బీజేపీ పదవుల నుంచి తప్పుకుంటున్న విజయ్ గోయల్ సన్నిహితులు
Published Wed, Aug 21 2013 10:42 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్‌కు అత్యంత సన్నిహితుడైన సుధాంశు మిట్టల్ రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆమీర్ రజా హుస్సేన్ తప్పుకోవడం, తాజాగా మిట్టల్ రాజీనామా చేయడం ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతం చేస్తున్నాయి. కొద్ది కాలంలోనే ఎన్నికలున్న సమయంలోనే కీలక వ్యక్తుల రాజీనామాలు పార్టీ విజయంపై ప్రభావం చూపే అవకాశముందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఎన్నికల సెల్ కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన మిట్టల్ ఆ లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు మంగళవారం సాయంత్రం అందజేశారు. అయితే రాజీనామాకు గల కారణాలు మిట్టల్ వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నా విజయ్ గోయల్‌కు అత్యంత సన్నిహితుడైన మిట్టల్ రాజీనామా పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ గద్దెనెక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో మిట్టల్ తప్పుకోవడం కిందిస్థాయి కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వరుసగా తప్పుకుంటున్న గోయల్ మద్దతుదారులు
సుధాంశు మిట్టల్ ఢిల్లీ బీజేపీ ఎన్నికల సెల్ కన్వీనర్‌గా పనిచేస్తూ ఎలక్షన్ వార్ రూమ్ మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. ఆయన గోయల్‌కు సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. గోయల్‌కు సన్నిహితుడైన ఆమీర్ రాజా హుస్సేన్ కూడా కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ అల్లర్లకు నరేంద్ర మోడీ బాధ్యుడని, ఆయనను తన నేతగా గుర్తించనని అన్నందుకు హుస్సేన్ రాజీనామా చేయవలసి వచ్చిందన్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా మిట్టల్ రాజీనామా వెనుక కూడా మోడీకి సన్నిహితుడైన జాతీయ నేత హస్తముందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మిట్టల్‌ను ఎలక్షన్ సెల్ కన్వీనర్‌గా నియమించినప్పుడే ఆయన వ్యతిరేకించారని అంటున్నారు. ఢిల్లీ బీజేపీలో జాతీయ నేతల జోక్యాన్ని, అంతఃకల హాలను తట్టుకోలేక మిట్టల్ రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
వ్యక్తిగత కారణాలతోనే తప్పుకున్నారు: గోయల్
వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ఎన్నికల సెల్ కన్వీనర్ పదవికి మిట్టల్ రాజీనామా చేశారని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ అన్నారు. రాష్ట్ర బీజేపీలో 40 ఎన్నికల విభాగాలు ఉన్నాయని, అందులో ఇదొకటి మాత్రమేనని వ్యాఖ్యానించారు.
గోయల్ బలాన్ని తగ్గించే యత్నం
ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ గోయల్ నమ్మినబంటులను పార్టీ అధిష్టానం కావాలనే తప్పిస్తోందని పార్టీలోని ఓ వర్గం వాదిస్తోంది. ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో గోయల్ బలాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటోంది. అందుకే అతని సన్నిహితులను ప్రధాన పదవుల నుంచి తప్పిస్తోందని వాదిస్తోంది. దీనికి మొన్న ఆమీర్ రజా హుస్సేన్, ఇప్పుడు సుధాంశు మిట్టల్ రాజీనామాలనే ఉదంతాలుగా చెబుతోంది. గోయల్, మిట్టల్ ఇతర నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే అన్ని నిర్ణయాలు తీసుకోవడంతో అసంతృప్తి చెందిన కొంత మంది నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతోనే అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు మిట్టల్ రాజీనామా చేశారని గోయల్ వ్యతిరేకీయులు అంటున్నారు. త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని, ఆ తర్వాత గోయల్ ప్రాధాన్యత మరింత తగ్గే అవకాశముంటుందని చర్చించుకుంటున్నారు.
Advertisement
Advertisement