డీడీఏ హౌసింగ్ స్కీం ప్రారంభం కౌంటర్లు కిటకిట
సాక్షి, న్యూఢిల్లీ:ఉత్కంఠకు తెరపడింది. ఎంతోకాలంగా నగరవాసులంతా ఎదురుచూస్తున్న ‘హౌసింగ్ స్కీం- 2014’ సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ప్రధాన కార్యాలయమైన వికాస్ సదన్‌లో సంబంధిత అధికారులు దీనిని ప్రారంభించారు. దరఖాస్తుల కోసం పెద్దసంఖ్యలో ఔత్సాహిక కొనుగోలుదారులు తరలిరావడంతో కౌంటర్లన్నీ కిటకిటలాడాయి. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ పథకం కింద 25,034 ఫ్లాట్లను విక్రయిస్తాం.
ఇందులో 22,627 ఫ్లాట్లు ఏక పడక గదిని కలిగి ఉంటాయి. ఇందులో కొన్నింటిని గ్రీన్ టెక్నాలజీతో నిర్మించాం’ అని అన్నారు. కాగా తాజా గృహ పథకం కింద డీడీఏ...రూ. ఏడు లక్షలు మొదలుకుని రూ. 1.2 కోట్ల విలువైన ఫ్లాట్లను విక్రయించనుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ, జనతా కేటగిరీల కింద వీటిని విక్రయించనున్నారు. వచ్చే నెల తొమ్మిదో తేదీలోగా దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను డీడీఏ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 రోజుల్లోగా డ్రా తీస్తారు.
డీడీఏ వెబ్‌సైట్ క్రాష్
డీడీఏఏ హౌసింగ్ స్కీమ్ 2014కు మొట్టమొదటి రోజే విశేష స్పందన లభించింది. దీంతో డీడీఏ అధికారిక వెబ్‌సైట్ ్రక్రాష్ అయ్యింది. పథ్కాన్ని ప్రారంభించిన వెంటనే ఐదు లక్షల హిట్స్ వచ్చాయని, ఈ కారణంగా వెబ్‌సైట్ క్రాష్ అయిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం కోసం డీడీఏతో ఒప్పందం చేసుకున్న 13 బ్యాంకుల శాఖల వద్ద కూడా నగరవాసులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఈ కౌంటర్ల ముందు బారులుతీరినవారిలో నగరవాసులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.
సొంతింటి కలను సాకారం చేసుకోవడం కోసం ఈ పథకంపైనే ఆశలు పెట్టుకున్నానని క్యూలో నిలబడిన 18 ఏళ్ల యువకుల నుంచి సీనియర్లు సిటిజన్లు చెప్పడం విశేషం. వీరిలో కొందరు గతంలో ప్రారంభించిన పథకాలకు దరఖాస్తు చేసుకుని నిరాశకు గురైనవారు కూడా ఉన్నారు. గతంలో ఫ్లాటు రాకపోయినా ఈసారి ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలన్న ఆశతో మొదటి రోజునే క్యూలో నిలబడినట్లు వారు చెప్పారు. కాగా డీడీఏ హౌసింగ్ పథకానికి దేశంలోని ఏప్రాంతానికి చెందినవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలాఉంచితే ద్వారక, రోహిణి, నరేలా, సిర్సాపూర్ ప్రాంతాల్లో ఏక పడగ గది కలిగిన ఫ్లాట్లను నిర్మిస్తోంది. నిర్మిత స్థలంతోపాటు, పునాది పై ప్రాంతాన్నిబట్టి ఫ్లాట్ల ధర రూ. 14 లక్షలదాకా ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు.