
అదృశ్యమైన దంపతులు శవాలుగా మారి గడ్డివామిలో కాలిబూడిదైన ఘటన కలబుర్గి జిల్లా చించోళి తాలుకా నిడగుందిలో వెలుగు చూసింది.
రాయచూరు రూరల్: అదృశ్యమైన దంపతులు శవాలుగా మారి గడ్డివామిలో కాలిబూడిదైన ఘటన కలబుర్గి జిల్లా చించోళి తాలుకా నిడగుందిలో వెలుగు చూసింది. ఇదో రకం పరువు హత్యగా ప్రచారం జరుగుతోంది. గత నవంబర్ 2న అజయ్ (30), జ్యోతి(25) అనే దంపతులు అదృశ్యమయ్యారు. గుర్తుతెలియని దుండగులు వారిరువురిని హతమార్చి గడ్డివాములో పడేసి దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలిలా ఉన్నాయి. అజయ్, జ్యోతిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 19 నెలలుగా వారి కాపురం సజావుగా సాగుతుండేది. కన్యాశుల్కం ఇవ్వడం అనే ఆచారం పార్థి వర్గీయుల్లో ఉంది. ప్రేమించింది కదా అని జ్యోతి పుట్టింటి వారు అజయ్‌తో ఆమెకు పెళ్లి చేశారు. జ్యోతి సోదరుడు రవి తమకు వధు దక్షిణ ఇవ్వాలని అజయ్‌తో తరచు గొడవపడుతుండేవాడని తెలిసింది.
కిడ్నాప్ చేసి హత్య, దహనం
అయితే అజయ్ ఇవ్వకపోవడంతో పగ పెంచుకున్నారు. రవి పథకం ప్రకారం వీరిద్దరిని కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడని అజయ్ తల్లి ఆరోపించింది. వీరిద్దరూ అదృశ్యమైన విషయంపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలబుర్గిలోని సుళేపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసు విచారణలో దంపతులిద్దరినీ గడ్డివామిలో పడేసి కాల్చినట్లు తేలిందని, విచారణ పూర్తి అయిన అనంతరం అన్ని వివరాలు ప్రకటిస్తామని కలబుర్గి అదనపు ఎస్పీ జయప్రకాష్ తెలిపారు.