పెనుదుమారం తర్వాత నగరంలో విద్యుత్, నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో నగరవాసుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. రోజులు గడిచిపోతున్నా ఈ సమస్యలు ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తుండకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది.
సాక్షి, న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. నగరంలో నీరు, విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నాయకులు ముఖ్యకార్యదర్శి శ్రీవాస్తవ కార్యాలయం బయట సోమవారం ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. నగరంలో విద్యుత్ , నీటి సరఫరాలను తక్షణం మెరుగుపరచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శ్రీవాస్తవను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆయనను కాన్ఫరెన్స్ గదిలో గంటన్నరపాటు బంధించారు. ఐదో అంతస్తులో ఉన్న తన కార్యాలయానికి వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. అయితే ఇతర కార్యదర్శులు జోక్యం చేసుకోవడంతో వారు ఆయనను బయటికి రానిచ్చారు. ఆ తరవాత ఆయన గది ఎదుట బైఠాయించి ముఖ్యకార్యదర్శితోపాటు బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు.
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో ఢిల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో ఒకవైపు గంటల తరబడి విద్యుత్ సరఫరాలో కోత, మరోవైపు తాగు నీటి కొరత సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని, అయినప్పటికీ ముఖ్యకార్యదర్శి, విద్యుత్ శాఖ కార్యదర్శి పరిస్థితి బాగానే ఉందంటున్నారన్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు తామేమీ చేయలేమంటున్నారని కాం గ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. నగరానికి విద్యుత్ సరఫరా విషయంలో ఢిల్లీ సర్కారు పూర్తిగా విఫలమైందని లవ్లీ ఆరోపించారు. ఢిల్లీవాసులకు జరుగుతున్న అన్యాయాన్ని తమ పార్టీ సహించబోదని హెచ్చరించారు.
విద్యుత్‌పై ఉత్తుత్తి హామీలు ఇచ్చి మొదట కేజ్రీవాల్ నగరవాసులను మోసగించారని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు విద్యుత్ కొరత సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్డడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు. సమస్య ఇలాగే కొనసాగితే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోగరంలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేదని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి ముఖేష్ శర్మ పేర్కొన్నారు. నగరవాసుల విద్యుత్, నీటి సమస్యల పరిష్కారం విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమస్యల విషయంలో తామేమీ చేయలేమని, దీనిపై కేంద్రాన్ని ఆశ్రయించాలని ముఖ్యకార్యదర్శి చెప్పారని ముఖేష్ శర్మ తెలిపారు. అందుకే ఆయనను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నామని చెప్పారు.
ఢిల్లీలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నందువల్ల ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కోటి మందికిపైగా ఢిల్లీవాసులు విద్యుత్, నీటి నీటి అల్లాడుతున్నా లెఫ్టినెంట్ గవర్నర్ గానీ కేంద్రం గానీ సమస్యను పరిష్కరించడానికి ఏమీ చేయలేదని, బీజేపీ హామీ ఇచ్చిన మంచిరోజులివేనా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో దెబ్బతిన్న విద్యుత్తు లైన్లకు మరమ్మతు చేయడానికి 20 నుంచి 25 రోజుల సమయం పడుతుందని,
పస్తుతానికి తాము తాత్కాలికంగా లైన్లను పునరుద్ధరించి విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ముఖ్యకార్యదర్శి చెప్పారు. విద్యుత్‌ను ఆదాచేయడం కోసం ఏసీలను 25 డిగ్రీ సెల్సియస్ వద్ద నడపాలంటూ ఎల్జీ ఇచ్చిన సలహాను పాటించాల్సిందిగా ముఖ్యకార్యదర్శి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఆదా కోసం రాత్రి పది గంటల తరువాత మాల్స్‌కు సరఫరాను నిలిపివేయాలని, హోలోజన్ వీధి దీపాలను అర్ధరాత్రి తరువాత ఆనపివవేయాలని, ప్రభుత్వ కార్యాలయాలలో విద్యుత్తు పొదుపు చేసే చర్యలు చేపట్టాలని ఎల్జీ సూచించారు.
‘కోత’పై పోరు
Published Mon, Jun 9 2014 10:54 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement