Delhi Development Corporation
-
లిఫ్టుల ఏర్పాటు ఈజీ
అఫిడవిట్ దాఖలును రద్దుచేసిన డీడీఏ డీడీఏ నిర్మించిన ఫ్లాట్లలో నివసిస్తున్నవారికి శుభవార్త. ఈ భవనాల్లో అవసరమని భావించినవారు లిఫ్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం డీడీఏ నుంచి ఎటువంటి అనుమతి పొందాల్సిన అవసరమే లేదు. న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నిర్మించిన ఫ్లాట్లలో లిఫ్టుల ఏర్పాటు సులభతరంగా మారింది. ఇందుకోసం ఈ సంస్థకు ఇకమీదట ఎటువంటి అఫిడవిట్‌నూ దాఖలు చేయాల్సిన అవసరమే లేదు. ఆయా ఫ్లాట్లలో ఏమైనా మార్పులుచేర్పులను చేపట్టాలంటే ముందుగా డీడీఏకి ఓ అఫిడవిట్‌ను విధిగా దాఖలు చే యాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను డీడీఏ రద్దు చేసింది. దీంతో లిఫ్టు ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాబోవు. లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి ఈ నిబంధన అవరోధంగా పరిణమించింది. దీంతో గత కొన్ని నెలలుగా అనేక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. అంతేకాకుండా ఈ నిబంధనను రద్దు చేయాలంటూ పట్టణ అభివృద్ధి శాఖకు లేఖలు రాశారు. ఆది నుంచి ఈ నిబంధన ఆటంకంగా పరిణమించినందువల్ల గతంలో నిర్మించిన భవనాల్లో లిఫ్టుల ఏర్పాటు సాధ్యం కాలేదంటూ వాదించాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారని ఆరోపించాయి. లిఫ్టులకు సంబంధించిన విధానాన్ని డీడీఏ గతంలో అనేక పర్యాయాలు మార్పులుచేర్పులు చేసింది. చివరిగా ఈ నెల ఒకటో తేదీన కూడా సవరణలు చేసింది. లిఫ్టులను ఏర్పాటు చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సిందేనని పేర్కొంది. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ఫ్లాట్లలో నివసించేవారికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులుచేర్పులు చేస్తున్నామన్నారు. అనధికార నిర్మాణాలనేది మరొక అంశమని, దానిని దీనితో ముడిపెట్టలేమని అన్నారు. తాము నిర్మించిన ఫ్లాట్లలో నివసించేవారికి సంబంధించి ఏ ప్రక్రియ అయినా సులభతరంగా ఉండేవిధంగా చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఈ నిబంధన ఎత్తివేతకు మరేదైనా కారణం ఉందా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ఈ విషయమై అనేక పర్యాయాలు అయా ఫ్లాట్లలో నివసించేవారితో సంప్రదింపులు కూడా జరిపామన్నారు. కాగా లిఫ్టుల ఏర్పాటులో ఆంక్షల రద్దు వల్ల దాదాపు నాలుగు లక్షలమంది లబ్ధి పొందనున్నారు. -
డీడీఏ హౌసింగ్ స్కీం ప్రారంభం కౌంటర్లు కిటకిట
సాక్షి, న్యూఢిల్లీ:ఉత్కంఠకు తెరపడింది. ఎంతోకాలంగా నగరవాసులంతా ఎదురుచూస్తున్న ‘హౌసింగ్ స్కీం- 2014’ సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ప్రధాన కార్యాలయమైన వికాస్ సదన్‌లో సంబంధిత అధికారులు దీనిని ప్రారంభించారు. దరఖాస్తుల కోసం పెద్దసంఖ్యలో ఔత్సాహిక కొనుగోలుదారులు తరలిరావడంతో కౌంటర్లన్నీ కిటకిటలాడాయి. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ పథకం కింద 25,034 ఫ్లాట్లను విక్రయిస్తాం. ఇందులో 22,627 ఫ్లాట్లు ఏక పడక గదిని కలిగి ఉంటాయి. ఇందులో కొన్నింటిని గ్రీన్ టెక్నాలజీతో నిర్మించాం’ అని అన్నారు. కాగా తాజా గృహ పథకం కింద డీడీఏ...రూ. ఏడు లక్షలు మొదలుకుని రూ. 1.2 కోట్ల విలువైన ఫ్లాట్లను విక్రయించనుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, జనతా కేటగిరీల కింద వీటిని విక్రయించనున్నారు. వచ్చే నెల తొమ్మిదో తేదీలోగా దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను డీడీఏ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 రోజుల్లోగా డ్రా తీస్తారు. డీడీఏ వెబ్సైట్ క్రాష్ డీడీఏఏ హౌసింగ్ స్కీమ్ 2014కు మొట్టమొదటి రోజే విశేష స్పందన లభించింది. దీంతో డీడీఏ అధికారిక వెబ్సైట్ ్రక్రాష్ అయ్యింది. పథ్కాన్ని ప్రారంభించిన వెంటనే ఐదు లక్షల హిట్స్ వచ్చాయని, ఈ కారణంగా వెబ్సైట్ క్రాష్ అయిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం కోసం డీడీఏతో ఒప్పందం చేసుకున్న 13 బ్యాంకుల శాఖల వద్ద కూడా నగరవాసులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఈ కౌంటర్ల ముందు బారులుతీరినవారిలో నగరవాసులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవడం కోసం ఈ పథకంపైనే ఆశలు పెట్టుకున్నానని క్యూలో నిలబడిన 18 ఏళ్ల యువకుల నుంచి సీనియర్లు సిటిజన్లు చెప్పడం విశేషం. వీరిలో కొందరు గతంలో ప్రారంభించిన పథకాలకు దరఖాస్తు చేసుకుని నిరాశకు గురైనవారు కూడా ఉన్నారు. గతంలో ఫ్లాటు రాకపోయినా ఈసారి ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలన్న ఆశతో మొదటి రోజునే క్యూలో నిలబడినట్లు వారు చెప్పారు. కాగా డీడీఏ హౌసింగ్ పథకానికి దేశంలోని ఏప్రాంతానికి చెందినవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలాఉంచితే ద్వారక, రోహిణి, నరేలా, సిర్సాపూర్ ప్రాంతాల్లో ఏక పడగ గది కలిగిన ఫ్లాట్లను నిర్మిస్తోంది. నిర్మిత స్థలంతోపాటు, పునాది పై ప్రాంతాన్నిబట్టి ఫ్లాట్ల ధర రూ. 14 లక్షలదాకా ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. -
మన ఫ్లాట్లు మనకే
ఢిల్లీవాసులకే 80 శాతం కేటాయించాలని డీడీఏ యోచన సాక్షి, న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) త్వరలో ప్రకటించనున్న 26,300 ఫ్లాట్ల హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లను నగరవాసులకే కేటాయించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు పంపారు. ఇందుకు ఎల్జీ ఆమోదం లభించినట్లయితే పలువురు ఢిల్లీవాసుల సొంతింటి కల సాకారమయ్యే అవకాశముంది. ఇందువల్ల 80 శాతం ఫ్లాట్లు ఢిల్లీవాసులకు లభిస్తాయి. గతంలో డీడీఏ అనేక పథకాలద్వారా దాదాపు నాలుగు లక్షల ఫ్లాట్లను స్థానికులకు అందుబాటులోకి తెచ్చింది. డీడీఏ విధానం ప్రకారం ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల ఢిల్లీవాసులకు, దేశంలోని మిగతా ప్రాంతాలలో నివసించేవారితో సమంగా ఫ్లాట్లు లభించేవి. పైగా ఈ నగరంలో సొంత ఇంటి అవసరమున్న వారి కంటే దేశంలో ఎక్కడో నివసించేవారికి ఇళ్లు దక్కేవి. ఈ నేపథ్యంలో డీడీఏ పథకంలో ఢిల్లీవాసులకు కొంత శాతం ఇళ్లను రిజర్వ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ డిమాండ్‌ను డీడీఏ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం డీడీఏ వైఖరిలో మార్పు వచ్చింది త్వరలో ప్రకటించనున్న హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లు డిల్లీవాలాల కోసం కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఎల్జీ వద్ద ఉంది. ఎల్జీ దీనిని ఆమోదించవచ్చని భావిస్తున్నారు. ఈ పథకాన్ని డీడీఏ వచ్చే నెలలో ప్రకటించే అవకాశముంది.