నర్సరీ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల ఆరాటం
Published Thu, Sep 26 2013 2:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
న్యూఢిల్లీ: తమ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో నర్సరీ నుంచే మంచి పాఠశాలలో చేర్పించాలని ఉవ్విళ్లూరుతున్న ఢిల్లీ వాసులు, దానికోసం ఎన్ని వ్యయప్రయాసలనైనా తట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో తమ నివాసాలకు 15-18 కి.మీ. దూరంలో ఉన్న జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతాలకు సైతం పంపేందుకు వెనుకాడటంలేదు. దీనికోసం కొందరు తల్లిదండ్రులు సొంత రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకొంటుండటం గమనార్హం. డిఫెన్స్ కాలనీకి చెందిన చార్టెడ్ ఎకౌంటెంట్ శ్రుతి కపూర్ తన కుమారుడిని 15 కి.మీ. దూరంలో ఉన్న పాఠశాలలో చేర్పించింది.
‘ఢిల్లీలో ఉన్న ప్రస్తుత ప్రవేశ విధానంతో విసుగెత్తిపోయాను..’ అని ఆమె చెప్పింది. తల్లిదండ్రుల్లో ఒకరో లేక ఇద్దరూ ఏదైనా పాఠశాలకు పూర్వవిద్యార్థులైతే, తమ పిల్లలను కూడా అదే పాఠశాలకు పంపేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. కపూర్ మాట్లాడుతూ ‘నేను ఇక్కడికి సమీపంలోని ఏ స్కూలుకూ పూర్వ విద్యార్థినిని కాను. నాకు ఒకడే కుమారుడు. నేను నా కుమారుడ్ని నోయిడా లోటస్ వ్యాలీలో చేర్పించేందుకే నిశ్చయించుకున్నాను. అక్కడికి చిన్నారిని పంపేందుకు నేనే స్వయంగా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకున్నాను..’ అని చెప్పింది.
లక్ష్మీనగర్‌కు చెందిన సంజయ్ అగర్వాల్ తన కుమారుడిని 18 కి.మీ.దూరంలోని ఎక్స్‌ప్రెస్‌వే పై ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు పంపుతున్నాడు. ‘ నిజానికి పాఠశాల మా ఇంటికి చాలా దూరంగానే ఉంది..అయితే దాంతో పోలిస్తే స్కూల్ ట్రాన్స్‌పోర్టు, ప్రయాణ సమయం చాలా తక్కువే..’ అని సంజయ్ పేర్కొన్నాడు. డీపీఎస్‌లో సీటు లభించడమే ముఖ్యమని, దూరాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 4లో నివసించే సూరజ్ సూరి తన కుమార్తెను వచ్చే ఏడాదినుంచి 18 కి.మీ. దూరంలో ఉన్న లోటస్ వ్యాలీకి పంపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అతడి కుమారుడు ప్రస్తుతం అక్కడే చదువుతున్నాడు.‘ ఇప్పటికే నా కుమారుడు అక్కడ చదువుతున్నాడు. బస్సు ప్రయాణం కూడా హైవే మీదే..’ అని సూరి చెప్పాడు. ‘ఆ బస్సు డ్రైవర్ నాకు తెలిసి 60 కి.మీ.కన్నా ఎక్కువ వేగంగా బస్సు నడపలేదు. నాలుగేళ్లుగా రవాణా పరంగా మాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు’ అని సూరి ముక్తాయించాడు.
‘పిల్లలను పాఠశాలల్లో చేర్చడానికి తల్లిదండ్రులు పాఠశాలల దూరాన్ని లెక్కలోకి తీసుకోవడంలేదు. ప్రస్తుతం నర్సరీ ప్రవేశాల విధానం చిన్నారుల సంక్షేమానికి ఏమాత్రం తగినది కాదు. తల్లిదండ్రులను సంతృప్తి పరిచేవిధంగా మాత్రమే ఉంది..’ అని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడ్మిషన్స్‌నర్సరీ. కామ్‌కు చెందిన సుమిత్ వోహ్రా మాట్లాడుతూ ‘ అధిక సంపాదన వల్ల పిల్లలను ఎంత దూరమైనా పంపేందుకు సొంతంగా వాహనం, డ్రైవర్‌ను ఏర్పాటుచేసుకోవడానికి తల్లిదండ్రులు వెనుకాడటంలేదు. వారికి ‘మంచి స్కూలు’ అని అనిపించాలి అంతే.. తమకు సమీపంలో ప్రసిద్ధి చెందిన పాఠశాలలు లేనివారు ఎక్కడైనా సరే.. మంచి స్కూలులో తమ చిన్నారి కోసం ముందస్తుగా ఒక సీటును రిజర్వు చేయించుకుంటున్నారు..’ అని చెప్పారు.
‘నర్సరీ’పై సర్కారుకు హైకోర్టు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: చిన్నారులకు నర్సరీలో ప్రవేశం కోసం రైట్ టు ఎడ్యుకేషన్(ఆర్‌టీఈ) చట్టాన్ని సవరించి మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్రవేశాల విధానాన్ని సవరించాలని ఒక పౌర హక్కుల సంఘం వేసిన పిల్‌పై స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ మన్‌మోహన్‌తో కూడిన బెంచ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని, లెఫ్టినెంట్ గవర్నర్‌లకు మార్గనిర్దేశం చేసింది. పిల్లలను చేరుకునేందుకు పాఠశాలలు పెడుతున్న ‘స్క్రీనింగ్ టెస్ట్’లను రద్దు చేయాలని పిటిషనర్ అయిన అశోక్ అగర్వాల్ డిమాండ్ చేశారు. 2007లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో నర్సరీ విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్చుకునేందుకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలలు తమ సొంత మార్గదర్శకాలను నిర్ణయించుకోవచ్చని స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement