
విచారణకు హాజరైన దర్శన్
♦ గంటపాటు ఛాలెంజింగ్ స్టార్‌ను
♦ విచారణ చేసిన పోలీసులు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తన ఇంటికి వచ్చి గొడవ పడుతున్నారంటూ భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్‌ను శనివారం విచారణ చేశారు. దాదాపు గంట పాటు పోలీసులు దర్శన్‌ను విచారణ చేశారు. ఈనెల 9న విజయలక్ష్మి నివాసం
ఉంటున్న సౌత్‌రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు దర్శన్ చేరుకొని అక్కడ గొడవ చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు దర్శన్‌కు సూచించారు. ఫిర్యాదు నమోదైన చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో దర్శన్ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా దర్శన్‌ను విచారణకు త్యాగరాజనగర్‌లోని ఏసీపీ కార్యాలయానికి పోలీసులు మార్చారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం త్యాగరాజనగర్‌లోని ఏసీపీ కార్యాలయానికి దర్శన్ చేరుకున్నారు. బనశంకరి ఉపవిభాగం ఏసీపీ లోకేష్‌కుమార్ నటుడు దర్శన్‌పై అందిన ఫిర్యాదులకు సంబంధించి దర్శన్‌ను విచారణ చేశారు. దర్శన్ ఇచ్చిన వివరణలను సైతం వీరు నమోదు చేసుకున్నారు. ‘నేను ఈనెల 9న ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన విషయం నిజమే. ఆ సమయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డు మీరు ఈ ప్రాంతానికి రావడానికి వీళ్లేదు అంటూ నన్ను అడ్డుకున్నాడు. అప్పుడు నీకు ఈ విషయానికి సంబంధం లేదు’ అని అతనితో గట్టిగా చెప్పాను. అంతేకానీ దాడికి పాల్పడలేదు అని పేర్కొన్నట్లు సమాచారం. కాగా, దర్శన్ త్యాగరాజనగర్‌లోని ఏసీపీ కార్యాలయానికి వస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడారు.
రాజీకి ప్రయత్నిస్తున్న అంబి
ఇక దర్శన్, విజయలక్ష్మి దంపతుల మధ్య రాజీ కుదిర్చి తిరిగి వారు దాంపత్య జీవనాన్ని కొనసాగించేందుకు సీనియర్ నటుడు, మంత్రి అంబరీష్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దంపతులిద్దరితోనూ అంబరీష్ ఈ విషయంపై మాట్లాడారు. మరో రెండు రోజుల్లో దంపతులిద్దరినీ కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్ర మహిళా క మిషన్ సైతం సోమవారం రోజున దంపతులిద్దరి నుంచి వివరాలను సేకరించి వారి మధ్య సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేయనుందని సమాచారం.