ఆరోగ్య మంత్రిగా సినీనటి రమ్య
బెంగళూరు: కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిగా కన్నడ నటి రమ్యను తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. రాష్ట్ర పార్టీలో పెరిగిపోతున్న కుమ్ములాటలను పరిష్కరించేందుకు రాష్ట్ర కేబినెట్‌ను పునర్వవ్యస్థీకరించాలని సిద్ధరామయ్య గత కొంతకాలంగా భావిస్తున్నారు. ఈ దిశగా కసరత్తు చేయడంలో భాగంగానే ఆయన ఇప్పుడు ఢిల్లీలో మకాం వేశారు.
ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రిగా పార్టీలో పలు విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ప్రముఖ సినీ నటుడు అంబరీష్‌ను తొలగించి, ఆ స్థానంలో రమ్యను తీసుకోవాలని సిద్ధరామయ్యకు పార్టీ సీనియర్ నాయకుడు ఎస్‌ఎం కృష్ణ ప్రతిపాదించినట్టు తెల్సింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అంబరీష్ ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతినడంతో గత ఏడాది ఆయన్ను సింగపూర్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. అందుకైన కోటిన్నర రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. అప్పటి నుంచి ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందిగా పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. ఇటీవలి కాలంలో అంబరీష్‌ను కూడా సిద్ధరామయ్య బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు.
15వ లోక్‌సభకు మాంధ్య నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సినీనటి రమ్య గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమెకు రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో దేనీలోనూ సభ్యత్వం లేదు. మంత్రివర్గంలోకి తీసుకున్నాక, ఆమెకు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కట్టబెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.