సాక్షి, ముంబై: నగరానికి వలస వస్తున్నవారివల్లే నేరాల సంఖ్య పెరుగుతోందని హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ పేర్కొన్నారు. బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో దొంగతనాలకు, దోపిడీలకు ముంబైని లక్ష్యంగా చేసుకుంటున్నారని అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేరాలకు పాల్పడుతున్నవారిలో ఇతర ప్రాంతాలవారే ఎక్కువగా ఉంటున్నారని, దీంతో రోజురోజుకు పెరుగుతున్న కొత్త నేరాల కేసులు దర్యాప్తు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. చెంబూర్‌లోని మాహుల్ ప్రాంతంలోగల కోళీ సమాజం మహిళల నుంచి బంగారు నగలు, నగదు తీసుకుని పారిపోయిన బెంగాలీ వడ్డి వ్యాపారిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు పాటిల్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ... ఈ ఘటనతో సంబంధమున్న ఉత్తమ్‌కుమార్ మల్లాను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు 5,382 గ్రాముల బంగారం, రూ.26 లక్షల నగదు.. ఇలా మొత్తం రూ.2 కోట్లు విలువచేసే సొత్తు దోచుకుపోయాడని, ఇప్పటిదాకా 943 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని వెంటనే బదిలీ చేస్తామని కూడా హెచ్చరించామన్నారు.
గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు 693 మంది నేరస్తులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయినట్లు వెలుగులోకి వచ్చిన విషయాన్ని పాటిల్ కూడా అంగీకరించారు. ఇందులో 136 మంది పట్టుబడ్డారన్నారు. పోలీసుల భద్రతపై మాట్లాడుతూ.. వారికి త్వరలోనే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు అందజేస్తామన్నారు. అందుకు నాగపూర్‌కు చెందిన నేకో డిఫెన్స్ సిస్టం కంపెనీకి ఐదు వేల బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించినట్లు పాటిల్ సభలో వెల్లడించారు.
వలసల వల్లే నేరాలు
Published Fri, Dec 13 2013 11:42 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
Advertisement
Advertisement