Delhi Development Authority
-
‘సెంట్రల్ విస్టా’పై మాదే తుది నిర్ణయం: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర పార్లమెంటు సమీపంలో కొత్తగా చేపట్టదలచిన భవన నిర్మాణాల ప్రాజెక్టు ‘సెంట్రల్ విస్టా’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయి మార్పులేవైనా చేస్తే అందుకు వారిదే బాధ్యత అని హెచ్చరించింది. ప్రాజెక్టు భవితవ్యం తమ నిర్ణయంపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీ నగర మాస్టర్ ప్లాన్‌లో మార్పుల విషయాన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి తెలియజేయాల్సిన అవసరం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం విచారించింది. పలు చారిత్రక స్మారకాలు ఉన్న ప్రాంతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టడం వల్ల అవి ఇంకోచోటికి తరలిపోయే అవకాశముందని పిటిషనర్ పేర్కొనగా ప్రాజెక్టు ఒక్క వారంలోనే పూర్తి కాబోవడం లేదని బెంచ్ స్పష్టం చేసింది. -
దేవుడికీ తప్పని కుల వివక్ష
కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 500 ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్ రవిదాస్ మందిర్‌ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. అది ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢీడీఏ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు కూడా తోసిపుచ్చింది. 1450లో వారణాసిలో అంటరాని కులంలో జన్మించిన సంత్ రవిదాస్ కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, ప్రారంభించిన భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. సంత్ రవిదాస్ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవుళ్ళకో నీతి ఎలా ఉంటుంది. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష. మానవ అభ్యున్నతికి పాటుపడిన మహనీ యులను దేవుళ్ళతో సమంగా తలుస్తారు. రాళ్ళూ రప్పల కంటే సమాజానికి ఏదో ఒకటి చేసి చనిపోయినవారిని కొలవడంలో తప్పుపట్టాల్సిన పనిలేదు. కాకపోతే భారత దేశానికి మాత్రమే పరిమితమైన కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. సరిగ్గా ఇదే కోణంలో సంత్ రవిదాస్ దేవాలయం కూల్చివేతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయిదు వందల ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్ రవిదాస్ మందిర్‌ను ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. 1992లో ఢిల్లీ డెవ లప్మెంట్ అథారిటీ రవిదాస్ మందిర్‌ను అక్కడి నుంచి తొలగించా లని, మందిర్ నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది. ఆ మందిర్ ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే మందిర్ నిర్వాహకులు దీనిని వ్యతిరేకిస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు. కానీ న్యాయస్థానాలలో సంత్ రవిదాస్ మందిర్ నిర్వా హకుల మాట చెల్లుబాటు కాలేదు. అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి దానిని తొలగించాలని న్యాయస్థానం నిర్ధారించింది. అందుకను గుణంగానే ఈనెల మొదటి వారంలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రవిదాస్ మందిర్‌ను నిలువునా కూల్చివేసింది. ఈ సంఘటన పంజాబ్, హర్యానాలతో సహా ఉత్తర భారతాన్ని ఓ కుదుపు కుదిపే సింది. రవిదాస్ మందిర్‌ను కూల్చివేసినందుకు ఆగస్టు 21వ తేదీన ఢిల్లీలో వేలాది మంది నిరసన ప్రదర్శన చేశారు. రవిదాస్ సాంప్రదా యాన్ని అవలంభిస్తున్న వాళ్లే కాకుండా, అనేక సంఘాల కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పంజాబ్, హర్యానాల్లో రోజుల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి. సంత్‌రవిదాస్ మందిర్‌ను కూల్చడం వెనుక కుల వివక్ష, సామాజిక అణచివేతలే కారణమని భావించక తప్పదు. సంత్ రవిదాస్ మందిర్ చరిత్రను పరిశీలిస్తే, ఈ వాదనకు బలం చేకూరుతుండడం కూడా సుస్పష్టం. సంత్ రవిదాస్ 1450 సంవత్సరంలో వారణాసిలోని అంటరాని కులంలో జన్మించారు. ఆయన కుటుంబం చర్మకార వృత్తిలో జీవితం సాగిస్తుండేది. అప్పటికే పంజాబ్‌తో సహా ఉత్తర భారతదేశంలో సిక్కుమతం పురుడు పోసుకుంటోంది. సంత్ రవిదాస్ కూడా అదే తరహాలో కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, తన భక్తి ఉద్య మాన్ని ప్రారంభించాడు. సిక్కు మత వ్యవస్థాపకులైన గురునానక్‌ను సంత్ రవిదాస్ కలిసినట్టు సంత్ రవిదాస్ రాసిన కొన్ని పద్యాలు సిక్కు మత పవిత్ర గ్రంథమైన ‘‘ఆదిగ్రం«థ్’’లో పొందుపరిచినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. సంత్ రవిదాస్ అనుచరులు క్రమంగా సిక్కుమతంలో చేరిపోయారు. కానీ అక్కడ కూడా కుల వ్యవస్థ పైశాచికత్వం కోరలు చాచింది. అంటరాని కులాల్లో సైతం కుల వివక్ష కొనసాగింది. దానిని నిరసించిన వాళ్ళు ప్రత్యేకంగా రవిదాస్ మందిర్‌ను నిర్మించుకొని తమ సాంప్రదాయాలను కొనసా గిస్తూ వచ్చారు. వీరంతా చమార్ల నుంచి వచ్చినప్పటికీ. వీరిని రవి దాసియా చమార్లుగా పిలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాప కులు కాన్షీరాం ఈ సామాజిక నేపథ్యం నుంచి వచ్చినవారే. రవిదాస్ సాంప్రదాయానికి చెందిన రామానంద్దాస్ను 2009లో వియన్నాలో కొంత మంది హత్యచేశారు. సిక్కు అగ్రకుల శక్తులే ఈపని చేశారని భావించిన రవిదాస్ అనుచరులు తమకు తాముగా ప్రత్యేక మతంగా ప్రకటించుకున్నారు. కానీ రవిదాస్ సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ప్రధాన గురుద్వారాలలో భాగస్వాములు కాలేకపోయారు. పదిహేనవ శతాబ్దం నుంచి ప్రారంభమైన సంత్ రవిదాస్ భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. కుల వివక్షను బద్దలు కొట్టుకొని, కొన్ని వేల మంది విదేశాలలో ఈ రోజు స్వేచ్ఛా జీవులుగా గడుపుతున్నారు. భారతదేశం నుంచి విదేశాల్లో స్థిరపడిన పంజాబీలలో సగం మందికి పైగా సంత్ రవిదాస్ భక్తులే ఉంటా రంటే ఆశ్చర్యం లేదు. సంత్ రవిదాస్ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారని చెప్పొచ్చు. ఆయన వారణాసి ప్రాంతంలోనే కాదు, దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించి ఎంతో మందిని తన మార్గంలోకి తీసుకొచ్చారు. ఆ క్రమం లోనే ఆయన ఢిల్లీని సందర్శించి, అప్పటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్లోడి మన్ననలు పొందారు. అందుకు గాను ఆయన సంత్ రవిదాస్‌కు ఢిల్లీలో ఇప్పుడున్న ప్రాంతంలో కొంత భూమిని కేటాయించి, ఆశ్రమ నిర్మాణానికి అవకాశమిచ్చారు. అప్పటి నుంచి అదే స్థలంలో సంత్ రవిదాస్ మందిర్ నిర్మాణం జరిగింది. 1949లో గురు రవిదాస్ జయంతి ఉత్సవ సమితి ఏర్పాటై, అక్కడ కొన్ని వసతులతో కూడిన రవిదాస్ మందిర్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 1949లో ప్రారంభమైన ఆ నిర్మాణం 1954లో పూర్తయ్యింది. అప్పటి రైల్వే శాఖా మంత్రి జగజ్జీవన్ రాం 1954లో దానికి ప్రారంభోత్సవం చేశారు. దాదాపు అయిదు వందల ఏళ్ళకు పైగా గురు రవిదాస్ బోధనలకు కేంద్రమైన ఈ మందిర్‌ను 1992లో అటవీప్రాంతంలో ఉన్నదని నోటీసులు ఇచ్చి, 2019లో కూల్చి వేశారు. దీన్ని బట్టి చూసినా ఇది కేవలం వివక్షతో చేసిందన్న విషయం సుస్పష్టం. ఒకవేళ గురు రవిదాస్ మందిర్ అటవీ ప్రాంతంలో ఉన్నదంటే, చాలా దేవాలయాలు, ఆశ్రమాలూ, అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఢిల్లీలోనే చూసినట్లయితే ప్రభుత్వం గుర్తించిన ఆరు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. పాత ఢిల్లీలోని నార్తరన్ రిడ్జ్, మంగేర్ బని అడవి, రాజోక్రి అటవీప్రాంతం, జహన్పన సిటీ ఫారెస్ట్, తుగ్లక్ బాద్ రిడ్జ్ ఫారెస్ట్, సంజయ్ వనం వాటిపేర్లు. సంజయ్ వనంలో రామ్ తలాబ్ మందిర్, ప్రాచీన గురు గోరఖ్‌నాథ్ మందిర్, తుగ్లక్ బాద్ అడవిలో కాళి బారిదేవాలయం ఉన్నాయి. వీటిలో వేటికీ కూడా నోటీసులు లేవు. కూల్చివేతలు లేవు. ఒకవేళ రక్షిత అటవీ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలూ ఉండకూడదని భావిస్తే ఈ దేవాలయాలను కూడా తొలగించడానికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తన అధికారాలను ఉపయోగించి ఆ పనిచేయాలి. కానీ అలా జరగలేదు. అంతేకాదు, ఈ దేశంలోని దేవాలయాలలో సగానికిపైగా రక్షిత అటవీ ప్రాంతంలోనే నిర్మితమై ఉన్నాయి. కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం సహా చాలా దేవాలయాలు మంగళదేవి, దేవియార్ ఫారెన్ టెంపుల్, కర్ణాటకలోని హిమావత్ గోపాలస్వామి దేవాల యం, ఉత్తరాఖండ్‌లోని అనేక దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరు పతి, శ్రీశైలం అహోబిలం ఇట్లా చెప్పుకుంటూపోతే కొన్ని వందల పేర్లు వస్తాయి. ఇక్కడ పొరపాటు పడొద్దు. ఈ దేవాలయాలను కూల్చాలనో, తొలగించాలనో నా అభిప్రాయం కాదు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవు ళ్ళకో నీతి ఎలా ఉంటుంది అన్నదే నా ప్రశ్న. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష. నిజానికి ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి భాగమున్నది. 1992లో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు ఇచ్చినప్పుడే ఈ చర్యని అడ్డుకోవాల్సింది. ఆ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, సానుభూతి తెలి పితే ప్రయోజనమేముంటుంది? పోనీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా ఎందుకు దీనిని పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా సామాజిక వివక్ష, అణచివేత, వెలివేతలకు ఒక నిలువెత్తు నిదర్శనం. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఎన్నో ప్రాజెక్టులకు రక్షిత అటవీ ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్ట్‌లలో, అభయా రణ్యాలలో రహదారులకు, రైల్వే లైనులకు, పరిశ్రమలకు అనుమతి ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఒకటì æరెండున్నర ఎకరాల రవిదాస్ మందిరానికి మినహాయింపు ఇవ్వలేకపోవడం ఏ సామాజిక న్యాయాన్ని సూచిస్తున్నది? రోడ్లకి అడ్డంగా కుప్పలుగా పుట్టుకొస్తోన్న దేవాలయాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరిస్తోంటే, దాన్ని వదిలేసి, ఎక్కడో అడవిలో కట్టుకున్న ఆలయాన్ని సైతం నిర్దాక్షి ణ్యంగా కూల్చేయడం లోని మతలబుని అర్థం చేసుకోలేనంత వెర్రి జనం కాదుకదా ప్రజలు. కోట్లాది మంది దళితులు, ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే తప్పును సరిదిద్దుకొని, ఆ స్థలంలోనే గురు రవిదాస్ మందిరాన్ని నిర్మించి ప్రాయశ్చిత్తం చేసు కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే దేవాలయాల్లో దళితుల ప్రవే శాన్ని అడ్డుకున్నట్టే, నేడు దళితుల దేవుళ్లని చివరకు అడవినుంచి సైతం తరమికొట్టే ప్రయత్నాలుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే వాటిని కాపాడుకోవడానికి ఆ వర్గాలు మరో మహోద్య మానికి ఉద్యుక్తులు కావాల్సి వస్తుంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
నెల రోజుల్లో 1,500 ఫ్లాట్ల వాపసు
సాక్షి, న్యూఢిల్లీ: లక్కీ డ్రాలో డీడీఏ ఫ్లాటు పొందడమంటే లాటరీ తగిలినట్లే అనుకునే రోజులు పోయాయి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన హౌజింగ్ స్కీమ్ -2014 కింద ఫ్లాట్లు అలాటైనవారిలో 1500 మంది తమ ఫ్లాట్లను వెనక్కి ఇచ్చేశారు. నెలరోజుల్లో ఫ్లాట్లు నిరాకరించినవారి సంఖ్య వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి సంఖ్య క ంటే ఎక్కువగా ఉండడం విశేషం. వెయిటింగ్ లిస్టులో 1200 మంది ఉన్నారు. డిమాండ్ లెటర్లు జారీ అయ్యేలోగా ప్లాట్లను నిరాకరించేవారి సంఖ్య మరింత పెరుగవచ్చని కూడా అంటున్నారు. వాపసు చేసిన ఫ్లాట్లు ద్వారకా, రోహిణీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, ఇక్కడున్న డీడీఏ ఫ్లాట్లకు రాకపోకలు సాగించడం కష్టమని ఫ్లాట్లు వాపసు చేసినవారు అంటున్నారు. ప్రజారవాణా వ్యవస్థ కూడా బాగాలేదని అంటున్నారు. నరేలాకు ప్రజారవాణా వ్యవస్థ సరిగాలేదని, రోహిణీ సెక్టార్ 34, 35లలో మరో ఆరువేల ప్లాట్లు నిర్మించవలసిఉందని అంటున్నారు. కర్వాలా గ్రామ వాసులతో జరిగిన గొడవ కారణంగా రోహిణీలో ఫ్లాట్ల నిర్మాణం ఆలస్యమైంది. ద్వారకాలో నిర్మించిన ఫ్లాట్లు చాలా చిన్నగా ఉన్నాయని కూడా అంటున్నారు. ఈడబ్ల్యుఎస్ కేటగిరీ కోసం నిర్మించిన ఫ్లాట్లను డీడీఏ ఆఖరి నిమిషంలో సాధారణ కేటగిరీ కింద నుండే డీడీఏ వన్ బీహెచ్‌కే ఫ్లాట్ల కేటగిరిలో చేర్చించిందని అంటున్నారు. ఫ్లాట్లు అలాటైనవారు ఐదేళ్ల వరకు వాటిని విక్రయించరాదని డీడీఏ విధించిన షరతు కూడా కొందరిని ఫ్లాట్లను వాపసుచేసేలా చే సిందని చెబుతున్నారు. -
వృద్ధులకోసం దేశంలోనే భారీ హౌసింగ్ ప్రాజెక్టు
సాక్షి, న్యూఢిల్లీ:వృద్ధుల కోసం దేశంలోనే భారీ హౌసింగ్ ప్రాజెక్టును నిర్మించాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) యోచిస్తోంది. ఇందులోభాగంగా రోహిణీలో 24 ఎకరాల విస్తీర్ణంలో 4,500 సింగిల్ రూమ్ ఫ్లాట్లను నిర్మించే ప్రతిపాదనను డీడీఏ రూపొందిం చింది. సామూహిక వంట గదులు, క్యాంటీన్లు, వైద్య, వినోద సదుపాయాలతో కూడిన ఈ ప్లాట్లను వృద్ధులకు అద్దెకు ఇస్తారు. త్వరలో జరగనున్న డీడీఏ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచుతారు. డీడీఏ బోర్డు చైర్మన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారని ఆశిస్తున్నారు. సీనియర్ సిటిజన్ సర్వీస్ అపార్ట్మెంట్ పేరిట ఈ ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య (పీపీఏ) విధానంలో అమలుచేస్తారు. ఈ ప్రాజెక్టులో ఈక్విటీ పార్ట్నర్గా వ్యవహరించే డీడీఏ స్థలాన్ని కేటాయిస్తుంది. డీడీఏకి భాగస్వామిగా ఉండే ప్రైవేట్ డెవలపర్ భవంతులను నిర్మించి, నిర్విహ స్తారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో వృద్ధుల కోసం జిమ్నాసియం, లైబ్రరీ, వాకింగ్ ట్రాక్, మెడికల్ రూమ్, వినోద సదుపాయాలతోపాటు యోగా శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తారు. నర్సులు కూడా అందుబాటులో ఉంటారు. అరవై సంవత్సరాలు, అంతకుపైబడిన వయసుగలవారికి ఈ అపార్ట్మెంట్లను జీవితకాలంపాటు అద్దెకు ఇస్తారు. అద్దెకు పొందిన వ్యక్తి మరణించినట్లయితే వెయిటింగ్ లిస్టులో తరువాత ఉన్న వ్యక్తికి ఇది లభిస్తుంది. ప్రతి సంవత్సరం జాబితాను నవీకరిస్తారు. వృద్ధులకోసం మాత్రమే వసతి కేటాయించే ప్రతి పాదనను తాము చాలాకాలంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం అలాంటి సదుపాయాలు అత్యంత పరిమితంగా ఉన్నాయని, దక్షిణాదిలో కొన్ని ప్రాజెక్టులు, మెట్రో నగరాలలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని డీడీఏ అధికారి ఒకరు తెలియజేశారు. అయితే ప్రైవేట్ డెవలపర్లు ఈ ప్రాజెక్టులను రూపొందించినందువల్ల వాటిలో అద్దెలు చాలా అధికంగా ఉండడమో లేక వెయిటింగ్ జాబితా ఎక్కువగా ఉండడమో జరుగుతోందని ఆయన వివరించారు.వృద్ధులు సులువుగా, ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఈ కాంప్లెక్స్‌లో తాము కల్పించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇవన్నీ అందుబాటు ధరల్లో ఉండేలా చూడడానికి తాము ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఫ్లాట్లు, వైద్య సదుపాయాలు, ఆహార నాణ్యత విషయంలో ఈ ప్రాజెక్టులో చురుకైన పాత్ర పోషించాలని డీడీఏ భావిస్తోందన్నారు. వీటి నియంత్రణను తమ కింద ఉంచుకోవడం ద్వారా యాజమాన్యం జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలనుకుంటున్నామన్నారు. అందువల్లనే ఈ స్థలాన్ని వేలం వేయడం లేదని డీడీఏ అధికారి తెలిపారు. దేశంలో ఈ తరహా ప్రాజెక్టు ఇదొక్కటే అని ఆయన చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తరువాత డీడీఏ ఈ ప్రాజెక్టు కోసం ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌ని నియమిస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది? గదుల అద్దె ఎంత ఉండాలి? అనేది ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సలహా ఇస్తారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రైవేటు భాగస్వామిని టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నారు. -
జలాశయాల అభివృద్ధికి కొత్త విధానం
నగరవ్యాప్తంగా ఉన్న జలాశయాలను పునరుద్ధరించేందుకు వివిధ స్వచ్ఛందసంస్థల (ఎన్జీఓ) నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన డీడీఏ, చివరికి నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. జలాశయాల పునరుద్ధరణ, పరిరక్షణ, నిర్వహణ కోసం ఇవి కార్పొరేట్ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరిస్తాయి. - ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులు - డీడీఏ నిర్ణయం న్యూఢిల్లీ: తన అధీనంలో ఉన్న 63 జలాశయాలు/జలవనరుల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో చేపట్టాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) భావిస్తోంది. ఇందుకోసం వివిధ స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన డీడీఏ, నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. పురాతన కట్టడాల సంరక్షణ కోసం పనిచేసే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) కూడా ఇందులో ఉందని డీడీఏ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇది వరకే మథుర, బృందావన్‌లో పనిచేసే బ్రజ్ ఫౌండేషన్, కేరళలో సరస్సును శుద్ధీకరించే సామర్థ్య, ఫోరం ఫర్ ఆర్గనైజ్డ్ రిసోర్సెస్ కన్సర్వేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ (ఫోర్స్) అనే మూడు ఎన్జీఓలను కూడా డీడీఏ ఎంపిక చేసింది. ఫోర్స్ ఇది వరకే ఢిల్లీలోని పలు జలవనరుల పునరుద్ధరణ కోసం పనిచేసింది. ఈ నాలుగు స్వచ్ఛంద సంస్థలు త్వరలోనే 63 జలాశయాలను పరిశీలించి తమ ప్రతిపాదనలను సమర్పిస్తాయి. ప్రతి ప్రాజెక్టుకూ డీడీఏ స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. జలాశయాల పునరుద్ధరణ, పరిరక్షణ, నిర్వహణ కోసం ఈ స్వచ్ఛందసంస్థలు కార్పొరేట్ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరిస్తాయి. డీడీఏ కూడా ఈ పనుల్లో పాల్గొంటుంది. ఒక్కో సంస్థ సామర్థ్యం, ఆసక్తి, సౌలభ్యాన్ని బట్టి సంబంధిత ప్రాజెక్టు కేటాయిస్తామని డీడీఏ అధికారులు తెలిపారు. ఒకే ప్రాజెక్టుపై బహుళ ఎన్జోఓలు ఆసక్తి చూపిస్తే తుది ఎంపిక నిర్వహణకు ప్రత్యేక విధానాన్ని ఎంచుకుంటామని చెప్పారు. ఈ సంస్థలు తమ ప్రాధాన్యాలను వెల్లడించగానే ప్రాజెక్టుల కేటాయింపును మొదలుపెడతామని డీడీఏ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. -
అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు: వెంకయ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన కేంద్ర మంత్రులు నివాసం ఉండేందుకు మాజీ కేంద్రమంత్రులు తమ నివాసాలు ఖాళీ చేయాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. జూలై రెండో వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని వెంకయ్య ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుందని వెంకయ్యనాయుడు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
అదనపు వనరులను అన్వేషించండి
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో నీటి సరఫరా. విద్యుత్ తదితర సమస్యల పరిష్కారం కోసం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజ్‌నివాస్‌లో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), జల్ బోర్డు అధికారులతో జరిగిన తొలి సమావేశంలో ఆయన ద్వారకాకు నీటిసరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించా రు. ద్వారకాకు నీటిసరఫరాను కొనసాగిస్తూనే ఇత ర వనరుల నుంచి అదనంగా నీరందించే మార్గాలను అన్వేషించాల్సిందిగా ఎల్జీ వారికి సూచించా రు. ద్వారకా ప్రాంతానికి నీరందించాల్సిందిగా డీడీఏని ఆదేశించారు. ఈ సందర్భంగా డీడీఏ అధికారులు మాట్లాడుతూ ఈ నెల 20 నాటికి ద్వారకాకు అదనపు నీటిని అందుబాటులోకి తేనున్నట్లు ఎల్జీకి తెలియజేశారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం రానున్న మూడు నెలల పాటు ద్వారకాకు ఉచితంగా నీటి ట్యాంకర్లను సరఫరా చేసే మార్గాన్ని అన్వేషించాల్సిందిగా ఎల్జీ... డీడీఏకి సూచించారు. డీజేబీ, డిస్కం అధికారులతోనూ సమీక్ష ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ) అధికారులతో పాటు డిస్కం అధికారులతో జరిపిన మరో సమావేశంలో నూ నజీబ్ జంగ్ నగరంలో నీటి సరఫరాతో పాటువిద్యుత్ సరఫరాను సమీక్షించారు. ఏప్రిల్ 23న జరిగిన సమావేశంలో జారీ చేసిన ఆదేశాలను డీజేబీ, డిస్కంలు ఏ మేరకు అమలుచేస్తున్నాయనే విషయాన్ని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. నజీబ్ జంగ్ సూచన మేరకు నీటి ట్యాంకర్ల నుంచి నీరు వృథాగా పోకుండా చేయడంకోసం స్టీలు ట్యాంకర్లను వినియోగిస్తున్నట్టు డీజేబీ తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం కోసం అనేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయడంతోపాటు, మూడు కాల్ సెంటర్లు, 24 వాటర్ ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు డీజేబీ అధికారులు తెలిపారు.ఈ కంట్రోల్ రూముల పనితీరును నజీబ్ జంగ్ స్వయంగా ఫోన్ చేసి పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీజేబీ నీటి శుద్ధి ప్లాంట్ ఉన్న ప్రాంతాలలో కోతలు లేకుండా చూడాలంటూ నజీబ్ జంగ్.. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. విద్యుత్ కోతలకు సంబంధించిన నివేదిక తనకు సమర్పించాల్సిందిగా ఎల్జీ... డిస్కంలను ఆదేశించారు. మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన ఎల్జీ ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నగరవాసులకు చేరవేసేందుకు వీలుగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్‌ను ఎల్జీ నజీబ్ జంగ్ గురువారం ఆవిష్కరించారు. దీంతోపాటు నవీకరించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. కాగా ట్రాఫిక్ మొబైల్ అప్లికేషన్‌ను ఢిల్లీ ట్రాఫిక్ విభాగం అభివృద్ధి చేసింది. దీనిని తమ తమ సెల్ఫోన్లలో వాడుకునే నగరవాసులు ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయకపోతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు వీలవుతుంది. -
డీడీఏ స్థలాల్లో కల్యాణ మండపాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ఏ చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా స్థలం దొరకడం తలకు మించిన భారమే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తం పెట్టేది పురోహితులే అయినా వాటిని ఖరారు చేసేది మాత్రం స్థానికంగా ఉండే టెంట్ మాఫియానే. ఫంక్షన్ హాళ్లకు వేలకు వేలు పోసే స్తోమత లేనివారు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) ఖాళీ స్థలాల్లో షామియానాలు వేసుకుని పని కానిచ్చేస్తుంటారు. కమీషన్లు ముట్టజెప్పి మరీ బతిమాలుకున్నా ఒక్కోసారి స్థలం దొరకని పరిస్థితి ఉంటుంది. వీటిని చెల్లించుకోవాలంటే పేద, మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇదే అదనుగా టెంట్ మాఫియా సైతం రెచ్చిపోతోంది. స్థానికంగా ఉన్న స్థలాల్లో శుభకార్యాలు చేసుకునేందుకు కమీషన్లు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాల్లో కల్యాణ మండపాలు నిర్మించాలని డీడీఏ యోచిస్తోంది. డీడీఏ స్థలాల్లో 500 చదరపు మీటర్ల నుంచి 2వేల చదరపు మీటర్లు ఉన్న స్థలాల్లో వీటిని నిర్మించేందుకు డీడీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే కులసంఘాల సహాయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. స్థానికుల సహకారంతో నిర్మించే మండపాలు వారే వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నారు. అన్నీ కుదిరితే మరో రెండు మూడు నెలల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. డీడీఏ స్థలాల్లో కల్యాణ మండపాలు వస్తే స్థానికులకు ఎంతోమేలు జరుగుతుందని ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెంట్ మాఫియా దోపిడీపై ఇది వరకే ఫిర్యాదు చేసినా డీడీఏ నుంచి స్పందన లేదన్నారు. -
హాయిగా ఆడుకోనివ్వండి
మైదానాలు లేక, పార్కుల్లో చోటు లేక పిల్లలు ఏం కావాలని హైకోర్టు ఆవేదన 14వేలల్లో పిల్లలకు 126 మాత్రమేనా? మున్సిపాలిటీలకు సూటిప్రశ్న రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ఆటస్థలాలు లేవు. వీధుల్లో ఆడుకునే పరిస్థితి లేదు. పార్కులు పెద్దవారికే పరిమితమవుతున్నాయి. పిల్లలను ఓ మూలకు నెడుతుండడంతో వారు ఆడుకోలేని పరిస్థితి. దీంతో శారీరక వ్యాయామం లేక పిల్లలు అధిక బరువుతోనో, మరే ఇతర రుగ్మతలతోనో బాధపడుతున్నారు. న్యూఢిల్లీ : నగరంలోని మూడు కార్పొరేషన్స్‌లో 14వేల పార్కులున్నాయి. కానీ అందులో కేవలం 126 మాత్రమే పిల్లలవి. సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్నుండి వచ్చిన లేఖకు స్పందించిన ఢిల్లీ హైకోర్టు... నగరంలోని పార్కుల పరిస్థితిని, వాటి నిర్వహణ వివరాలను రెండు వారాల్లోగా తమకు నివేదించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. పిల్లలు ఆడుకోకుండా ఆభరణాలుగా ఉన్న పార్కులు అంతరించి పోతాయని తెలిపింది. పిల్లలకు పార్కులు సరిగా లేకపోవడం, ఉన్న పార్కుల్లో ఆడుకునే స్థలం ఎక్కువగా లేకపోవడానికి ఒక్క ప్రభుత్వ సంస్థలనే దూషించాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆటలాడి ఇళ్ల అద్దాలు పగలగొడతారేమో, ప్రజలను గాయపరుస్తారేమో, గడ్డి పాడవుతుందనో పార్కుల్లో పిల్లలను ఆడుకోనియకుండా పెద్దలే ప్రధాన శత్రువులవుతున్నారు. పార్కుల్లో ‘పిల్లలు ప్రవేశించరాదు, ఇది తాకరాదు, అది తాకరాదు’ అంటూ బోర్డులు పెడతారు. చివరకు పోలీసులు కూడా ఆడుకోనివ్వకుండా పిల్లలను పార్కులనుంచి వెళ్లగొడుతున్నారు. క్రీడా మైదానాలుండవు. వీధుల్లో మొత్తం వాహనాలే ఉంటాయి? మరి పిల్లలెక్కడికి వెళ్లాలి? ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. చిత్తరంజన్ పార్కులో ఒకటో బ్లాకు చాలా అందంగా ఉంటుంది. అక్కడి వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి కిటికీకి తగిలి గాజు కిటికీ పగిలిపోయింది. దాంతో వీధుల్లో వారిని ఆడుకోనివ్వడం లేదు. ‘‘పార్కులోకి గార్డు మమ్మల్ని అనుమతించడు. బ్యాడ్మింటన్ గ్రౌండ్ ఉన్నా అది ఎప్పుడూ పెద్దవాళ్లతో నిండిపోయి ఉంటుంది. వాళ్లు మమ్మల్ని వేరే పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. ఇంకో పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. కానీ అది మా ఇంటికి చాలా దూరం కావడంతో మా అమ్మానాన్న అక్కడికి పోనివ్వరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చిన్నారి శుభం. ఇదిలా ఉంటే.. ఆ పార్కును ఓ టెంట్ హౌజ్ ఉపయోగించుకుంటోంది. ప్రతిచోటా ఏదో ఒక అడ్డంకి. మరి పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడికి పోవాలి? ‘‘పార్కుల్లో పిల్లలు ఆడుకోవడం వల్ల అక్కడే వాకింగ్ చేస్తున్న మాలాంటివాళ్లకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అందుకే బాల్వంటివి లేకుండా ఇతర ఆటలు ఆడుకొమ్మని చెబుతున్నాం’’ అన్నాడు భార్యతో కలిసి వాకింగ్‌కు వచ్చిన స్థానిక వాసి గోపాల్పాండే. అయితే దీన్ని అందరూ అంగీకరించడం లేదు. ఆడుకోవడానికి మైదానాలు లేక పిల్లలు అధిక బరువు పెరుగుతున్నారు. ప్రతిచోటా పిల్లలకోసం స్థలం కేటాయించాలని ఎంపీడీ-2021 చెప్పినా... అవి చెట్ల పెంపకానికే పరిమితమై చూడటానికే ఉన్నాయి తప్ప పిల్లలు ఆడుకోవడానికి లేదని, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో సభ్యత్వం తీసుకునే స్తోమత ప్రతి ఒక్కరికీ ఉండదు కదా అంటున్నారు స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అశోక్ బోస్. అయితే పిల్లల కోసం ప్రతి వార్డులో పార్కు, స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కార్పొరేషన్ ప్రణాళిక కాగితాలకే పరిమితమైపోయింది. కొన్ని అకాడమీలతో తాము మాట్లాడామని, త్వరలోనే అవి ఓ రూపుదాల్చుతాయని అంటున్నారు దక్షిణ ఢిల్లీ మేయర్ సరితా చౌదరి. పిల్లలను ఆడుకోవడానికి పార్కుల్లోకి అనుమతించినా పిల్లల భద్రత కోసం ప్రతి పార్కులో సిబ్బందిని ఏర్పాటు చేయలేమన్నది అధికారుల వాదన. ఇదిలా ఉంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి ఏటా 300 కోట ్ల రూపాయలను పార్కుల మీద ఖర్చు చేస్తోంది. కానీ ఆ పార్కుల్లో పిల్లలను ఓ మూలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.కేవలం పిల్లలు మాత్రమే ఆడుకుంటున్న ఒకే ఒక్కటి ద్వారకా సెక్టార్ 11లోని పార్కు . ఇది పిల్లల కోసమేనని రెండేళ్ల కిందటే ప్రకటించారు. మానసిక, శారీరక వైకల్యంతో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి అందులో ఏర్పాట్లు చేశారు.