భవితవ్యం ఈవీఎంలలో భద్రం
Published Thu, Dec 5 2013 12:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రంతో ఢిల్లీలో ఓట్ల పండుగ ముగిసింది. 65 శాతం మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా... గెలుపు ఎవరిది..? ఎవరి బలం ఎంత? నిర్ణయించడం మాత్రం ఇప్పటికీ కష్టంగానే కనిపిస్తోంది. అభివృద్ధే తారక మంత్రంగా ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలు నాలుగోమారు ఢిల్లీ గద్దెపైకి ఎక్కుతామన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌పై ఎక్కుపెట్టిన విమర్శలతోపాటు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచారం తమకు కలిసి వస్తుందని బీజేపీ నాయకులు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నింటా వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈనెల 8 నిర్వహించబోయే ఓట్ల లెక్కింపులోనూ ఊహించని ఫలితాలు నమోదు చేయనున్నట్టు ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.
ఉత్కంఠగా ఎదురుచూపు...
బుధవారం ఉదయం పోలింగ్ మొదలైన ప్పటి నుంచి మందకొడిగా ఉన్న ఓటింగ్ శాతం అనూహ్యంగా చివరి రెండు గంటల్లోనే రికార్డు స్థాయికి చేరుకుంది. ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం ఆయా పార్టీల నాయకులంతా తమదే గెలుపు అంటూ మీడియా ముందు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రె స్‌పార్టీలో దిగ్గజాల ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఓటింగ్ ఫలితాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ పోటీపడుతుండంతో అక్కడి ఫలితాలపై అంతా దృష్టి సారిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి డా. హ ర్షవర్ధన్ కృష్ణానగర్ నుంచి మరోమారు గెలుస్తారని ధీమాగా ఉన్నా, ఈసారి ఓట్ల సంఖ్య తగ్గించడంలో కాంగ్రెస్ అభ్యర్థి డా.మంగూసింగ్ ఏమేరకు సఫలమవుతారో వేచి చూడాలి.
15 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే మరోమారు తమను అధికారంలోకి తెస్తాయని కాంగ్రెస్ నమ్మకంగా ఉన్నా ఇటీవల పెరిగిన కూరగయాల ధరలు, మహిళల భద్రత అంశాలు ఆపార్టీకి నిరాశే మిగల్చనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్న ఢిల్లీవాసులు మద్దతుతో కమల వికాసం తప్పదని బీజేపీ ధీమా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పాలనను చూసిన ఢిల్లీ ఓటర్లు ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో కీలకం కానుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 18 స్థానాలు, బీజేపీకి 32 స్థానాలు, ఆమ్‌ఆద్మీపార్టీకి 18 స్థానాలు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాస్త అటు ఇటూ అయినా ఆమ్ ఆద్మీకి మరింత లాభం చేకూరవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
Advertisement
Advertisement