డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షించిన ఢిల్లీ మెట్రో
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలపైకి రానున్నాయి. ఢిల్లీ నగరంలోని ఉత్తర ప్రాంతంలో గత నెల రోజులుగా డ్రైవర్ రహిత రైళ్లను ఢిల్లీ మెట్రో పరీక్షిస్తోంది. ఫేస్ 3 కింద రెండు కారిడార్లను ఈ పరిధిలోకి తీసుకురానున్నారు.
దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను దిగుమతి చేసుకున్నారు. ఇవి ఇప్పటికే ఢిల్లీలోని ముకుంద్పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు వచ్చే ఫిబ్రవరి నాటికి రావచ్చు. 'సిగ్నలింగ్ సిస్టమ్, ఎలెక్ట్రికల్ ఫిటింగ్స్తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షిస్తున్నాం. ఈ రైళ్లను దక్షిణ కొరియాలో తయారు చేశారు. భారత్లో ఇలాంటి నమూనా రైలునే తయారు చేశారు. బెంగళూరులో తయారు చేసిన ఓ రైలు గత డిసెంబర్లో ఢిల్లీకి చేరుకుంది. ఫేస్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను అందుబాటులో ఉంచుతాం. ప్రాథమిక పరీక్షల్లో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అయితే పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతాం' అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రతినిధి అనుజ్ దయాల్ చెప్పారు. ఢిల్లీ మెట్రో సిస్టమ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లు నేరుగా డ్రైవర్ రహిత రైళ్ల గమనాన్ని పర్యవేక్షిస్తాయి. 56 కిలో మీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లో చేరుకుందని, సరాసరి వేగం గంటకు 35 కిలో మీటర్లు ఉంటుందని దయాల్ చెప్పారు.
ఈ రైళ్లను హ్యుందాయ్ రోటెమ్ రూపొందించినట్టు దయాల్ తెలిపారు. 20 కోచ్లను మాత్రమే దక్షిణ కొరియా నుంచి నౌకలో దిగుమతి చేసుకున్నామని, మిగిలిన 366 కోచ్లను (6 కోచ్లు గల 61 రైళ్లు)ను బెంగళూరులో తయారు చేస్తున్నట్టు తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని రూపొందిస్తున్నారు.