న్యూఢిల్లీ: నేరగాళ్ల ఆట కట్టించే దిశగా నగర పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ఇటీవల జీపీఎస్ ఆధారిత ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సంబంధిత సిబ్బంది పకడ్బందీగా గస్తీ విధులను నిర్వర్తిస్తున్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ఉత్తర ఢిల్లీలో ఇంటరె నట్ ఆధారిత గస్తీని నిర్వహిస్తోంది. ఈ వాహనాలను సివిల్స్‌లైన్స్ స్టేషన్‌లో పోలీసు శాఖ జాయింట్ కమిషనర్ సందీప్ గోయల్ ప్రారంభించిన సంగతి విదితమే. జీపీఎస్ పరికరాలను అమర్చిన ఈ వాహనాలను ఇంటర్నెట్ పోర్టల్‌తో అనుసంధానం చేశారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. ఈ సాఫ్ట్‌వేర్ కారణంగా ద్విచక్ర వాహనాలు గస్తీ చేస్తున్న ప్రాంతాలను స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌ఓ)తోపాటు ఉన్నతాధికారులు కూడా నేరుగా తిలకించేవీలుంది.
ఈ విషయమై ఉత్తర విభాగం డీసీపీ మాధుర్ వర్మ మాట్లాడుతూ ‘పాస్‌వర్డ్‌ను టైప్‌చేసిన తర్వాత ఈ పోర్టల్‌ను తిలకించేందుకు వీలవుతుంది. గస్తీ విధుల్లో పాల్గొంటున్న వాహనాలు ఏయే ప్రాంతా ల్లో సంచరిస్తున్నాయనే విషయం తక్షణమే తెలిసిపోతుంది. గస్తీ విధుల్లో ఉన్న సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరికొంతమందిని తక్షణమే అక్కడికి పంపేందుకు కూడా వీలవుతుంది. ఒక్కో బైక్‌ను ఒక్కో ప్రాంతానికి కేటాయించడం జరుగుతుంది. ఈ బైక్‌లు తమ పరిధిని దాటి అవతలికి పోతే తక్షణమే ఎస్‌హెచ్‌ఓ. ఏసీపీలకు ఓ సందేశం అందుతుంది. దీంతో ఈ వాహనాలు ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయనే దానిపై ఆరా తీయగలుగుతాం’ అని అన్నారు.
కాగా ఈ విధానం తూర్పు, ఈశాన్య ఢిల్లీ పరిసరాల్లో ఇప్పటికే అమలులో ఉంది. అక్కడ విజయవంతంగా నడుస్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల తోపాటు చిన్న చిన్న వీధుల్లో గొలుసు దొంగతనాలు, నేరాలు జరిగితే తక్షణమే సమాచారం అందుతోంది. వేకువజామునగానీ లేదా బాగా పొద్దుపోయిన తరువాతగానీ జరిగే నేరాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోంది. నేరగాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోగలుగుతున్నారు. తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు వీలవుతోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణ నలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఈ విధానాన్ని నగరంలోని మిగతా అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసే దిశగా ముందుకుసాగుతున్నారు.
ఇక నేరగాళ్ల ఆటకట్టు
Published Sat, Sep 27 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement