బిగుస్తున్న ఉచ్చు | Delhi police books AIADMK’s TTV Dinakaran for trying to bribe EC | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు

Published Wed, Apr 19 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

బిగుస్తున్న ఉచ్చు

బిగుస్తున్న ఉచ్చు

దినకరన్‌ అరెస్ట్‌కు నేడో రేపో ఢిల్లీ పోలీసుల రాక?
ఈసీకి రూ.50 కోట్ల కేసులో దినకరన్‌ విచారణ
బ్రోకర్‌ సుకేష్‌ ద్వారా సాక్ష్యాధారాల సేకరణ

దినకరన్‌తో ములాఖత్‌కు చిన్నమ్మ విముఖత

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ పరిస్థితి దినగండం నూరేళ్లాయుష్షులా మారింది. రెండాకుల చిహ్నం కోసం ఈసీకి రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్‌ చేస్తారేమోననే ఉత్కంఠ నెలకొంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై:    అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడం వల్ల కోల్పోయిన రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీటీవీ దినకరన్‌ చేసిన ప్రయత్నాలు ఆయనను నిందితుడిగా మార్చాయి. ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు లంచం ఇవ్వడం ద్వారా రెండాకుల చిహ్నాన్ని పొందడం కోసం కర్ణాటకకు చెందిన సుకేష్‌ చంద్రశేఖర్‌ అనే బ్రోకర్‌ను ఆశ్రయించడం, అతను ఢిల్లీ పోలీసులకు సోమవారం పట్టుబడడంతో దినకరన్‌ బండారం బట్టబయలైంది. దినకరన్‌ ఇచ్చాడని చెబుతున్న రూ.1.30 కోట్లను సుకేష్‌ గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దినకరన్‌ను విచారించేందుకు అనుమతి పొందిన ఢిల్లీ పోలీసులు చెన్నైకి వచ్చి ఆయనను ఏక్షణమైనా అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరిగింది.

 అయితే 8 రోజుల పోలీసు కస్టడీలో ఉన్న సుకేష్‌ను ముందుగా విచారించాలని నిర్ణయించుకున్న ఢిల్లీ పోలీసుల చెన్నై ప్రయాణం మంగళవారం అకస్మాత్తుగా రద్దయింది. సుకేష్‌పై చెన్నై, బెంగళూరు, మదురై ప్రాంతాల్లో 19 కేసులు పెండింగ్‌లో ఉన్నందున ముందు వీటికి సంబంధించిన వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. సుకేష్‌ నుంచి సేకరించిన బలమైన సాక్ష్యాధారాలతో దినకరన్‌ను అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తీసుకెళతారని అంటున్నారు. ఢిల్లీ పోలీసులు సుకేష్‌ను వెంట పెట్టుకుని బుధ, గురువారాల్లో చెన్నైకి చేరుకుంటారని తెలుస్తున్న నేపథ్యంలో దినకరన్‌ తన న్యాయవాదులతో మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

 ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలోని ఒక అధికారి ద్వారా ఉన్నతాధికారిని మభ్యపెట్టే ప్రయత్నాలు సాగినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అధికారిని సైతం అదుపులోకి తీసుకుని విచారించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో మరో ముగ్గురి పాత్ర ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు వారిని సైతం అరెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సుకేష్‌ నుంచి బలమైన ఆధారాలు సేకరించిన తరువాతనే ఈ కేసులో మలిదశ విచారణకు పూనుకుంటారని తెలుస్తోంది.

సెల్‌ఫోన్‌ సంభాషణలే ఆధారం: ఢిల్లీ పోలీస్‌
 సుకేష్‌ ఎవరో తనకు తెలియదని దినకరన్‌ ప్రకటించిన నేపథ్యంలో తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తగిన ఆధారాలు ఉన్నందునే దినకరన్‌పై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశామని చెబుతున్నారు. సుకేష్, దినకరన్‌కు ఎంతోకాలంగా సంబంధాలు ఉన్నాయని, అనేక సార్లు వారు కలుసుకుని మాట్లాడుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ పరిచయంతోనే దినకరన్‌ సుకేష్‌తో బేరం కుదుర్చుకున్నాడని, ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతానికి చెందిన ఒక హవాలా ఏజెంటు ద్వారా రూ.10 కోట్లు సుకేష్‌కు ముట్టాయని పోలీసులు తెలిపారు. ఈ డబ్బు అందిన తరువాత దినకరన్, సుకేష్‌ మాట్లాడుకునారని చెప్పారు. వారిద్దరి మధ్య సాగిన సెల్‌ఫోన్‌ సంభాషణ రికార్డు, కొన్ని గుర్తింపు కార్డులు తమ వద్ద ఉన్నాయని అంటున్నారు.

ములాఖత్‌కు చిన్నమ్మ విముఖత:
పార్టీలో నెలకొన్న పరిణామాలు, ఐటీ దాడులు, ఢిల్లీ పోలీసుల కేసుల నేపథ్యంలో చిన్నమ్మను కలుసుకోవాలని దినకరన్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ములాఖత్‌ ద్వారా శశికళను కలుసుకునేందుకు దినకరన్‌ సోమవారం ఉదయం బెంగళూరుకు వెళ్లారు. అయితే సాయంత్రం 6.30 గంటల వరకు ఆయన జైలు వద్దకు రాలేదు. శశికళను కలుసుకోలేదు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ములాఖత్‌ సమయం కేటాయించినా దినకరన్‌ హాజరుకాలేదు.

ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు వస్తారని దినకరన్‌ అనుచరులు జైలు అధికారులకు తెలపగా వారు సైతం అంగీకరించారు. అయితే సాయంత్రం కూడా ఆయన రాలేదు. కాగా తమిళనాడు రిజిష్ట్రేషన్‌తో కూడిన ఒక లగ్జరీకారు జైలు వద్దకు రెండుసార్లు వచ్చి వెళ్లినట్లు సమాచారం. ఆ కారులో దినకరన్‌ వచ్చినట్లు తెలిసినా కొద్ది నిమిషాల్లోనే వెనుదిరిగి పోయింది. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలపై శశికళ తీవ్ర అసంతృప్తితో ఉన్నందునే దినకరన్‌ను కలుసుకునేందుకు విముఖత ప్రదర్శించినట్లు సమాచారం.

ప్రాణాలకు ముప్పు:
ఇదిలా ఉండగా, తనకు ప్రాణహాన్ని ఉన్నందున పోలీసు బందోబస్తుకు ఆదేశించాలని కోరుతూ సుకేష్‌ తరఫు న్యాయవాది ఢిల్లీ సీజ్‌ అజారే జల్లా కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. రాజకీయ పనుల నేపథ్యంలో అరెస్ట్‌ చేసినందున ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement