ప్రచారాలకు చెక్
* నేడు డీఎంకే ఎమ్మెల్యేల భేటీ
* ఆరోపణలపై కరుణ స్పందించే అవకాశం
* పార్టీ వర్గాల ఎదురు చూపు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, వారసుడు స్టాలిన్ మధ్య అంతర్గత సమరం బయలుదేరినట్టు తమిళ మీడియాల్లో సాగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైనట్టుంది. బుధవారం జరిగే డీఎంకే శాసనసభా పక్ష సమావేశంలో ఈ ప్రచారాలపై కరుణానిధి స్పందించే అవకాశాలు ఉన్నాయి.
దళపతి స్టాలిన్ ఏ విధంగా స్పందిస్తారో అన్న ఎదురు చూపులు బయలు దేరాయి. అధికారంలోకి వస్తే డీఎంకే అధినేత ఎం కరుణానిధి సీఎం అవుతారని ఆది నుంచి పార్టీ వర్గాలు స్పష్టం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారం దూరం అయింది. బలమైన ప్రధాన ప్రతి పక్షం చేతికి చిక్కింది. ప్రధాన ప్రతి పక్ష నేతగా స్టాలిన్‌ను ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, కరుణానిధి, స్టాలిన్‌ల మధ్య అంతర్గత సమరం ఎన్నికల అనంతరం బయలు దేరినట్టుగా ప్రచారాలు హల్ చల్ చేస్తున్నాయి.
ఔరంగ జేబుతో కరుణానిధిని పోల్చుతూ, పదవి కోసం వెంపర్లాడుతూ ఉంటే, మొగల్ సామ్రాజ్యం ఏ విధంగా పతనం అయిందో, అదే పరిస్థితి డీఎంకేకు తప్పదన్నట్టుగా స్టాలిన్ మద్దతు వర్గం సోషల్ మీడియాల్లో స్పందించడం వివాదాస్పదంగా మారింది. స్టాలిన్ మద్దతు దారులపై కొరడా ఝుళిపించేందుకు కరుణానిధి సిద్ధ పడటం,దీనిని స్టాలిన్ అడ్డుకున్నట్టుగా తమిళ మీడియాల్లో కథనాలు కోడై కూస్తున్నాయి. అదే సమయంలో కరుణానిధి కాకుండా స్టాలిన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే అధికారం దక్కి ఉండేదన్నట్టుగా కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పరిగణించిన కరుణానిధి కినుకు వహించినట్టుగా ప్రచారం సాగుతున్నది.
తండ్రి, తనయుడి మధ్య సాగుతున్న అంతర్గత సమరం పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నట్టుగా వస్తున్న ఈ ప్రచారాలకు ముగింపు పలికే రీతిలో డీఎంకే అధిష్టానం చర్యలు చేపట్టి ఉన్నది. ఇందుకు తగ్గట్టుగా అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అవుతుండటంతో, పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో అంతర్గత సమరాలు లేవు...అవన్నీ ఒట్టి ప్రచారాలే అని చాటే దిశగా స్టాలిన్ స్పందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, తన వారసుడ్ని ఆకాశానికి ఎత్తే విధంగా కరుణానిధి ప్రసంగించే అవకాశాలు ఎక్కువే.
ఈ దృష్ట్యా, బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో ప్రచారాలన్నింటికీ ముగింపు పలికి, అసెంబ్లీలో ప్రధాన బలమైన ప్రతి పక్షం అంటే, తామే అని చాటుకునే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం ఖాయం. తదుపరి 16వ తేదీ నుంచి కొత్త ప్రభుత్వంలో సాగే, తొలి శాసన సభా పక్ష సమావేశంలో అధికార పక్షంతో కలసి తమిళ ప్రగతిని లక్ష్యంగా బలమైన ప్రతి పక్షం ముందుకు సాగేనా, లేదా అధికార పక్షం దూకుడుతో ఢీ కొట్టే రీతిలో సమరం సాగించేనా అన్నది వేచి చూడాల్సిందే.