తిరువళ్లూరు: ప్లాస్టిక్ డ్రమ్లో కుళ్లిన మృతదేహన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు - పూందమల్లి రహదారిలోని అరుణ్వాయల్ కుప్పం సమీపంలోని కింగ్ఫిషర్ బీర్ కంపెనీ వద్ద చోటు చేసుకుంది. ఈ కంపెనీ సమీపంలోని వంతెన వద్ద ప్లాస్టిక్ డ్రమ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు డ్రమ్ తెరచి చూశారు.
దీంతో డ్రమ్లో మృతదేహన్ని చూసి సెవ్వాపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... డ్రమ్లోని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం వేలి ముద్రల నిపుణులతోపాటు పోలీసు జాగిలాల్ని సంఘటన స్థలానికి రప్పించారు. అవి కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. అయితే మృతదేహం లభించిన ప్రాంతంలో కొంత దూరం వరకు మిరప పొడి చల్లి ఉందని పోలీసులు చెప్పారు. ఈ కేసును సాధ్యమైనంత తర్వలో ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు.