బల్దియాలో.. లంచావతారులు
బల్దియాలో.. లంచావతారులు
Published Fri, Oct 14 2016 1:57 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
పైసలివ్వనిదే కదలని ఫైళ్లు
ఇప్పటికే ఏసీబీ వలలో ఏడుగురు ఉద్యోగులు
అయినా మారని తీరు
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు, సిబ్బంది ప్రజలను రాబందుల్లా పీక్కుతుంటున్నారు. ఉండటానికి ఇళ్లు నిర్మించుకుందామనుకుంటే పునాది వేసినప్పటి నుంచి ఇంటి నెంబర్ వచ్చేంతవరకు లంచావతారులు ప్రజలను జలగల్లా పీక్కుతింటున్నారు. ఆర్‌ఐ కరీముల్లాఖాన్ ఇంటినెంబర్ వేయడానికి భగత్‌నగర్‌లోని పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న వజ్రనివాస్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భగత్‌నగర్‌కు చెందిన మాచర్ల రాంనర్సయ్య వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.
పైసలిస్తేనే!
నగరపాలక సంస్థలో ఏ పని కావాలన్నా లంచంలేనిదే ఫైల్లు కదలడం లేదు. పైసలిస్తే పనులు అవుతున్నాయి. లేదంటే ఏళ్లకొద్దీ కార్యాలయం చుట్టూ తిరిగిన పనిమాత్రం కాదు. బల్దియాలోని అన్ని శాఖల్లో అవినీతి పెచ్చుమీరింది. లంచాలకు అలవాటుపడ్డ అధికారులు పైసలు చేతుల పడందే పనిచేయడం లేదు. రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, అకౌంట్స్, చివరకు పుట్టినా.. చచ్చినా.. సర్టిఫికెట్ కోసం సైతం లంచం సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కార్పొరేషన్‌లో అవినీతి తాండవిస్తున్నా అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినపడుతున్నారుు. అధికారులు, ఉద్యోగులు లంచాలు ముట్టవద్దని, బాధ్యతగా పనిచేయాలంటూ ప్రభుత్వం ఓ వైపు అడ్డగోలుగా వేతనాలు పెంచుతున్నప్పటికీ, గుట్టు చప్పుడు కాకుండా జేబులు నింపుకుని కింది నుంచి పైదాకా వాటాలు పంచుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటుపడ్డ అధికారులు నిజాయితీగా పనిచేసేందుకు ముందుకురావడం లేదు.
రెచ్చిపోతున్న లంచావతారులు
కరీంనగర్ మున్సిపాలిటీలో 1993 నుంచి ఇప్పటి వరకు ఏడుగురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. 1993లో నేతికుంట యాదయ్య అనే కాంట్రాక్టర్‌కు సంబంధించిన బల్లులు చెల్లించేందుకు అకౌంటెంట్ చంద్రశేఖర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 2001లో రాంరెడ్డి అనే బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌ను మాజీ కౌన్సిలర్ మంజీత్‌సింగ్, 2006లో మనోహర్ అనే క్లర్క్‌ను కాంట్రాక్టర్ శ్రీనివాస్, 2007లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బిల్ కలెక్టర్లు బాల్‌రెడ్డి, సంజీవరెడ్డిలను, 2009లో బిల్లుల చెల్లింపులో లంచం అడిగినందుకు మేనేజర్ కైలాసంను కాంట్రాక్టర్ చల్ల హరిశంకర్ ఏసీబీకి పట్టించారు. తాజాగా గురువారం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కరీముల్లాఖాన్ వజ్ర అపార్టుమెంట్ అసెస్‌మెంట్‌కోసం సదరు యజమాని మాచర్ల రాంనర్సయ్య వద్ద రూ.30 వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ను ఆశ్రయించాడు. సామాన్యులను బల్దియా ఉద్యోగులు ఏవిధంగా పీడించుకు తింటున్నారనేది అర్థమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతిని అరికట్టేందుకు, పారదర్శకమైన పాలనను అందించేందకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement