరూపించుకుంది. ఇలా అన్ని పార్టీలు మహిళలకు మొండిచెయ్యి చూపుతూ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. వారికి సీట్లు కేటాయించడానికి తటపటాయించాయి. ఒకటి.. అరా కేటాయించినా తాము ఎక్కడైతే కచ్చితంగా ఓడిపోతామని నిర్ణయించుకున్న తర్వాతే ఆ స్థానాన్ని మహిళలకు కేటాయించినట్లు పలువురి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆరుగురికి, బీజేపీ నలుగురికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుగురికి మాత్రమే టికెట్లు ఇచ్చాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 1,180 నామినేషన్లు దాఖలు కాగా వారిలో 156 నామినేషన్లు మాత్రమే మహిళలవని ఎన్నికల కమిషన్ తెలిపింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. ఆతరువాతి స్థానం రాజేంద్రనగర్‌కు దక్కింది. ఈ నియోజకవర్గంలో ఆరుగురు మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే నగరంలోని 70 నియోజకవర్గాలలో పోటీ ప్రధానంగా మహిళల మధ్యనే జరుగనున్న నియోజకవర్గం మాత్రం మాలవీయనగర్ నియోజకవర్గమొక్కటే అని చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి కిరణ్ వాలియా, బీజేపీ అభ్యర్థి, మాజీ మేయర్ ఆర్తీ మెహ్రాల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆర్‌కెపురంలోనూ ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్ఖాసింగ్ (కాంగ్రెస్), మాజీ యాంకర్ షాజియా ఇల్మీ (ఆప్)లు బరిలో ఉన్నప్పటికీ ఈ ఇరువురు మహిళలకు బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి ఆరుగురితోనే సరిపెట్టింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ (న్యూఢిల్లీ), మంత్రి కిరణ్‌వాలియా (మాలవీయనగర్), డీసీడబ్ల్యూసీ అధ్యక్షురాలు బర్ఖాసింగ్ (ఆర్‌కేపురం), రాగిణీ నాయక్ (జనక్‌పురి). అమృతా ధవన్(తిలక్‌నగర్), ధన్వంతీ చందీలా (రాజోరీ గార్డెన్)లను కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీ నుంచి మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా (మాలవీయనగర్), మాజీ మేయర్ రజనీ అబ్బీ (తిమార్‌పుర్), ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రెటరీ శిఖారాయ్(కస్తూర్బానగర్), ఈస్ట్ పటేల్ నగర్ కౌన్సిలర్ పూర్ణిమా విద్యార్థి(పటేల్ నగర్) పోటీచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నలుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. కానీ వారిలో ఎవరూ విజయం సాధించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున షాజియా ఇల్మీ ఆర్‌కెపురం నుంచి, ఫర్హానా అంజుమ్ బల్లీ మారన్ నుంచి, భావనా గౌర్ పాలం నుంచి, వందనా కుమారీ పాలిమార్ బాగ్ నుంచి, రాఖీ బిర్లా మంగోల్‌పురి నుంచి, వీణా అనంద్ పటేల్ నగర్ నుంచి పోటీచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 81 మంది మహిళలు పోటీచేయగా కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు.
Advertisement
Advertisement