పరిశుద్ధులైన నేతలు కావాలి
Published Wed, Dec 4 2013 11:50 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
న్యూఢిల్లీ: కొత్త నెత్తురు, తొలిసారి ఓటర్లు, భవిష్య భారత్‌కు ప్రతినిధులు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఉరకలెత్తే ఉత్సాహంతో పాల్గొన్నారు. మంచి భవి ష్యత్‌కు భరోసా ఇచ్చే పాలన రావాలని కోరుకుంటున్నారు. డిసెంబర్ 16 నిర్భయ మీద సామూహిక అత్యాచారం నేపథ్యంలో మహిళా భద్రత ముఖ్యం, ఇది కచ్చితంగా అమలు జరగాలంటే చిత్తశుద్ధి ఉన్న నాయకులు అవసరం అంటున్నారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్న యువతరం ప్రతినిధులు నాలుగు లక్షలకు పై మాటే. ‘‘ఈసారి ఢిల్లీ పాలనలో మార్పు రావాలి. బాధ్యత కలిగిన, పరిశుద్ధులైన నాయకులను కోరుకుంటున్నా’’ అని 23 ఏళ్ల సహీర్ సేథ్ అన్నాడు.
19 ఏళ్ల అంకిత మెహరా అతని అభిప్రాయాన్ని ఆమోదిస్తూ ‘‘మహిళలకు భద్రత కలిగిన ఢిల్లీ కావాలి’’ అని నొక్కి చెప్పింది. మయూర్ విహా ర్‌కు చెందిన 21 ఏళ్ల లవ్లీన్ శర్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది.‘నాతోపాటు నా స్నేహితులు అనేక మంది సురక్షితమైన, భద్రత కలిగిన పరిస్థితులు ఏర్పడాలని కోరుకుంటున్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగడానికి భద్రత కలిగిన వాతావరణం కావాలి’ అని తెలిపిం ది. ఆమె స్నేహితురాలు సిమ్రాన్ కౌర్ మాట్లాడుతూ ‘‘యువత భవిష్యత్ కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజల జీవితాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వ పనివిధానం ఉండాలి’’ అని కోరింది. యువతరంలోనూ కొందరు ఇంకా పాత ప్రభుత్వమే కొనసాగాలని కోరుతున్నవారూ ఉన్నారు. ‘‘నాకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం. అభివృద్ధిపనులు కొనసాగించడానికి మరోసారి అధికారం అప్పగించాల్సిందే’’ అని కహ్కాషాన్ నూర్ అభిప్రాయపడ్డారు.
యువతరం ప్రతినిధుల మధ్య రాజకీయ పరమైన భిన్నాభిప్రాయాలున్నా తొలిసారిగా ఓటు చేయనున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజౌరీగార్డెన్‌కు చెందిన తితిక్షజైన్ మాట్లాడుతూ‘వయోజన ఓటు హక్కును ఓ గౌరవంగా భావిస్తున్నాను. తొలిసారి ఓటు చేసిన అనుభవం జీవితాంతం మరవలేనిది’ అని ఆనందం వ్యక్తం చేశాడు. అంతరిక్ అన్వేషణ్ అనే 22 ఏళ్ల యువకుడు మాట్లాడుతూ‘‘ ఓటు హక్కు కోసం చిన్ననాటి నుంచి ఎదురు చూస్తున్నాను. పోలింగ్ కేంద్రానికి వెళ్లడం, వేలి మీద సిరా గుర్తు, ఓటింగ్ మిషన్ మీద నచ్చిన అభ్యర్థికి ఎదురుగా నొక్కడం, నిజంగా ఒక వింత అనుభూతి. నేను ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామిని’ అని వివరించాడు.
Advertisement