హాయిగా ఆడుకోనివ్వండి
మైదానాలు లేక, పార్కుల్లో చోటు లేక పిల్లలు ఏం కావాలని హైకోర్టు ఆవేదన
14వేలల్లో పిల్లలకు 126 మాత్రమేనా?
మున్సిపాలిటీలకు సూటిప్రశ్న
రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆటస్థలాలు లేవు. వీధుల్లో ఆడుకునే పరిస్థితి లేదు. పార్కులు పెద్దవారికే పరిమితమవుతున్నాయి. పిల్లలను ఓ మూలకు నెడుతుండడంతో వారు ఆడుకోలేని పరిస్థితి. దీంతో శారీరక వ్యాయామం లేక పిల్లలు అధిక బరువుతోనో, మరే ఇతర రుగ్మతలతోనో బాధపడుతున్నారు.
న్యూఢిల్లీ : నగరంలోని మూడు కార్పొరేషన్స్‌లో 14వేల పార్కులున్నాయి. కానీ అందులో కేవలం 126 మాత్రమే పిల్లలవి. సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్‌నుండి వచ్చిన లేఖకు స్పందించిన ఢిల్లీ హైకోర్టు... నగరంలోని పార్కుల పరిస్థితిని, వాటి నిర్వహణ వివరాలను రెండు వారాల్లోగా తమకు నివేదించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. పిల్లలు ఆడుకోకుండా ఆభరణాలుగా ఉన్న పార్కులు అంతరించి పోతాయని తెలిపింది.
పిల్లలకు పార్కులు సరిగా లేకపోవడం, ఉన్న పార్కుల్లో ఆడుకునే స్థలం ఎక్కువగా లేకపోవడానికి ఒక్క ప్రభుత్వ సంస్థలనే దూషించాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆటలాడి ఇళ్ల అద్దాలు పగలగొడతారేమో, ప్రజలను గాయపరుస్తారేమో, గడ్డి పాడవుతుందనో పార్కుల్లో పిల్లలను ఆడుకోనియకుండా పెద్దలే ప్రధాన శత్రువులవుతున్నారు.
పార్కుల్లో ‘పిల్లలు ప్రవేశించరాదు, ఇది తాకరాదు, అది తాకరాదు’ అంటూ బోర్డులు పెడతారు. చివరకు పోలీసులు కూడా ఆడుకోనివ్వకుండా పిల్లలను పార్కులనుంచి వెళ్లగొడుతున్నారు. క్రీడా మైదానాలుండవు. వీధుల్లో మొత్తం వాహనాలే ఉంటాయి? మరి పిల్లలెక్కడికి వెళ్లాలి? ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి.
చిత్తరంజన్ పార్కులో ఒకటో బ్లాకు చాలా అందంగా ఉంటుంది. అక్కడి వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి కిటికీకి తగిలి గాజు కిటికీ పగిలిపోయింది. దాంతో వీధుల్లో వారిని ఆడుకోనివ్వడం లేదు. ‘‘పార్కులోకి గార్డు మమ్మల్ని అనుమతించడు. బ్యాడ్మింటన్ గ్రౌండ్ ఉన్నా అది ఎప్పుడూ పెద్దవాళ్లతో నిండిపోయి ఉంటుంది.
వాళ్లు మమ్మల్ని వేరే పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. ఇంకో పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. కానీ అది మా ఇంటికి చాలా దూరం కావడంతో మా అమ్మానాన్న అక్కడికి పోనివ్వరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చిన్నారి శుభం. ఇదిలా ఉంటే.. ఆ పార్కును ఓ టెంట్ హౌజ్ ఉపయోగించుకుంటోంది. ప్రతిచోటా ఏదో ఒక అడ్డంకి. మరి పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడికి పోవాలి?
‘‘పార్కుల్లో పిల్లలు ఆడుకోవడం వల్ల అక్కడే వాకింగ్ చేస్తున్న మాలాంటివాళ్లకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అందుకే బాల్‌వంటివి లేకుండా ఇతర ఆటలు ఆడుకొమ్మని చెబుతున్నాం’’ అన్నాడు భార్యతో కలిసి వాకింగ్‌కు వచ్చిన స్థానిక వాసి గోపాల్‌పాండే. అయితే దీన్ని అందరూ అంగీకరించడం లేదు. ఆడుకోవడానికి మైదానాలు లేక పిల్లలు అధిక బరువు పెరుగుతున్నారు.
ప్రతిచోటా పిల్లలకోసం స్థలం కేటాయించాలని ఎంపీడీ-2021 చెప్పినా... అవి చెట్ల పెంపకానికే పరిమితమై చూడటానికే ఉన్నాయి తప్ప పిల్లలు ఆడుకోవడానికి లేదని, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో సభ్యత్వం తీసుకునే స్తోమత ప్రతి ఒక్కరికీ ఉండదు కదా అంటున్నారు స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అశోక్ బోస్. అయితే పిల్లల కోసం ప్రతి వార్డులో పార్కు, స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కార్పొరేషన్ ప్రణాళిక కాగితాలకే పరిమితమైపోయింది.
కొన్ని అకాడమీలతో తాము మాట్లాడామని, త్వరలోనే అవి ఓ రూపుదాల్చుతాయని అంటున్నారు దక్షిణ ఢిల్లీ మేయర్ సరితా చౌదరి. పిల్లలను ఆడుకోవడానికి పార్కుల్లోకి అనుమతించినా పిల్లల భద్రత కోసం ప్రతి పార్కులో సిబ్బందిని ఏర్పాటు చేయలేమన్నది అధికారుల వాదన.
ఇదిలా ఉంటే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతి ఏటా 300 కోట ్ల రూపాయలను పార్కుల మీద ఖర్చు చేస్తోంది. కానీ ఆ పార్కుల్లో పిల్లలను ఓ మూలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.కేవలం పిల్లలు మాత్రమే ఆడుకుంటున్న ఒకే ఒక్కటి ద్వారకా సెక్టార్ 11లోని పార్కు . ఇది పిల్లల కోసమేనని రెండేళ్ల కిందటే ప్రకటించారు. మానసిక, శారీరక వైకల్యంతో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి అందులో ఏర్పాట్లు చేశారు.