'మీ తాత పుట్టకముందే కాంగ్రెస్ పుట్టింది'
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సమకాలీన రాజకీయాలకు మచ్చతెచ్చేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. కేటీఆర్ తాత పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తామని ఆయన మాదిరి అన్న నేతలంతా చరిత్రలో కలిసిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బిక్ష వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి, ఆయన కుటుంబానికి నాలుగు పదవులు వచ్చాయని.. కేటీఆర్ మర్చిపోవద్దని అన్నారు. స్థాయికి మించి మాట్లాడితే రానున్నరోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అధికార మదం వద్దని హితవు పలికారు. మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అంటున్న కేటీఆర్‌కు...సోనియాగాంధీ కాళ్ల దగ్గర కేసీఆర్ మూడు తరాల వాళ్లు నిల్చున్నది గుర్తులేదా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ ని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే జాతి కేసీఆర్ కుటుంబానిదని దుమ్మెత్తిపోశారు.