ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై : నామక్కల్ జిల్లా కొసవం పట్టి దేవేంద్ర పురానికి చెందిన స్నేహితులు రవి(42), శరవణన్(45) అట్టపెట్టెల సేకరణ ఏజెన్సీని నడుపుతున్నారు. ఈ ఇద్దరు తమ పిల్లలతో పాటుగా మరో ఇద్దరితో కలిసి అయ్యప్ప దర్శనార్థం రెండు రోజుల క్రితం శబరిమలైకు కారులో బయలు దేరారు. కొసవం పట్టికి చెందిన భక్తుడు రామతిలకం కారును నడిపాడు. అయ్యప్పను దర్శించుకుని శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మరి కాసేపట్లో స్వగ్రామానికి చేరుకోవాల్సిన ఈ అయ్యప్ప భక్తుల బృందాన్ని మృత్యువు కబళించింది. ఆదివారం వేకువ జామున రెండున్నర గంటల సమయంలో నామక్కల్ పరమత్తి పట్టి సమీపంలోని ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొంది.
రెండు వాహనాలు అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో సంఘటనా స్థలంలోనే రవి, ఆయన కుమారులు విఘ్నేశ్వరన్,(13), కార్తీ(5) డ్రైవర్ రామ తిలకం, శరవణన్ కుమారుడు ప్రవీణ్ కుమార్(13)లు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ శరవణన్, విఘ్నేశ్వరరాజు, విజయకుమార్‌ను అటు వైపుగా వె ళుతున్న వాహన చోదకులు గుర్తించారు. గాయపడ్డ ముగ్గుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పరమిత్తి పట్టి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మృత దేహాలను మార్చురీకి తరలించారు. అయ్యప్ప దర్శనం ముగించుకుని వస్తున్న తమవాళ్లను ప్రమాదం రూపంలో మృత్యువు మింగేయడం కొసవం పట్టి దేవేంద్ర పురంలో విషాదాన్ని నింపింది.
బస్సు బోల్తా
కాంచీపురానికి చెందిన 48 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం శనివారం రాత్రి శబరిమలైకు బస్సులో బయలుదేరారు. వీరు పయనిస్తున్న బస్సు వేకువజామున కృష్ణగిరి సమీపంలోని పొచ్చంపల్లి చెరువు కట్ట వద్ద బోల్తా పడింది. బస్సులో ముందు వరుసలో కూర్చుని ఉన్న అయ్యప్ప భక్తురాలు అంజల ఆచ్చి(70) సంఘటనా స్థలంలోనే మరణించారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయట పెట్టారు. వీరందరికీ ప్రథమ చికిత్స అనంతరం శబరి మలైకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.