‘కేసీఆర్ మద్దతు వెనుక పెద్ద కుట్ర’
హైదరాబాద్: నగదు రహిత వ్యవస్థకు, ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వత్తాసు పలకటం వెనుక పెద్ద కుట్ర దాగుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రధానమంత్రితో గంటసేపు సమావేశమైన కేసీఆర్ ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సొంత అవసరాల కోసమే కేసీఆర్ ప్రధానికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. నల్లధనం ఎవరి వద్ద ఉన్నది అన్న అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. తుగ్లక్ కంటే అధ్వానంగా కేంద్ర పాలన ఉందని చెప్పారు. పారిశ్రామికవేత్తల వేల కోట్ల రుణ బకాయిలను రద్దు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారని చెప్పారు. గురువారం జరుగనున్న సీఎల్పీ సమావేశంలో పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలు, వ్యవసాయం, వైద్య, విద్యారంగాల తీరును చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.