ఆప్ నేత పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
Published Sun, Apr 6 2014 10:46 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేసేలా ఆదేశించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. గత ఏడాది డిసెంబర్ 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కానిస్టేబుల్ నవాబ్ అలీతో రంజన్ ప్రకాశ్, మరో ఇద్దరు ఆప్ కార్యకర్తలు గొడవపడ్డారు. దీంతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ప్రకాశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ... తాము ఆప్ కార్యకర్తలమైనందునే పోలీసులు కేసు పెట్టారని ఆరోపించారు. పోలింగ్ బూత్ వద్ద జరిగిన చిన్నపాటి ఘటనకే మొదట క్రిమినల్ కేసు పెట్టారని, ఆ తర్వాత దానిని సాధారణ నేరం చేసినట్లు మార్చారని, అది కూడా తాము ఆప్ కార్యకర్తలమైనందునే ఇలా తప్పుడు కేసులకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. ఆప్ కార్యకర్తల దాడిలో వాయవ్య ఢిల్లీలోని కిరారీ నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడని, పోలింగ్ బూత్ వద్ద నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్నందుకే ఇలా దాడికి తెగబడ్డారని కోర్టుకు తెలిపారు. వాదోపవాదాలను విన్న న్యాయమూర్తి వీణా బీర్బల్.. ఆప్ నేత పిటిషన్‌ను కొట్టివేశారు.
Advertisement
Advertisement