అక్కడ మోదీ.. ఇక్కడ కేసీఆర్
Published Fri, Apr 21 2017 4:40 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాగానే కేసీఆర్ కూడా అబద్ధపు వాగ్దానాలు ఇస్తూ తిరుగుతున్నాడని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ విమర్శించారు. ఆయనిక్కడ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ రైతులకు మద్దతు ధర ఇస్తానని ఇపుడు మరిచిపోయారని అన్నారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ కేసీఆర్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రతి ఏడాది కోటి ఉద్యోగాలు అన్నాడు.. కేసీఆర్ ఏడాదికి లక్ష ఉద్యోగాలన్నాడు.. ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల వాగ్దానాలు ఇవ్వడం తేలికే కానీ.. నెరవేర్చడం కష్టమన్నారు. కేసీఆర్ మాటలు చెబుతున్నాడు కానీ చేతల్లో చూపడం లేదని అన్నారు.
రెండు పడకల గదులు ఎక్కడ ఉన్నాయి..3 ఎకరాల భూ పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ అన్నారు..50 శాతం మించకూడదు అని సుప్రీం తీర్పు ఉన్నా.. షెడ్యూల్ 9 ద్వారా చేస్తా.. రాష్ట్రపతికి పంపిస్తా అనడం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. కాశ్మీర్లో ఓటింగ్ తగ్గింది అంటే.. పీడీపీ, బీజేపీ పార్టీల కలయిక ప్రజలకు ఇష్టం లేదని.. ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఈ సర్కార్ వల్ల ఏ ఒక్క వర్గం అయినా సంతోషంగా ఉందా అని కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంక్‌లు కనీసం లోన్లు ఇచ్చే పరిస్థితుల్లో లేవని.. పేదరికం, ద్రవ్యోల్బణం పెరిగడమే మోదీ చేశారన్నారు. దేశం మారుతోందని.. ప్రధాని నినాదం ఇస్తున్నారు..అసలు ఏం మారిందో చెప్పాలన్నారు. దేశంలో ఆర్థిక స్థితి దిగజారిందని..ప్రైవేటు సెక్టార్‌లో పెట్టుబడులే లేవన్నారు. నిజమైన హిందూ..సత్యం, అహింస ఆచరిస్తారని, కానీ మోదీ హింసను నమ్ముతున్నారని మండిపడ్డారు. ఏం తినాలి..ఏం తినోద్దు..ఏం వ్యాపారం చేయాలో నిర్ణయించడం ఏ ఇతిహాసం నేర్పిందని ఆయన ప్రశ్నించారు.
Advertisement
Advertisement