11 మందే మహిళా అభ్యర్థులు
Published Tue, Dec 3 2013 11:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: మహిళాసాధికారత, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గురించి పోటాపోటిగా మాట్లాడే అధికార, ప్రతిపక్ష పార్టీలు శాసనసభ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రతిపక్ష బీజేపీ 5గురు మహిళా అభ్యర్థులను రంగంలోకి దించింది. కాంగ్రెస్ కేవలం 6గురు అభ్యర్థులను పోటీకి పెట్టింది. కొత్తగా రంగ ప్రవేశం చేసి సమాజం, సాధారణ ప్రజల గొంతుకనని చెప్పుకునే ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా కేవలం ఆరుగు రు మహిళలకే టికెట్లు కేటాయించింది. 15 సంవత్సరాలుగా మూడు వరుస విజయాలతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ మహిళా ముఖ్యమంత్రికే పాలన పగ్గాలు ఇచ్చింది. అయితే ఎన్నికల్లో ఈ పార్టీ మహిళలకు కేటాయించిన స్థానాలు మాత్రం 8.5 శాతం మాత్రమే. ప్రతిపక్ష బీజేపీ మహిళలకు ఇచ్చిన స్థానాలను లెక్కిస్తే మొత్తంలో 7.5 శాతమే.
ఎన్నికల జాబితా ప్రకారం ఢిల్లీలో మహిళా ఓటర్ల సంఖ్య 53 లక్షలు కాగా పురుష ఓటర్ల సంఖ్య 66 లక్షలు. ఎన్నికల్లో పోటీకి దిగిన మొత్తం 810 అభ్యర్థులు రంగంలో ఉండగా కేవలం 70 మందే మహిళా అభ్యర్థులు. 2008 ఎన్నికల్లో 57 మంది మాత్రమే బరిలో నిలిచారు. ఇదే విషయం ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాజీ ఢిల్లీ అధ్యక్షుడు విజయేందర్‌గుప్తాతో ప్రస్తావించగా ‘‘ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది మహిళా? పురుషుడా? అని కాక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మేము చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలిపించాలనేదానికి కట్టుబడి ఉన్నాం’’ అని వివరించారు.మహిళల విషయంలో ఇప్పటికీ వివక్షే గెలుస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.
Advertisement