కాంగ్రెస్ కు సైకిల్ దక్కేనా?
సాక్షి, చెన్నై: తమకు మళ్లీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ఆశాభావంతో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు ఎదురు చూపుల్లో పడ్డారు. సీటు కోసం నాలుగు వేల మందికి పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు.రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒకప్పుడు అగ్ర నేతగా జీకేమూపనార్ తన సత్తాను చాటిన విషయం తెలిసిందే. ఆ పార్టీతో ఏర్పడ్డ విభేదాలతో బయటకు వచ్చిన మూపనార్ 1996లో తమిళ మానిల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్టీ రెండు అసెంబ్లీ, మూడు లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొంది. రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ ఎన్నికల్లో సైకిల్ చిహ్నంతో తన సత్తాను తమిళ మానిల కాంగ్రెస్ చాటుకుంది. మూపనార్ మరణంతో పార్టీ పగ్గాల్ని ఆయన తనయుడు జీకే వాసన్ చేపట్టారు. తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీని మళ్లీ కాంగ్రెస్‌లో కలిపేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చిన జీకేవాసన్ మళ్లీ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను తెర మీదకు తెచ్చి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. పొత్తు వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, మళ్లీ బల నిరూపణ దిశగా వాసన్ తన వ్యూహాల్ని అమలు చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పదో తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సాగిన ఈ దరఖాస్తుల పర్వానికి స్పందన బాగానే వచ్చిందని చెప్పవచ్చు.
నాలుగు వేల మందికి పైగా ఆశావహులు తమ కంటే తమకు సీటు కావాలని దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. ఇక, జీకే వాసన్ తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు సమర్పించుకున్న వాళ్లూ ఉన్నారు. ఇక, విల్లివాక్కం సీటు కోసం ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బి జవహర్ బాబు దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, తమకు మళ్లీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు పడ్డాయి.
సైకిల్ గుర్తు దక్కేనా:
సైకిల్ చిహ్నం మళ్లీ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఎన్నికల యంత్రాంగానికి విన్నవించుకునే పనిలో పడ్డారు. తమకు గతంలో కేటాయించిన చిహ్నం మళ్లీ దక్కే రీతిలో చర్యలు తీసుకోవాలని లేఖలు సంధించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇది వరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, తమిళ మానిల కాంగ్రెస్ పేరు పాతే అయినా, కొత్తగా ఆవిర్భవించిన పార్టీ పరిధిలోకి రావడం ఖాయం. రానున్న ఎన్నికల్లో తన సత్తాను చాటుకున్న తదుపరి శాశ్వత చిహ్నం ఈ పార్టీకి దక్కుతుంది.
అందువల్ల ఈ సారి ఆ పార్టీ అభ్యర్థులందరికీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. స్వతంత్ర అభ్యర్థులు ఆ చిహ్నం కోసం రంగంలోకి దిగితే, సంక్లిష్ట పరిస్థితులు తప్పవు. అయితే, ఈ పరిస్థితి బయలు దేరకుండా ముందస్తుగా ఎన్నికల యం త్రాంగాన్ని ఆశ్రయించి సైకిల్‌ను దక్కిం చుకునే ప్రయత్నాలకు టీఎంసీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ విషయంగా పార్టీ నే త ధర్మరాజు పేర్కొంటూ, తమకు సైకిల్ చిహ్నం మళ్లీ దక్కుతుందన్న నమ్మకం ఉందని, తప్పకుండా ఆ చిహ్నం మీదే ఎన్నికల బరిలో తమ అభ్యర్థులు ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.