కాంగ్రెస్‌కు గతమెంతో ఘనం
Published Tue, Dec 3 2013 11:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ ఐదవ అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా బుధవారం 11.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షించుకుంటే.. 1952లో ఢిల్లీ ‘సి’ క్లాస్ రాష్ట్రం. కాంగ్రెస్‌కు చెందిన బ్రహ్మ్‌ప్రకాష్ మొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1956లో అసెంబ్లీ వ్యవస్థ రద్దు అయ్యింది. ఆ స్థానంలో 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఏర్పాటయ్యింది. ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక 1993లో భారతీయ జనతాపార్టీ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పుడు బీజేపీ 49 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 14, మిగిలిన వాటిలో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఐదేళ్ల పాలనలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. వరుసగా మదన్‌లాల్ ఖురానా, సాహిబ్‌సింగ్ వర్మా, సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవా సాగింది. 70 సీట్లకు గాను 52 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బీజేపీ 15 సీట్లకే పరిమితమైపోయింది. జనతాదళ్ ఒకటి, మరో రెండింటిలో ఇండిపెండెంట్లు గెలుపొందారు.
గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే ఢిల్లీవాసులు పట్టం కట్టారు. 2003 ఎన్నికల్లో, బీజేపీ తన బలాన్ని 15 నుంచి 20 సీట్లకు పెంచుకోగలిగింది తప్పితే అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. షీలాదీక్షిత్ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కాగా, 2008 ఎన్నికల్లోనూ బీజేపీ ఆశలు నెరవేరలేదు. పార్టీ బలం 20 నుంచి 23 సీట్లకు పెరిగింది తప్ప అధికారం మాత్రం అందని ద్రాక్షపండుగానే మిగిలిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 43 స్థానాలను కైవసం చేసుకోగా షీలాదీక్షిత్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికై, భారతదేశంలో ఒక రాష్ట్రానికి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మహిళగా రికార్డు సృష్టించారు.
Advertisement
Advertisement