ఫేస్‌బుక్ పేజీకి అనూహ్య స్పందన | Delhi Police Facebook Page for Northeast a Hit | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ పేజీకి అనూహ్య స్పందన

Published Sun, Jun 1 2014 11:38 PM | Last Updated on Thu, Jul 26 2018 12:50 PM

Delhi Police Facebook Page for Northeast a Hit

 న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉంటున్న ఈశాన్య ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఫేస్‌బుక్ పేజీకి అనూహ్య స్పందన లభిస్తోంది. మూడు వారాల కిందట ప్రారంభించిన ఈ పేజీలో దేశవ్యాప్తంగా ఉన్న ఈశాన్య ప్రజలనుంచి ఇప్పటికే 5,500 ఫిర్యాదులు, సూచనలు అందాయి. స్పందించినవారిలో ఎక్కువగా యువత ఉండటం విశేషం. ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం www.dpfne.com (delhipolicefornortheast.com) పేజీని ఢిల్లీ పోలీసులు మే 9న ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇది ప్రచారం పొందింది. ప్రారంభమైన నాటినుంచి నేటివరకు దేశంలోని పలు ప్రాంతాల్లోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలనుంచి 5,500 ఫిర్యాదులు, సూచనలు అందాయని పోలీసు జాయింట్ కమిషనర్ రాబిన్ హిబూ తెలిపారు. ఈ పేజీకి బాధ్యతలు హిబు చూస్తున్నారు.
 
 ఈశాన్య ప్రజలు తమ సమస్యలను పంచుకోవడానికి ఫేస్‌బుక్ పేజీ సులభమైన మార్గమని హిబూ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మోసపోకుండా సరైన డ్రైవింగ్ లెసైన్సులు పొందాలని మే 30న ఢిల్లీ పోలీసులు కోరారు. నాగాలాండ్‌కు చెందిన యువతిని న్యాయవాది టిస్ హజారీ కోర్టు బయట వేధించిన ఘటనపై పోలీసుల చర్యలేంటని మే 27న ఓ యువకుడు పేజీలో పోస్టు చేశాడు. న్యాయం చేయడంలో జాప్యం చేస్తే నిజాన్ని తిరస్కరించడమేనని కూడా ఆ యువకుడు కామెంట్ చేశాడు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, డీసీపీ, జాయింట్ కమిషనర్‌లు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని ఢిల్లీ పోలీసులు సమాధానమిచ్చారు. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో తాను ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు హిబూ తెలిపారు. ఫేస్‌బుక్ పేజీలో ఏదైనా ఫిర్యాదు అందగానే తాము చర్యలు తీసుకుంటామని, స్థానిక పోలీసులకు సమాచారమందించి సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరించమని కోరతామని ఆయన చెప్పారు. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి వివరణ కూడా తీసుకుంటామన్నారు.
 
 ఫేస్‌బుక్ పేజీ ప్రారంభించిన నాటినుంచి ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద వేధింపులకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు 250 కేసులు నమోదు చేశారు. 150 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా అత్యాచారం, వేధింపులు, ఈవ్‌టీజింగ్, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని హిబూ చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలపై స్పందించిన హిబూ సీనియర్ పోలీసు అధికారులతో చర్చిస్తామని సమాధానమిచ్చారు. అంతేకాదు తమకు అందిన సూచనల మేరకు సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈశాన్య ప్రజల సంక్షేమం కోసం ఫేస్‌బుక్ పేజీతోపాటు 1093 నంబర్‌పై నార్త్‌ఈస్ట్ హెల్ప్‌లైన్, 9810083486 నంబర్‌పై వాట్పప్‌ను కూడా నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. దక్షిణ ఢిల్లీ లజ్‌పత్‌నగర్‌లో కొందరు దుకాణదారులు అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి 19 ఏళ్ల నిడోతానియాపై దాడి చేయడంతో అతను మరణించడం, ఈ ఘటనపై ఢిల్లీలోనే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలనుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం విదితమే. రాజధానిలో ఈశాన్య ప్రజలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫేస్‌బుక్‌పేజ్, హెల్ప్‌లైన్ నంబర్, వాట్సప్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లను వారికి అందుబాటులోకి తెచ్చారు ఢిల్లీ పోలీసులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement