- మంత్రి దినేశ్ గుండూరావు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి సహకార సంఘాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. తన శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు.
రేషన్ షాపులు వంశ పారంపర్యంగా కొందరికే పరిమితమవుతున్నాయని, దీని వల్ల ఫిర్యాదులు కూడా ఎక్కువవుతున్నాయని వెల్లడించారు. ఇకమీదట వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, గ్రామ పంచాయతీలకు రేషన్ షాపులను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాగా పని చేస్తున్న స్వయం సహాయక సంఘాలకు కూడా షాపులను కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న షాపులను కాలక్రమేణా రద్దు చేస్తూ పోతామని చెప్పారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ సహకార సంఘాల చేతుల్లోకి వెళ్లాలనేది ప్రభుత్వ ఆశయమని తెలిపారు. కాగా రాష్ర్టంలో కొత్తగా వెయ్యి రేషన్ షాపులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటిని మంజూరు చేసేటప్పుడు వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రేషన్ షాపులకు భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
లెవీకి స్వస్తి
రాష్ట్రంలో ఇకమీదట రైస్ మిల్లర్ల నుంచి లెవీ బియ్యాన్ని సేకరించే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి బదులు రైతుల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ధాన్యాన్ని ఆహార, పౌర సరఫరాల శాఖ బియ్యం ఆడించి రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు తరలిస్తామని తెలిపారు.