బీఎస్‌ఎన్‌ఎల్ అక్రమ కనెక్షన్ల వ్యవహారం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మనవడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ మెడకు ఉచ్చుగా బిగుసుకుంటోంది. మారన్‌కు షాక్ ఇచ్చే రీతిలో సోమవారం మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ముందస్తు బెయిల్ రద్దుతో ఇక అరెస్టు అయ్యేనా అన్న ఉత్కంఠ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం ఎక్కడ డిఎంకేకు శాపంగా మారుతుందోనన్న బెంగ డీఎంకేలో ఉంది.
చెన్నై: 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే మాజీ మంత్రి ఎ.రాజ, కరుణానిధి గారాల పట్టి కనిమొళి ప్రమేయంతో ఆ పార్టీ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎం కేకు చావు దెబ్బ తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఈ సారి అధికార పగ్గాలు లక్ష్యంగా ఉరకలు తీస్తున్న ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టించే పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి మనవడు , కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ మెడకు అక్రమ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల వ్యవహారం ఉచ్చు బిగుస్తుండడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన బయల్తేరింది. ఈ వ్యవహారం ఎలాంటి గడ్డు పరిస్థితులకు దారి తీస్తాయోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది.
ఇదీ కేసు : 2004-2007 కాలంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ వ్యవహరించారు. ఈ సమయంలో తన అధికారాన్ని ప్రయోగించి నాలుగు వందల మేర అక్రమ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల పొందిన ట్టుగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కనెక్షన్లను తన సోదరుడు కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్ సంస్థకు ఉపయోగించినట్టు, తద్వారా ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల మేరకు నష్టం జరిగినట్టుగా ఆరోపణలు బయల్దేరాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తమ చేతిలోకి తీసుకున్న సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఈ అక్రమ కనెక్షన్లతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల మేరకు గండి పడ్డట్టు విచారణలోనూ వెలుగు చూసింది.
ఈ వ్యవహారంలో కొన్ని నెలల క్రితం దయానిధి మారన్ సన్నిహితుడు గౌతమన్, సన్ గ్రూప్ అధికారి టివి కణ్ణన్, ఎలక్ట్రిషియన్ రవిలను సీబీఐ అరెస్టు చేసింది. వీరిని తమ కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులతో మారన్ బ్రదర్స్ ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు. ఈ కేసులో మారన్ బ్రదర్స్ అరెస్టు అవుతారన్న ప్రచారం బయలు దేరినా, కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో బతికి బట్టకట్టారు.
బెయిల్ రద్దు: తనను అరెస్టు చేస్తారన్న ప్రచారంతో హైకోర్టును ఆశ్రయించి నెల రోజుల క్రితం ముందస్తు బెయిల్‌ను దయానిధి మారన్ తెచ్చుకున్నారు. అదే సమయంలో సీబీఐ పిలిస్తే, ఏ క్షణంలోనైనా సరే ఎలాంటి విచారణలకైనా తాను సిద్ధంగా ఉన్నానని కోర్టుకు హామీ సైతం ఇచ్చారు. అయితే విచారణకు మారన్ సహరించడం లేదంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ హైకోర్టులో న్యాయమూర్తి ఎస్ వైద్యనాథన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది.
సోమవారం విచారణ సమయంలో సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని విన్పించారు. వాదనల అనంతరం మారన్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల్లోపు సీబీఐ ఎదుట లొంగి పోవాలని పేర్కొంది. లేకుంటే చట్టపరంగా మారన్‌పై చర్యలు తీసుకోవచ్చని సీబీఐకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు కాస్త మారన్ అరెస్టు అయ్యేనా..? అన్న చర్చకు దారి తీస్తున్నాయి.
మారన్‌కు షాక్
Published Tue, Aug 11 2015 9:23 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement