కమాండో మహ్మద్ అబు బాకర్ మృతదేహం( ఫైల్)
అడవులకు వెళ్తున్నా నాన్న
Published Wed, Oct 26 2016 12:17 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
తండ్రితో అబుబాకర్ చెప్పిన ఆఖరి మాట
గాజువాక: ‘మా క్యాంపునకు చేరిపోయాను నాన్నా. అడవులకు బయలుదేరి వెళ్తున్నాం. మా ఆపరేషన్ పూర్తయ్యాక గాని మళ్లీ నీకు ఫోన్ చేయను. నువ్వు కూడా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయకు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను క్షేమంగా వచ్చేస్తాను. భయపడకండి.’ మావోయిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్‌లో దుర్మరణం పాలైన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ తన తండ్రికి ఫోన్ లో చెప్పిన ఆఖరి మాటలివి. గత బుధవారం తమ క్యాంపు నుంచి గాజువాకలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చిన అబు రెండు రోజులపాటు ఇక్కడే గడిపాడు. శుక్రవారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లి.. అదే రోజు రాత్రి తన తండ్రికి ఫోన్ చేశాడు. వీరుడిగా తిరిగొస్తాడని ఎదురు చూస్తున్న తన తల్లిదండ్రులకు వీర మరణం పొందాడన్న కబురు రావడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు.
తాతే స్ఫూర్తి : అబు బాకర్ తాత ఎం.డి.ఇస్మాయిల్ 1993 వరకు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైరయ్యారు. తాతను చూస్తూ స్ఫూర్తి పొందిన బాకర్ పోలీస్ ఉద్యోగం సంపాదించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. 2011లోఎంపికై.. ఇష్టపడి మరీ గ్రేహౌండ్స్‌కు వెళ్లాడు. క్యాంప్‌లో ఉంటే ప్రతిరోజు తమకు ఫోన్ చేసి మాట్లాతుండే వాడని అతడి తల్లిదండ్రులు అమీర్ ఉన్నీషా, మహ్మద్ మదీనా తెలిపారు. తన చెల్లి షాబీరా అంటే బాకర్‌కు ప్రాణమని కన్నీటిపర్యంతమయ్యారు. తన మనవడికి పెళ్లి చేయాలని కూడా అనుకొంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందంటూ అతడి తాత రోదించారు. అబు అధికారుల వద్ద తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కూంబింగ్‌కు ఎప్పుడు వెళ్లినా ముందు వరసలో నిలబడి తన బెటాలియన్ లోనే అత్యంత ధైర్యవంతుడుగా పేరు తెచ్చుకొన్నాడు. అతడి ధైర్య సాహసాలను డీజీపీ సాంబశివరావు సైతం ప్రస్తావించడమే దీనికి నిదర్శనం.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఎన్ కౌంటర్ మృతి చెందిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి అధికార లాంఛనాలతో నిర్వహించారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం, ప్రభుత్వ లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం పోలీసు అధికారులు ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి, సీతారామ్‌నగర్‌లోని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. రాత్రి 10.30 గంటల వరకు మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం భారీ జన సందోహంతో అశ్రునయనాల మధ్య అజీమాబాద్ శ్మశానం వరకు బాకర్ అంతిమయాత్ర కొనసాగింది. అక్కడ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు తమ ఆచారం ప్రకారం ప్రార్థనలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రేహౌండ్స్ డీఐజీ శ్రీకాంత్‌తోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అబు బాకర్ కుటుంబానికి రూ.40 లక్షల చెక్కు అందజేత
ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో జరిగిన ఎన్ కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.40 లక్షల ప్రత్యేక పరిహారం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును డీజీపీ సాంబశివరావు గాజువాకలోని అతని తండ్రి మహ్మద్ మదీనాకు మంగళ వారం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ కమాండో కుటుంబంతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారాన్ని తక్షణమే అందజేస్తామన్నారు. ప్రస్తుత సంఘటన ప్రాధాన్యం దృష్ట్యా మరో రూ.15 లక్షలు కలిపి ప్రత్యేక పరిహారంగా ఈ చెక్కును అందజేశామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కుటుంబానికి ఉద్యోగం, స్థలం,
డీజీపీని కోరిన ముస్లిం నేతలు
గాజువాక: అబు బాకర్ కుటుంబానికి ఉద్యోగంతోపాటు నివాస స్థలం కూడా కేటాయించి న్యాయం చేయాలని స్థానిక ముస్లిం నేతలు డీజీపీ సాంబశివరావును కోరారు. 63వ వార్డు మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ, వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు షౌకత్ ఆలీతోపాటు పలువురు ముస్లిం మత పెద్దలు డీజీపీని కలిశారు. కమాండో సర్వీసు ఉన్నంత కాలం ఆ కుటుంబానికి జీతం వస్తుందని, అతడి సోదరికి పోలీస్ శాఖలో తగిన ఉద్యోగం ఇస్తామని డీపీజీ పేర్కొన్నారు. దీనిపై నాయకులు మాట్లాడుతూ ఆ కుటుంబానికి వెంటనే నివాస స్థలం ఇవ్వాలని కోరారు. కమాండో సోదరికి పోలీస్ శాఖలో కాకుండా రెవెన్యూ, ఇన్ కమ్ టాక్స్ విభాగంలో ఉద్యోగం కల్పించాలన్నారు. స్థలం మంజూరు చేసే విషయంపై కలెక్టర్‌తో సంప్రదిస్తామని, ఉద్యోగం కూడా కుటుంబ సభ్యులు కోరుకొనే విధంగా ఇవ్వడానికి సంబంధిత అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు.
Advertisement