Delhi polls
-
మోదీతో సెల్ఫీకి రూ.కోటి!
న్యూఢిల్లీ: సందర్భం విదేశీయానమైనా, స్వదేశీయులతో ములాఖత్ అయినా.. సెల్ఫీ దిగనిదే ప్రోగ్రామ్ పూర్తయినట్లు కాదు ప్రధాని నరేంద్ర మోదీకి! సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియాను అంతగా వినియోగిస్తున్న నాయకుడు మరొకరు లేరంటే అతిశయం కాదు. కానీ.. బిహార్ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆయన సెల్ఫీలకు దూరంగా ఉంటున్నారు. మోదీలో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి కారణం ఏమిటి? అని ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా 'మోదీతో సెల్ఫీ' (సెల్ఫీ విత్ మోదీ) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బీజేపీ నాయకులు. ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఏడు విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో.. తాత్కాలిక బూత్ లను, వాటిలో మోదీ వర్చువల్ ఇమేజ్(కాల్పనిక చిత్రం)ను ఏర్పాటు చేశారు. ఆ ఇమేజ్‌తో సెల్ఫీ తీసుకుంటే.. స్వయంగా మోదీనే మన పక్కనున్నట్లు కనిపిస్తుంది. లక్షలాది ఢిల్లీ ప్రజలు మోదీతో సెల్ఫీలు దిగి ఆ గుర్తును భద్రంగా సేవ్ చేసుకున్నారు. కాగా, ఒక్కో విడత.. మోదీ విత్ సెల్ఫీకి రూ. 86.50 లక్షలు వెచ్చించామని, అలా ఈ కార్యక్రమానికి మొత్తం రూ. 1.06 కోట్ల ఖర్చయ్యాయని తేలింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఖర్చుల జాబితాలో బీజేపీ పేర్కొంది. అంత ఖర్చయినా ఫర్వాలేదుగానీ ఓట్లు మాత్రం కమలానికి కాకుండా చీపురుకు పడటమే జీర్ణించుకోలేకపోయారు ఆ పార్టీ నేతలు. విఫల ప్రయోగం మళ్లీ ఎందుకని బిహార్ ఎన్నికల ప్రచారంలో సెల్ఫీ ఐడియాను అటకెక్కించారు. అయితే మోదీ తీసుకున్నది విరామం మాత్రమేనని.. నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనలో మళ్లీ సెల్ఫీలు చిందిస్తారని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. అన్నట్లు గత ఎన్నికల్లో 'త్రీడీ ప్రచారం' గుర్తుందిగా. ప్రసంగాలను ముందే త్రీడీలో చిత్రీకరించి, ప్రత్యేక స్క్రీన్ లు ఉన్న వాహనాల ద్వారా ఊరూరా ప్రచారం చేసినందుకుగానూ రూ.60 కోట్లు ఖర్చయినట్లు బీజేపీ తెలిపింది. -
ఢిల్లీలో కాలు మోపుతాం: శివసేన
ముంబై/న్యూఢిల్లీ: బీజేపీతో స్నేహ బంధాన్ని తెంచుకున్న శివసేన, తన పూర్వ మిత్రునికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. హిందూత్వ ఎజెండా విషయంలో బీజేపీని ఒంటరిని చేసేందుకు శివసేన మహారాష్ట్ర వెలుపల కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభించాలని భావిస్తున్నామని శివసేన ఎమ్మెల్సీ దివాకర్ రావుతే చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి తమ పార్టీని విస్తరించాలని నిర్ణయించామని, తమ ప్రణాళిక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ‘‘హిందూత్వ లక్ష్యాన్ని సాధించేందుకు కలిసే ఉందాం అని ఉద్ధవ్జీ (శివసేన అధ్యక్షుడు) కోరితే వారు (బీజేపీ) మొండిగా వ్యవహరించారు’’ అని రావుతే పేర్కొన్నారు. దేశంలోని మూలమూలకూ విస్తరించేందుకు, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఎన్నికలను ఒక మాధ్యమంగా వాడుకుంటామని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో తమ పాత్ర నామమాత్రమేనని, ఎన్ని సీట్లలో పోటీ చేయాలని, అభ్యర్థులెవరు అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం శివసేనకు లేకపోయినప్పటికీ, బీజేపీ అవకాశాలను దెబ్బతీయాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఢిల్లీలోని మైనారిటీల అభివృద్ధికి అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందినందునే ప్రాంతీయ పార్టీలు అక్కడ విస్తరిస్తున్నాయని రావుతే అభిప్రాయపడ్డారు. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా ఉన్న ముస్లిమ్‌లు ఇప్పుడు ఆ పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. దీనిని ఎంఐఎం అవకాశంగా తీసుకుని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోనే పట్టున్న మజ్లిస్ పార్టీ ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుపొందింది. ఇటువంటి పార్టీలు విస్తరించకుండా అడ్డుకుంటామని రావుతే చెప్పారు. భవిష్యత్తులో దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని తెలిపారు. -
ఏం జరుగుతోంది..
‘నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి.. కరెంటు కష్టాలు చెప్పనవసరం లేదు.. మంచినీటి ఇబ్బందులు కోకొల్లలు.. సామాన్య మానవుడి గోడు పట్టించుకునేవాడే లేడు..’ ఇదీ నేటి జాతీయ రాజధానిలో నెలకొన్న పరిస్థితి.. ప్రజా ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో.. ఎప్పుడు తమ కష్టాలు గట్టెక్కుతాయోనని ఢిల్లీవాసులు ఎదురుచూస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో ఎన్నికలు జరుగుతాయా లేక ప్రభుత్వం ఏర్పాటవుతుందా అన్న దానిపై మళ్లీ చర్చ ఊపందుకుంది. అసెంబ్లీని వెంటనే రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయం చర్చనీయాంశంగా మారింది.ప్రజా తీర్పు వృథా కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని సుప్రీంకోర్టు నోటీసుకు కేంద్రం ఇచ్చిన జవాబు ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి బీజేపీలో తెరవెనుక ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న ఊహాగానాలను బలపరిచింది.. అయితే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవని, డిసెంబర్లో ఎన్నికలు జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాజకీయ అనిశ్చితిని తొలగించడం కోసం బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తామని ఢిల్లీ బీజేపీ అంటున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఎన్నికల పట్ల విముఖంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు గురించిన చర్చ పదేపదే తలెత్తుతోంది.ఎన్నికలకు సముఖంగా లేని ఎమ్మెల్యేలు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఎన్నికలు ఇష్టం లేని ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయం ఇంకా బీజేపీ పరిశీలనలో ఉందనే విషయం ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మాటలతో స్పష్టమైంది. ‘మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం పాపం కాదు.. గతంలో మైనారిటీ ప్రభుత్వాలు విజయవంతంగా నడిచాయి.. మేము మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అనడం లేదు.. కానీ రాజకీయాల్లో దేన్నీ తోసిపుచ్చలేమ’ని సతీష్ ఉపాధ్యాయ వ్యాఖ్యానించారు. అయితే మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశం బీజేపీకి లేదని, ఎన్నికలను వాయిదా వేయడానికే ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం పేరిట కాలయాపన చేస్తోందని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా, ధరల పెరుగుదల దృష్ట్యా ఎన్నికలకు వెనుకడుగు వేస్తున్నప్పటికీ ఇతర పార్టీల ను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామన్న అపఖ్యా తి మోయడానికి బీజేపీ అగ్రనాయకత్వం సుముఖంగా లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాము ప్రత్యర్థి పార్టీలను చీల్చే ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆప్‌పై ప్రజలకు సానుభూతి పెరిగి ఆ పార్టీ బలపడవచ్చన్న భయం కూడా బీజేపీ నేతలను వేధిస్తోం దని అంటున్నారు. ఈ కారణాల దృష్ట్యా ఢిల్లీలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు లేవని, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని వారు అంటున్నారు. -
ఆప్ విజయం పట్ల ప్రవాస భారతీయుల ఆనందం
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం పట్ల ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆప్ పార్టీ విజయం కోసం అనేక మంది ప్రవాస భారతీయులు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్నారు. ఫలితాలను వెలువడిన తరువాత తమ కష్టాలకు తగిన ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. బోస్టన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మధు నర్సయ్య (35) ఉద్యోగం వదిలిపెట్టి స్వచ్ఛంద సేవకుడిగా ఆప్ పార్టీ ప్రచారంలో భాగస్వామి అయ్యాడు. ఫలితాలలు వెలువడిన అనంతరం ‘‘ఆప్ పార్టీ సాధించిన విజయం భారత రాజకీయాల్లో మేలిమలుపు. అవినీతి వ్యతిరేక పోరాటం నాటి నుంచి నేను స్వచ్ఛంద కార్యకర్తగా ఉన్నాను. ఐఏసీ రాజకీయ మలుపు తీసుకొని పార్టీగా అవతరించింది. దీన్ని మేము ఆహ్వానించాము. అందుకే ఎన్నికల్లో విజయం సాధించడానికి నేను కార్యకర్తగా రంగంలోకి దిగాను. అనేక నియోజక వర్గాలు తిరిగి అక్కడి ప్రజలకు ఆప్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాను’’ అని తెలిపాడు. నర్సయ్యతో పాటు 50 మందికి పైగా ప్రవాస భారతీయులు ఢిల్లీలో మకాం చేసి ఆప్ పార్టీకి తమ వంతు సేవలు అందించారు. ఆప్ పార్టీ ఇటు పాలక పక్షం కాంగ్రెస్‌కు, అటు బీజేపీకి గట్టి పోటి ఇచ్చింది. మొత్తం 70 శాసనసభ సీట్లలో 28 సీట్లు గెల్చుకోవడం పట్ల ఆమ్ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మూడుసార్లు వరుస విజయాలు సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించిన షీలా దీక్షిత్‌ను ఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన నర్సయ్య‘‘భారతీయ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం జరిగిన ఉద్యమంలో మేము భాగస్వాములం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు నర్సయ్య. ఈయన స్వరాష్ట్రం తమిళనాడు. పవాస భారతీయుల కృషిని వివరిస్తూ‘‘చాలా మంది ప్రవాస భారతీయులు ఆప్ పార్టీ కోసం నిధులు సేకరించారు. స్వయంగా ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన వారే కాక వందలాది మంది వివిధ రకాలుగా సహాయం చేశారు. ఢిల్లీలో మకాం చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పనిచేస్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ బ్రాద్ మిశ్రా (45) శాసనసభ ఎన్నికల్లో ఆప్ పార్టీకి మద్దతు పలకడమే కాక స్వయంగా ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొనడానికి ముందుకు వచ్చాడు. భారతీయ యువత ప్రతిస్పందనను స్వయంగా పరిశీలించడానికి బ్రిటన్ నుంచి జయంత్ మిశ్రా(77) ఢిల్లీకి వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు. ‘‘ఇక్కడి యువకులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను కలిసి మాట్లాడాలని వచ్చాను’’ అని వివరించారు. ఈయన ఏడు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తోడ్పాటు అందించారు. వీరిలో కొందరు నియోజక వర్గాలనే దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కనీస వసతులు, ఆరోగ్యం తదితర రంగాల్లో సేవలందించడానికి ముందుకు వచ్చారు. దాదాపు ఆరు కోట్ల ఆర్థిక సహాయం అందిందని ఓ ఆప్ పార్టీ నాయకుడన్నారు. నర్సయ్య అమెరికా తిరిగి వెళ్తానని చెప్పగా, మిశ్రా మాత్రం తాను ఆప్ పార్టీకి సేవలందించడానికి ఇక్కడే ఉంటానన్నారు. స్వరాష్ట్రం ఒడిశాలో ఆప్ పార్టీని విస్త్రృతం చేస్తానని విశ్వాసంతో పలికాడు. రాజకీయ సామాజిక రంగాల్లో పనిచేయదలిచిన వారి కోసం ఒక అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తాను’’ అన్నారు. కేజ్రీవాల్ నివాసంలో కోలాహలం ఘజియాబాద్: ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన ఆమ్ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కౌశాంబిలోని నివాసం సోమరవారంనాడు జాతరగా మారింది. బంధువులు, మద్దతుదారులు, స్నేహితులతో గిర్మార్ ఆపార్ట్మెంట్ నంబర్ 401 సందడిగా మారింది. మధ్యతరగతి నివాసమైన కేజ్రీవాల్ మూడు గదుల ఇల్లు పుష్పగుచ్ఛాలు, మిఠాయిలతో నిండిపోయింది. యువ అభిమానులు, కార్యకర్తలు, బంధువులతో జాతరను తలపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా మీద బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందిన కేజ్రీవాల్‌కు అభినందనలు తెలపడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కేజ్రీవాల్ నివాస ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. -
అంతా జేపీ వల్లే!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందించారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆమె సోమవారం మీడియాకు తెలిపారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె ఆభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ ఆగర్వాల్ సహకరించకపోవడం వల్లే దారుణ పరాజయాన్ని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, నగరవాసులు చెత్త పాలనను కోరుకోరని, అయితే అది ఇప్పుడు ఎన్నికల్లో జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు, ధరల పెరుగుదల, అవినీతి కుంభకోణాలకు మీరు బలయ్యారా అన్న విలేకరుల ప్రశ్నను ఆమె సమాధానమిస్తూ ఆ వ్యవస్థలో తాను కూడా ఒక భాగమేనన్నారు. అయితే భవిష్యత్ రాజకీయం గురించి ఇంకా ఆలోచించలేదని ముక్తసరి సమాధానమిచ్చారు. అప్పుడే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశమేమి లేదన్నారు. అయితే తొలిసారిగా పోటీచేసిన ఆప్‌ని తాము తక్కువగా అంచనా వేశామని అంగీకరించారు. బీజేపీనే తాము ఈ ఎన్నికలలో ప్రత్యర్థిగా పరిగణించామన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రత్యర్థి పార్టీలు ప్రజలను తప్పుదారిపట్టించాయని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చి చూపాలంటూ ఆమె ఆప్‌కి సవాలు విసిరారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె చెప్పారు. జాతీయ సమస్యలు ఎన్నికలపై ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఏ సలహా ఇస్తారని ప్రశ్నించగా, అతను తనకన్నా చాలా తెలివైనవారని అభిప్రాయపడ్డారు. -
పారామిలటరీ దళాల రక్షణలో ఈవీఎంలు
న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం ఫలితాలు వెలువడేవరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు చెందిన ఈవీఎంలు పారామిలటరీ దళాల రక్షణలో ఉన్నాయని గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 810 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే మొత్తం 11,993 ఈవీఎంలను 14 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చినట్లు వారు తెలిపారు.‘ మయూర్ విహార్ సమీపంలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్, కిచిడీపూర్లోని ఐఐటీ, వివేక్‌విహార్ లోని వివేకానంద మహిళా విద్యాలయ వంటి ప్రాంతాల్లో పారామిలటరీ దళాల రక్షణలో భద్రపర్చినట్లు వారు వివరించారు. 900 పారాట్రూపర్లను ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మోహరించినట్లు డిప్యూటీ ముఖ్య ఎన్నికల అధికారి ఎ.కె.శ్రీవాస్తవ వివరించారు.‘ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్ పూర్తయిన వెంటనే బుధవారం రాత్రే ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించాం..’ అని శ్రీవాస్తవ తెలిపారు. సుమారు 70 వేల మంది పోలింగ్ అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని ఆయన వివరించారు. -
ఫలించిన ఎన్నికల సంఘం శ్రమ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటింగ్ శాతం పెంచడంలో ఢిల్లీ ఎన్నికల సంఘం కృషి ఫలించింది. బుధవారంనాటి పోలింగ్‌లో రాజధాని వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 67 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1993లో ఢిల్లీలో నమోదైన 61.75 ఓటింగ్ శాతం రికార్డును బద్దలు కొడుతూ బుధవారం జరిగిన పోలింగ్‌లో 67శాతం నమోదైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఢిల్లీ ఎన్నికల సంఘం వినూత్న పద్ధతుల్లో నిర్వహించిన ప్రచారానికి ఊహించిన దానికంటే ఎక్కువే స్పందన వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీవాసులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా, ఓటు ప్రాధాన్యత చెప్పేలా స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో వీధి నాటకాలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఓటుహక్కు ప్రాధాన్యా న్ని తెలియజేసేలా ప్రదర్శనలు, వార్తాపత్రికలు, టీవీచానళ్లు, ఎఫ్ఎం రేడియోలు వంటి ప్రసార మాధ్యమాలను వాడుకోవడంతోపాటు ఎన్నికల గీతాలతో ఎఫ్ఎం రేడియోల్లో ప్రచారం చేశారు. మెట్రోస్టేషన్ పరిసరాల్లో, మెట్రోరైళ్లలో ప్రచారాలతో హోరెత్తించారు. ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా ఒక్కో వర్గం ప్రజలను చేరుకునేందుకు ఒక్కోరకమైన పద్ధతిని అనుసరించింది. అయితే బుధవారం ఉదయం ఓటింగ్ మందకొడిగా సాగడంతో అధికారులు కాస్త నిరాశకు గురయ్యారు. క్రమంగా పోలింగ్ శాతంలో మార్పు వచ్చింది. సాయంత్ర ఐదు గంటల వరకు రికార్డు స్థాయిలో 65 శాతానికి పోలింగ్ చేరుకుంది. సమయం పూర్తయినప్పటికీ లై న్లలో వేల సంఖ్యలో ఓటర్లు బారులు తీరడంతో 8.30 గంటల వరకు లైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఓటు హక్కు వినియోగంపై దేశ రాజధానివాసుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమయింది. నిర్మానుష్యంగా కన్నాట్ప్లేస్మార్కెట్: నిత్యం వేలాది మంది కొనుగోలు దారులతో సందడిగా కనిపించే కన్నాట్‌ప్లేస్ వంటి అత్యంత రద్దీ మార్కెట్లు సైతం బుధవారం వెలవెలబోయాయి. పోలింగ్ కారణంగా ముందుగానే సెలవు ప్రకటించడంతో ఆ ప్రాంతంలో జనసంచారం లేదు. దాదాపు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ఢిల్లీలోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో స్థానిక కన్నాట్‌ప్లేస్ పరిసరాలు ప్రతిబింబించాయి. -
పరిశుద్ధులైన నేతలు కావాలి
న్యూఢిల్లీ: కొత్త నెత్తురు, తొలిసారి ఓటర్లు, భవిష్య భారత్‌కు ప్రతినిధులు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఉరకలెత్తే ఉత్సాహంతో పాల్గొన్నారు. మంచి భవి ష్యత్‌కు భరోసా ఇచ్చే పాలన రావాలని కోరుకుంటున్నారు. డిసెంబర్ 16 నిర్భయ మీద సామూహిక అత్యాచారం నేపథ్యంలో మహిళా భద్రత ముఖ్యం, ఇది కచ్చితంగా అమలు జరగాలంటే చిత్తశుద్ధి ఉన్న నాయకులు అవసరం అంటున్నారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్న యువతరం ప్రతినిధులు నాలుగు లక్షలకు పై మాటే. ‘‘ఈసారి ఢిల్లీ పాలనలో మార్పు రావాలి. బాధ్యత కలిగిన, పరిశుద్ధులైన నాయకులను కోరుకుంటున్నా’’ అని 23 ఏళ్ల సహీర్ సేథ్ అన్నాడు. 19 ఏళ్ల అంకిత మెహరా అతని అభిప్రాయాన్ని ఆమోదిస్తూ ‘‘మహిళలకు భద్రత కలిగిన ఢిల్లీ కావాలి’’ అని నొక్కి చెప్పింది. మయూర్ విహా ర్కు చెందిన 21 ఏళ్ల లవ్లీన్ శర్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది.‘నాతోపాటు నా స్నేహితులు అనేక మంది సురక్షితమైన, భద్రత కలిగిన పరిస్థితులు ఏర్పడాలని కోరుకుంటున్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగడానికి భద్రత కలిగిన వాతావరణం కావాలి’ అని తెలిపిం ది. ఆమె స్నేహితురాలు సిమ్రాన్ కౌర్ మాట్లాడుతూ ‘‘యువత భవిష్యత్ కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజల జీవితాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వ పనివిధానం ఉండాలి’’ అని కోరింది. యువతరంలోనూ కొందరు ఇంకా పాత ప్రభుత్వమే కొనసాగాలని కోరుతున్నవారూ ఉన్నారు. ‘‘నాకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం. అభివృద్ధిపనులు కొనసాగించడానికి మరోసారి అధికారం అప్పగించాల్సిందే’’ అని కహ్కాషాన్ నూర్ అభిప్రాయపడ్డారు. యువతరం ప్రతినిధుల మధ్య రాజకీయ పరమైన భిన్నాభిప్రాయాలున్నా తొలిసారిగా ఓటు చేయనున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజౌరీగార్డెన్కు చెందిన తితిక్షజైన్ మాట్లాడుతూ‘వయోజన ఓటు హక్కును ఓ గౌరవంగా భావిస్తున్నాను. తొలిసారి ఓటు చేసిన అనుభవం జీవితాంతం మరవలేనిది’ అని ఆనందం వ్యక్తం చేశాడు. అంతరిక్ అన్వేషణ్ అనే 22 ఏళ్ల యువకుడు మాట్లాడుతూ‘‘ ఓటు హక్కు కోసం చిన్ననాటి నుంచి ఎదురు చూస్తున్నాను. పోలింగ్ కేంద్రానికి వెళ్లడం, వేలి మీద సిరా గుర్తు, ఓటింగ్ మిషన్ మీద నచ్చిన అభ్యర్థికి ఎదురుగా నొక్కడం, నిజంగా ఒక వింత అనుభూతి. నేను ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామిని’ అని వివరించాడు. -
కాంగ్రెస్‌కు గతమెంతో ఘనం
న్యూఢిల్లీ: ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ ఐదవ అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా బుధవారం 11.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షించుకుంటే.. 1952లో ఢిల్లీ ‘సి’ క్లాస్ రాష్ట్రం. కాంగ్రెస్‌కు చెందిన బ్రహ్మ్ప్రకాష్ మొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1956లో అసెంబ్లీ వ్యవస్థ రద్దు అయ్యింది. ఆ స్థానంలో 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఏర్పాటయ్యింది. ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక 1993లో భారతీయ జనతాపార్టీ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పుడు బీజేపీ 49 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 14, మిగిలిన వాటిలో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఐదేళ్ల పాలనలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. వరుసగా మదన్‌లాల్ ఖురానా, సాహిబ్‌సింగ్ వర్మా, సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవా సాగింది. 70 సీట్లకు గాను 52 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బీజేపీ 15 సీట్లకే పరిమితమైపోయింది. జనతాదళ్ ఒకటి, మరో రెండింటిలో ఇండిపెండెంట్లు గెలుపొందారు. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే ఢిల్లీవాసులు పట్టం కట్టారు. 2003 ఎన్నికల్లో, బీజేపీ తన బలాన్ని 15 నుంచి 20 సీట్లకు పెంచుకోగలిగింది తప్పితే అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. షీలాదీక్షిత్ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కాగా, 2008 ఎన్నికల్లోనూ బీజేపీ ఆశలు నెరవేరలేదు. పార్టీ బలం 20 నుంచి 23 సీట్లకు పెరిగింది తప్ప అధికారం మాత్రం అందని ద్రాక్షపండుగానే మిగిలిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 43 స్థానాలను కైవసం చేసుకోగా షీలాదీక్షిత్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికై, భారతదేశంలో ఒక రాష్ట్రానికి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మహిళగా రికార్డు సృష్టించారు. -
నేడు ఢిల్లీ ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. కాగా, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఓటుహక్కు వినియోగించుకునే నిమిత్తం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆయా యాజమాన్యాలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలో అన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యాలయాలు బుధవారం మూతపడతాయి. ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ... ఓట్ కీ చౌకీదారీ
న్యూఢిల్లీ: ప్రత్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను అడ్డుకొనేందుకు ఆప్ నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యర్థులు మద్యం, నగదు పంపిణి చేయకుండా నిరోధించేందుకు వాలంటీర్లను రంగంలోకి దించింది. ప్రధానంగా మురికి వాడలు, పునరావాస కాలనీల్లో ‘ఓట్ కీ చౌకీదారీ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. నిఘా కెమెరాలు, మొబైల్ ఫోన్లతో ఉండే వాలంటీర్లు ఎలాంటి ప్రలోభ చర్యలు కనిపించిన నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని ఆప్ నాయకుడొకరు తెలిపారు. -
ఈసీ ప్రచారం ఫలించేనా..!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న రాజకీయపార్టీలకు దీటుగా ఈసారి ఢిల్లీ ఎన్నికల సంఘం సైతం వినూత్న పద్ధతుల్లో ప్రచారం నిర్వహించింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ ఆధ్వర్యంలో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. వీధి నాటకాలతో అవగాహన.. దేశ రాజధాని ఢిల్లీలో విద్యావంతులు, విలాసమైన భవంతులున్న ప్రాంతాలకంటే జేజే కాలనీలు, అనధికారిక కాలనీలే ఎక్కువ. ఢిల్లీ జనాభాలో దాదాపు సగం మంది మురికివాడల్లోనే నివసిస్తున్నారు. వారంతా ఓటుహక్కు వినియోగించుకునేలా స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో వీధినాటకాలను ఏర్పాటు చేశారు.అలాగే పిల్లలు చెబితే వారి తల్లిదండ్రులు ఓటుహక్కు తప్పక వినియోగించుకుంటారన్న ఆలోచనతో పాఠశాలల విద్యార్థులకు ఓటుహక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేలా ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. తారల తళుకు బెలుకులు జోడించారు. సైఫ్అలీఖాన్, సోనాక్షిసిన్హాతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇండియాగేట్ సమీపంలో నిర్వహించిన రాక్‌బ్యాండ్ మ్యూజికల్ ప్రోగ్రాంతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీటితోపాటు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు.. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం వార్తాపత్రికలు, టీవీచానళ్లు, ఎఫ్ఎం రేడియోలు వంటి ప్రసారమాధ్యమాలను వాడుకోవడం పాతదే అయినా ఈసారి వాడకంలో వినూత్న పద్ధతులు వినియోగించారు. ప్రత్యేక ఎన్నికల గీతాలతో ఎఫ్ఎం రేడియోల్లో ప్రచారం చేశారు. ఢిల్లీలో జనసమర్థం ఎక్కువగా ఉండే మెట్రోస్టేషన్లను వేదికలుగా చేసుకోవడంలో ఎన్నికల సంఘం అధికారులు విజయవంతమయ్యారు. మెట్రోస్టేషన్ పరిసరాల్లో, మెట్రోరైళ్లలో ‘డిసెంబర్ 4న ఓటుహక్కు తప్పక వినియోగించుకోండి’అంటూ ప్రచారాలతో హోరెత్తించారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో పార్టీ ప్రచారం ముగిసినా ఎన్నికల సంఘం ప్రచారం మాత్రం కొనసాగింది. మంగళవారం అన్ని మెట్రోస్టేషన్లు ఎన్నికల సంఘం ప్రచారంతో హోరెత్తాయి. అన్ని వర్గాల వారిని చేరుకునేందుకు వినూత్న పద్ధతుల్లో ఢిల్లీ ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రచారాలు ఏమేరకు ఫలితాలిస్తాయో బుధవారం సాయంత్రానికి తేలనుంది. నోటాతో ప్రభావం నిల్ సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలపై కొత్తగా చేర్చిన ఆఖరి బటన్ నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) బటన్ నొక్కడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై నోటా బటన్ చేర్చింది. విధానసభ ఎన్నికలలో ఢిల్లీ ఓటర్లు మొదటిసారిగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరికీ ఓటు వేయడానికి ఇష్టపడనివారు నోటా బటన్ నొక్కవచ్చు. అయితే బరిలో ఉన్న అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడినప్పటికీ అత్యధిక ఓట్లు పడిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. నోటాకు అత్యధిక ఓట్లు పడినంత మాత్రాన ఓట ర్లు అభ్యర్థులను తిరస్కరించినట్లు భావించరాదని వారు చెప్పారు. అంటే నోటాకు పడిన ఓట్ల న్నీ లెక్కకురావు. అయితే ఇది ఓటరు మనోభిప్రాయాన్ని రహస్యంగా వెల్లడించడానికి తోడ్పడుతుందని, బోగస్ ఓట్లను కూడా నివారించవచ్చని వారు చెబుతున్నారు. -
11 మందే మహిళా అభ్యర్థులు
న్యూఢిల్లీ: మహిళాసాధికారత, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గురించి పోటాపోటిగా మాట్లాడే అధికార, ప్రతిపక్ష పార్టీలు శాసనసభ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రతిపక్ష బీజేపీ 5గురు మహిళా అభ్యర్థులను రంగంలోకి దించింది. కాంగ్రెస్ కేవలం 6గురు అభ్యర్థులను పోటీకి పెట్టింది. కొత్తగా రంగ ప్రవేశం చేసి సమాజం, సాధారణ ప్రజల గొంతుకనని చెప్పుకునే ఆమ్ఆద్మీ పార్టీ కూడా కేవలం ఆరుగు రు మహిళలకే టికెట్లు కేటాయించింది. 15 సంవత్సరాలుగా మూడు వరుస విజయాలతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ మహిళా ముఖ్యమంత్రికే పాలన పగ్గాలు ఇచ్చింది. అయితే ఎన్నికల్లో ఈ పార్టీ మహిళలకు కేటాయించిన స్థానాలు మాత్రం 8.5 శాతం మాత్రమే. ప్రతిపక్ష బీజేపీ మహిళలకు ఇచ్చిన స్థానాలను లెక్కిస్తే మొత్తంలో 7.5 శాతమే. ఎన్నికల జాబితా ప్రకారం ఢిల్లీలో మహిళా ఓటర్ల సంఖ్య 53 లక్షలు కాగా పురుష ఓటర్ల సంఖ్య 66 లక్షలు. ఎన్నికల్లో పోటీకి దిగిన మొత్తం 810 అభ్యర్థులు రంగంలో ఉండగా కేవలం 70 మందే మహిళా అభ్యర్థులు. 2008 ఎన్నికల్లో 57 మంది మాత్రమే బరిలో నిలిచారు. ఇదే విషయం ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాజీ ఢిల్లీ అధ్యక్షుడు విజయేందర్గుప్తాతో ప్రస్తావించగా ‘‘ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది మహిళా? పురుషుడా? అని కాక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మేము చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలిపించాలనేదానికి కట్టుబడి ఉన్నాం’’ అని వివరించారు.మహిళల విషయంలో ఇప్పటికీ వివక్షే గెలుస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. -
ప్రచారానికి తెర!
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. దీంతో ఎన్నికల ప్రకటనతో అక్టోబర్‌లో మొదలై, నామినేషన్ల ప్రక్రియతో ఊపందుకున్న ప్రచారానికి తెరపడినట్లయింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న 810 మంది అభ్యర్థులు, వారి బంధుమిత్రులు, పార్టీల కార్యకర్తలు ప్రచారం గుడువు ముగిసే ఆఖరి నిమిషం వరకు వీలైనంత మంది ఓటర్లపై తమ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఓటర్లపై హామీల జల్లులు కురిపించారు. ఎన్నికల కమిషన్ కఠిన వైఖరి కారణంగా ఈసారి ఎన్నికల ప్రచారం సాదాసీదాగానే సాగింది. మొట్టమొదటి సారిగా నగరంలో ఎన్నికల ప్రచారంలో గోడలపై పోస్టర్లు, బ్యానర్లు అతికించలేదు. ఎన్నికల కమిషన్ ఆంక్షలతో గతంతో పోలిస్తే ప్రచారం పేలవంగా సాగినప్పటికీ ఓటర్లను చేరుకోవడానికి అభ్యర్థులు, పార్టీలు గట్టిగానే ప్రయత్నించాయి. బహిరంగ సభ లు, ర్యాలీలు, రేడియో జింగిల్స్, కరపత్రాలు, రోడ్ షోలు, ఎస్ఎంఎస్లు, ప్రీ రికార్డెడ్ ఫోన్ కాల్స్, ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా, టెలివిజన్ అడ్వర్టయిజ్మెంట్లు, పోస్టర్లు, బ్యానర్లు, పాదయాత్రలతోపాటు ఇంటింటికీ తిరుగుతూ జోరుగానే ప్రచారం చేశారు. ప్రధానంగా పోటీపడుతున్న మూడు పార్టీల విషయానికొస్తే.. ‘ఫిర్ ఏక్‌బార్.., నహీ రుకేంగీ మేరీ దిల్లీ’ సందేశంతో కాంగ్రెస్... ‘బద్లేగీ దిల్లీ.. బద్లేగీ భారత్’ సందేశంతో బీజేపీ, ఇమాన్దార్ పార్టీ నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆక ట్టుకునేందుకు ప్రయత్నించాయి. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ తలపై టోపీలు, చేతుల్లో చీపుళ్లతో, ఆటోల వెనుక పోస్టర్లు, జాడూ చలావ్ యాత్రలతో మొదలుపెట్టివినూత్న ప్రచార వ్యూహాలతో ఓటర్లపై ముద్రవేయడానికి ప్రయత్నించింది. 15 ఏళ్ల పాలనలో తాము సాధించిన విజయాలను చూపుతూ అభివృద్ధి నినాదంతో.. ‘మెరుగైన ఢిల్లీ కావాలంటే తమకే ఓటువేయాలని’ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఏకవ్యక్తి సైన్యంలా అంతా తానై ప్రచారం నిర్వహించారు. ధరల పెరుగుదల ప్రధానాంశంగా బీజేపీ ప్రచారం సాగించింది. నరేంద్ర మోడీని చూపించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే ఆయన బహిరంగ సభలకు జన సమీకరణకు పార్టీ అత్యఅధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అవినీతి వ్యతిరేక నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ ఓసారి తమకూ అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లను కోరింది. రోడ్‌షోలతో పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ జోరుగా ప్రచారం చేసి ఢిల్లీలో ఎన్నికల పోరును ముక్కోణ పుపోటీగా మార్చడంలో సఫలమయ్యారు. మహిళల భద్రత, విద్యుత్తు చార్జీలు, నీటి సరఫరా సమస్యలు, ట్రాఫిక్ సమస్యలపై జనాలు ప్రచారానికి వచ్చిన నేతలను నిలదీశారు. ఉల్లిధరల పెరుగుదల ప్రచారంలో ప్రధానాంశమైంది. ప్రముఖులతో ప్రచారం.. విధానసభ ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరచడం కోసం అన్ని పార్టీలు జనాకర్షణగల నేతలను, సెలబ్రిటీలను ప్రచారబరిలోకి దింపాయి. కాంగ్రెస్ తరఫున అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అజహరుద్దీన్, రాజ్ బబ్బర్ వంటి సెలబ్రిటీ ఎంపీలు ప్రచారం చేశారు. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్మృతి ఇరానీ, వినోద్ ఖన్నా, మనోజ్ తివారీ వంటి సెలబ్రిటీలు కమలం పార్టీ కోసం ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ బీజేపీ ప్రచారానికి కేంద్ర బిందువయ్యారు. సెప్టెంబర్ ఆఖరున నిర్వహించిన మోడీ సభతో ఊపందుకున్న పార్టీ ప్రచా రం డిసెంబర్ 1న మోడీ సభతో పతాకస్థాయికి చేరింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూ అభ్యర్థుల విజయం కోసం, మాయావతి బీఎస్పీ అభ్యర్థుల కోసం బహిరంగ సభలు నిర్వహించారు. ఆమ్ ఆదీ పార్టీ కూడా బాలీవుడ్ నటులతో ప్రచారం నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షోలు జనాలను ఆక ట్టుకున్నాయి. ప్రవాసులను ఆకట్టుకోవడానికి తంటాలు.. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారితోపాటు అస్సాం, బెంగాల్, ఒడిశా రాష్ట్రాత వారు నగరంలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్ తదిరత రాష్ట్రాలవారు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో కీలకంగా మారారు. అలాగే హర్యానా, ఉత్తరాఖండ్‌లకు చెందిన ఓటర్ల సంఖ్య కూడా రాజధానిలో గణనీయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఏర్పాటులో ప్రవాసులకున్న కీలక పాత్రను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఢిల్లీని ప్రవాసుల నగరంగా అభివర్ణించారు. తమిళులు, దక్షిణ భారతీయుల ఓటర్లను దృష్టిలో ఉంచుకొని తమిళ పార్టీ డీఎండీకే విధానసభ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ప్రవాసులను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు ఆయా ప్రాంతాలకు చెందిన నేతలతో ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ తరఫున కేరళ ఓటర్లను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఉత్తరాఖండ్ వాసులను ఆకట్టుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హర్యానా వాసులను ఆకట్టుకోవడానికి భూపిందర్ సింగ్ హూడా, హిమాచలీయులను ఆకట్టుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్‌భద్రసింగ్ ప్రచారం చేశారు. పంజాబీలను ఆకట్టుకునేందుకు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రయత్నించారు. పూర్వాంచలీయులను ఆకట్టుకోవడానికి ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు నగరంలో ప్రత్యేకంగా తిష్ట వేసి ప్రచారం జరిపారు. బీజేపీ పూర్వాంచలీయులను అభ్యర్థులుగా బరి లోకి దింపడమేకాక, మనోజ్ తివారీవంటి భోజ్‌పురి సెలబ్రిటీలతో, ఆ ప్రాంత నేతలతో ప్రచారం నిర్వహించింది. శత్రుఘన్ సిన్హా మినహా జనాకర్షణగల సెలబ్రిటీ నేతలను బరిలోకి దింపి బీజేపీ ప్రవాసులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రచారంలో అడ్డంకులు... ఢిల్లీలో అధికారం కోసం పోరాడుతున్న మూడు ప్రధాన పార్టీలకు ప్రచారంలో ఊహించని సమస్యలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ సభను రద్దు చేయవలసి రాగా... రాహుల్ గాంధీ సభలకు స్పందన కరువైంది. దక్షిణ పురిలో రాహుల్ గాంధీ సభ నుంచి జనాలు మధ్యలోనే వెనుతిరగడం పార్టీని ఇరుకున పడేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై తలెత్తిన వివాదంతో బీజేపీ ప్రచారం మధ్యలో కొన్ని రోజుల పాటు పట్టాలు తప్పినప్పటికీ ఆ తరువాత సర్దుకుంది. అంతా తానే అన్నట్లుగా పార్టీ తరపున ప్రచారం చేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఉత్సాహం డాక్టర్ హర్షవర్ధన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తరువాత చతికిల బడింది. స్టింగ్ ఆపరేషన్ వివాదం, అన్నా హజారే లేఖ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఇబ్బందులు సృష్టించాయి. -
'ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ'
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది అని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి 28 సీట్లు, కాంగ్రెస్ 22, ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) 18 సీట్లు గెలుచుకుంటాయని తాజగా ఏబీపీ న్యూస్, నీల్సన్ లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. డిసెంబర్ 4 తేదిన 70 స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ల నుంచి 15 శాతం ఓట్లను అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఏఏపీ పొందే అవకాశం స్సష్టంగా కనిపిస్తోందని తెలిపింది. బీజేపీకి 34 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. తాజగా నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి 32 శాతం మంది కేజ్రివాల్ కు, 27 శాతం షీలా దీక్షిత్, విజయ్ గోయల్ వైపు 27 శాతం మంది మొగ్గు చూపినట్టు వెల్లడైంది. <span style="font-size:14px;">For the latest stories, you can&nbsp; like Sakshi News on <a href="https://www.facebook.com/Sakshinews" target="_blank">Facebook</a> and also follow us on <a href="https://twitter.com/Sakshinews" target="_blank">Twitter. </a>Get the Sakshi News app for <a href="https://play.google.com/store/apps/details?id=com.sakshi&amp;rdid=com.sakshi" target="_blank">Android</a> or <a href="https://itunes.apple.com/us/app/sakshi-telugu-news/id552717373?mt=8" target="_blank">iOS</a></span></h2> <p> &nbsp;</p>