డీడీఏ స్థలాల్లో కల్యాణ మండపాలు
Published Tue, Apr 22 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ఏ చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా స్థలం దొరకడం తలకు మించిన భారమే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తం పెట్టేది పురోహితులే అయినా వాటిని ఖరారు చేసేది మాత్రం స్థానికంగా ఉండే టెంట్ మాఫియానే. ఫంక్షన్ హాళ్లకు వేలకు వేలు పోసే స్తోమత లేనివారు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) ఖాళీ స్థలాల్లో షామియానాలు వేసుకుని పని కానిచ్చేస్తుంటారు. కమీషన్లు ముట్టజెప్పి మరీ బతిమాలుకున్నా ఒక్కోసారి స్థలం దొరకని పరిస్థితి ఉంటుంది. వీటిని చెల్లించుకోవాలంటే పేద, మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇదే అదనుగా టెంట్ మాఫియా సైతం రెచ్చిపోతోంది.
స్థానికంగా ఉన్న స్థలాల్లో శుభకార్యాలు చేసుకునేందుకు కమీషన్లు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాల్లో కల్యాణ మండపాలు నిర్మించాలని డీడీఏ యోచిస్తోంది. డీడీఏ స్థలాల్లో 500 చదరపు మీటర్ల నుంచి 2వేల చదరపు మీటర్లు ఉన్న స్థలాల్లో వీటిని నిర్మించేందుకు డీడీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే కులసంఘాల సహాయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. స్థానికుల సహకారంతో నిర్మించే మండపాలు వారే వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నారు. అన్నీ కుదిరితే మరో రెండు మూడు నెలల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. డీడీఏ స్థలాల్లో కల్యాణ మండపాలు వస్తే స్థానికులకు ఎంతోమేలు జరుగుతుందని ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెంట్ మాఫియా దోపిడీపై ఇది వరకే ఫిర్యాదు చేసినా డీడీఏ నుంచి స్పందన లేదన్నారు.
Advertisement
Advertisement