- 12 మంది అభ్యర్థుల ఖరారు
- ‘దక్షిణం’ నుంచి ‘ఆధార్’ నిలేకని
- తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ ఛాన్‌స
- బళ్లారి నుంచి హనుమంతప్ప, బెల్గాం నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్ పోటీ
- బీజేపీకి పెట్టని కోటగా ‘బెంగళూరు దక్షిణం’
- అక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన అనంత్
- ఐటీ ఉద్యోగుల ఓట్లే అధికం
- నిలేకనితో ఆ స్థానాన్ని కైవసం చేసుకునేలా కాంగ్రెస్ ఎత్తు
- అదే స్థానం నుంచి పోటీ చేయనున్న ఆప్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ కసరత్తును ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సంఘం (సీఈసీ) సమావేశంలో 12 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం అభ్యర్థిగా ‘ఆధార్’ చైర్మన్ నందన్ నిలేకనిని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపిక చేశారని తెలిసింది. తొమ్మిది మంది ప్రస్తుత ఎంపీలకు తిరిగి టికెట్లు లభించనున్నాయి.
బళ్లారి స్థానానికి ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వై. హనుమంతప్ప పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బెల్గాం స్థానానికి లక్ష్మీ హెబ్బాల్కర్ పేరు ఖరారైంది. సీఈసీ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. కాగా బీజేపీ ఇప్పటికే 21 స్థానాలకు, జేడీఎస్ పది స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి.
దక్షిణపై తర్జన భర్జన
ప్రతిష్టాత్మక బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజక వర్గానికి నిలేకని పేరును ఖరారు చేయడానికి ముందు కాంగ్రెస్ నాయకులు తీవ్ర తర్జన భర్జన పడినట్లు తెలిసింది. 1991 నుంచి ఆ స్థానం బీజేపీ చేతుల్లోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి పెట్టని కోట. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత్ కుమార్ వరుసగా ఐదు సార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ అనేక ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితం కనబడ లేదు.
1991, 2004 సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయింది. ఆ నియోజక వర్గంలో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, ఈసారి నిలేకని ద్వారా ప్రయోగం చేయదలచుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఆ స్థానం నుంచి బరిలో దిగుతోంది. దీంతో కాంగ్రెస్ మాటేమో కానీ, బీజేపీకే వణుకు పుడుతోంది. ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన ‘ప్రి పోల్ సర్వే’లో ఈ స్థానం ఆప్ పాలవుతుందనే అంచనాలు వచ్చాయి. మొత్తం 28 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 11, జేడీఎస్‌కు రెండు, ఆప్‌కు ఒక స్థానం దక్కవచ్చని ఆ సర్వే జోస్యం చెప్పింది.