డబ్బులు గుంజేందుకే..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టిపై దాఖలైన పరువునష్టం కేసు విచారణను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ కోర్టు సోమవారం ప్రకటించింది. దురుద్దేశంతోనే శెట్టిపై కేసు పెట్టారని, సమాజంలో పరపతి ఉన్న వ్యక్తి కావడంతో ఆయన నుంచి డబ్బు వసూలు చేసేందుకే ఈ పనిచేశారని, ఇలా చేయడం చట్టాలను దుర్వినియోగపర్చడమేనని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా జరిగిన విచారణలో శెట్టి, ఆయన తరఫు న్యాయవాది వినీత్ ధండా ఎక్కడా ఎదుటివారి పరువుకు నష్టం కలిగేలా వ్యవహరించలేదనే విషయం తేలిందని, కేవలం డబ్బులు గుంజేందుకు మాత్రమే ఈ పని చేసినట్లు స్పష్టమవుతోందని, ఆరోపణలు చేసిన వ్యక్తులు వారి పరువుకు నష్టం కలిగినట్లుగా శెట్టి, ధండాలు వ్యవహరించినట్లు ఎక్కడా నిరూపించలేకపోయారని, అందుకే విచారణను నిలిపివేస్తున్నట్లు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సావిత్రి తీర్పునిచ్చారు.
సునీల్ శెట్టిపై ఆరోపణలు రావడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన స్టంట్‌మేన్ పూరణ్ చౌహాన్ దాఖలు చేసిన ఈ కేసులో సునీల్ శెట్టి కూడా స్వయంగా కోర్టుకు హాజరై విచారణను ఎదుర్కొన్నారు. గతంలో ఓ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరైన సునీల్‌శెట్టి, అతని తరఫు న్యాయవాది ధండా తనను కోర్టు ఆవరణలోని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి చితకబాదారని చౌహాన్ ఆరోపించారు. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో.. ఎక్కడా ఇటువంటి ఘటన జరిగినట్లు రుజువు కాలేదు. దీంతో శెట్టి పరపతిని దెబ్బతీసేందుకే చౌహాన్ ఈ కుయుక్తి పన్నినట్లు గుర్తించిన కోర్టు అతణ్ని మందలిస్తూ విచారణను నిలిపివేసింది.