మెట్రో స్టేషన్లలో ‘ఆటోటాప్’ సేవలు | Delhi Metro launches Automatic Fare Collection facility | Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్లలో ‘ఆటోటాప్’ సేవలు

Published Wed, Mar 5 2014 10:24 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

Delhi Metro launches Automatic Fare Collection facility

న్యూఢిల్లీ: స్టేషన్లలోని ప్రవేశద్వారాల వద్ద ఉండే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ యంత్రాల ద్వారా ప్రయాణికులు తమ స్మార్ట్‌కార్డులను రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని ఢిల్లీ మెట్రో బుధవారం నుంచి ప్రారంభించింది. ఆటోటాప్‌గా పిలిచే ఈ రీచార్జి సేవలు నగరవ్యాప్తంగా 54 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వర్గాలు తెలిపాయి. ఇందర్‌లోక్- ముండ్కా కారిడార్‌లోని అన్ని స్టేషన్లు, ఛత్తర్‌పూర్- హుడా సిటీసెంటర్ మార్గంలోని తొమ్మిది స్టేషన్లు, లైన్ 1లోని దిల్షద్‌గార్డెన్, షహద్రా, వెల్‌కమ్, సీలంపూర్, శాస్త్రిపార్క్ స్టేషన్లు, లైన్ 3, 4లో కార్కర్‌డూమా, నిర్మాణ్‌విహార్, లక్ష్మీనగర్, ప్రగతిమైదాన్, బారాఖంబా రోడ్డు, ఆర్కే ఆశ్రమ్‌మార్గ్, జంధేవాల న్, రాజేంద్రప్లేస్ స్టేషన్లలో ఆటోటాప్ సేవలను పొందవచ్చు. డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్, మరికొందరు సీనియర్ అధికారులు బారాఖంబా రోడ్డు స్టేషన్‌లో ఆటోటాప్ సేవలను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీళ్లు స్వయంగా తమ స్మార్ట్‌కార్డులను నూతన పద్ధతిలో రీచార్జ్ చేసుకున్నారు. ఆటోటాప్ సేవల కోసం డీఎంఆర్సీ ఐసీఐసీఐ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది.
 
 రీచార్జ్ సేవలు పొందాలనుకునే ప్రయాణికులు తమ డెబిట్/క్రెడిట్‌కార్డుల నుంచి నిర్ణీత మొత్తం మినహాయించుకునేందుకు అనుమతిస్తూ ‘స్టాండిం గ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫారం’పై సంతకం చేయాలి. ఈ ఫారాలను స్వీకరించడానికి ఐసీఐసీఐ బ్యాంకు సికందర్‌పూర్, హుడాసిటీ సెంటర్, బాదర్‌పూర్, నెహ్రూప్లేస్, గోవింద్‌పురి, లజ్‌పత్‌నగర్, కైలాష్ కాలనీ స్టేషన్లలో తమ సిబ్బందిని నియమించింది. ఆసక్తి గల ప్రయాణికులు తమ వివరాలను మెట్రో స్టేషన్ల వినియోగదారుల సేవాకేంద్రాల్లో అందజేస్తే బ్యాంకు అధికారులు ఫోన్లో సంప్రదించి వివరాలు ఇస్తారు. బ్యాంకు ఆటోటాప్ సేవలను యాక్టివేట్ చేయడానికి వారం రోజులు పడుతుంది. ఈ సదుపాయం ఉన్న వినియోగదారుడి కార్డులో నగదు రూ.100 కంటే తగ్గితే వెంటనే రూ.200 జమవుతాయి. రాబోయే ఎనిమిది నెలల్లో అన్ని స్టేషన్లలోనూ ఈ సదుపాయాన్ని ప్రవేశపెడతామని డీఎంఆర్సీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement