నటుడు రాజ్‌పాల్‌కు తాత్కాలిక ఊరట
Published Wed, Dec 11 2013 1:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు హైకోర్టు జోక్యంతో ఊరట లభించింది. రాజ్‌పాల్ యాదవ్, అతని భార్య వ్యతిరేకంగా వసూలు కోసం ఓ వ్యాపారి దాఖలు చేసిన కేసులో కోర్టును తప్పుదారి పట్టించాడని హైకోర్టు ఏక వ్యక్తి ధర్మాసనం జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని కోర్టు గుర్తించింది.
కోర్టు ఆదేశాల మేరకు రాజ్‌పాల్ విచారణకు హాజరైనా, భార్య రాధ తరఫున తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు గుర్తించింది. కోర్టును తప్పుదోవ పట్టించడం ధిక్కార నేరమని ప్రకటించి పది రోజుల శిక్ష విధించింది. ఏక వ్యక్తి ధర్మాసనం విధించిన 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. ఏక వ్యక్తి ధర్మాసనం విధించిన శిక్ష కోర్టు తదుపరి తీర్పు వరకు నిలుపు దలచేయడంతో పాటు కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. కోర్టు ఆదేశం మేరకు రాజ్‌పాల్ తన పాస్‌పోర్టును రిజిస్ట్రార్ జనరల్‌కు అప్పగించారని,
దీని వలన ఏ ప్రయోజనం కలుగదని వాదించారు. పైగా తన క్లైయింట్ వృత్తి సంబంధ పనులకు విఘాతం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ధర్మాసనం రాజ్‌పాల్ దేశంలో తన వృత్తి సంబంధమైన పనులకు హాజరుకావచ్చని, అయితే దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రతివాది మురళి ప్రాజెక్ట్స్‌కు వారం గడువు లోపు రూ. 20 లక్షల చెక్ ఇస్తానన్న రాజ్‌పాల్ అంగీకారాన్ని కోర్టు నమోదు చేసింది. డిసెంబర్ 2వ తేదీన ఏక వ్యక్తి ధర్మాసనం విచారణలో రాజ్‌పాల్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో అతని భార్య సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కోర్టు గుర్తించింది. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న నేరానికి యాదవ్‌కు పది రోజుల జైలు శిక్ష విధించడంతో పాటు, అతని భార్య రాధ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోర్టు ముగిసే వరకు నిలబడాలని శిక్ష విధించింది.
Advertisement