సాక్షి, న్యూఢిల్లీ:వృద్ధుల కోసం దేశంలోనే భారీ హౌసింగ్ ప్రాజెక్టును నిర్మించాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) యోచిస్తోంది. ఇందులోభాగంగా రోహిణీలో 24 ఎకరాల విస్తీర్ణంలో 4,500 సింగిల్ రూమ్ ఫ్లాట్లను నిర్మించే ప్రతిపాదనను డీడీఏ రూపొందిం చింది. సామూహిక వంట గదులు, క్యాంటీన్లు, వైద్య, వినోద సదుపాయాలతో కూడిన ఈ ప్లాట్లను వృద్ధులకు అద్దెకు ఇస్తారు. త్వరలో జరగనున్న డీడీఏ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచుతారు. డీడీఏ బోర్డు చైర్మన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారని ఆశిస్తున్నారు. సీనియర్ సిటిజన్ సర్వీస్ అపార్ట్‌మెంట్ పేరిట ఈ ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య (పీపీఏ) విధానంలో అమలుచేస్తారు. ఈ ప్రాజెక్టులో ఈక్విటీ పార్ట్‌నర్‌గా వ్యవహరించే డీడీఏ స్థలాన్ని కేటాయిస్తుంది.
డీడీఏకి భాగస్వామిగా ఉండే ప్రైవేట్ డెవలపర్ భవంతులను నిర్మించి, నిర్విహ స్తారు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో వృద్ధుల కోసం జిమ్నాసియం, లైబ్రరీ, వాకింగ్ ట్రాక్, మెడికల్ రూమ్, వినోద సదుపాయాలతోపాటు యోగా శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తారు. నర్సులు కూడా అందుబాటులో ఉంటారు. అరవై సంవత్సరాలు, అంతకుపైబడిన వయసుగలవారికి ఈ అపార్ట్‌మెంట్లను జీవితకాలంపాటు అద్దెకు ఇస్తారు. అద్దెకు పొందిన వ్యక్తి మరణించినట్లయితే వెయిటింగ్ లిస్టులో తరువాత ఉన్న వ్యక్తికి ఇది లభిస్తుంది. ప్రతి సంవత్సరం జాబితాను నవీకరిస్తారు. వృద్ధులకోసం మాత్రమే వసతి కేటాయించే ప్రతి పాదనను తాము చాలాకాలంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం అలాంటి సదుపాయాలు అత్యంత పరిమితంగా ఉన్నాయని, దక్షిణాదిలో కొన్ని ప్రాజెక్టులు, మెట్రో నగరాలలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని డీడీఏ అధికారి ఒకరు తెలియజేశారు.
అయితే ప్రైవేట్ డెవలపర్లు ఈ ప్రాజెక్టులను రూపొందించినందువల్ల వాటిలో అద్దెలు చాలా అధికంగా ఉండడమో లేక వెయిటింగ్ జాబితా ఎక్కువగా ఉండడమో జరుగుతోందని ఆయన వివరించారు.వృద్ధులు సులువుగా, ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఈ కాంప్లెక్స్‌లో తాము కల్పించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇవన్నీ అందుబాటు ధరల్లో ఉండేలా చూడడానికి తాము ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఫ్లాట్లు, వైద్య సదుపాయాలు, ఆహార నాణ్యత విషయంలో ఈ ప్రాజెక్టులో చురుకైన పాత్ర పోషించాలని డీడీఏ భావిస్తోందన్నారు. వీటి నియంత్రణను తమ కింద ఉంచుకోవడం ద్వారా యాజమాన్యం జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలనుకుంటున్నామన్నారు.
అందువల్లనే ఈ స్థలాన్ని వేలం వేయడం లేదని డీడీఏ అధికారి తెలిపారు. దేశంలో ఈ తరహా ప్రాజెక్టు ఇదొక్కటే అని ఆయన చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తరువాత డీడీఏ ఈ ప్రాజెక్టు కోసం ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌ని నియమిస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది? గదుల అద్దె ఎంత ఉండాలి? అనేది ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సలహా ఇస్తారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రైవేటు భాగస్వామిని టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నారు.
వృద్ధులకోసం దేశంలోనే భారీ హౌసింగ్ ప్రాజెక్టు
Published Sat, Jul 5 2014 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement