ఫలించిన ఎన్నికల సంఘం శ్రమ
Published Wed, Dec 4 2013 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఓటింగ్ శాతం పెంచడంలో ఢిల్లీ ఎన్నికల సంఘం కృషి ఫలించింది. బుధవారంనాటి పోలింగ్‌లో రాజధాని వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 67 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1993లో ఢిల్లీలో నమోదైన 61.75 ఓటింగ్ శాతం రికార్డును బద్దలు కొడుతూ బుధవారం జరిగిన పోలింగ్‌లో 67శాతం నమోదైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఢిల్లీ ఎన్నికల సంఘం వినూత్న పద్ధతుల్లో నిర్వహించిన ప్రచారానికి ఊహించిన దానికంటే ఎక్కువే స్పందన వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీవాసులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా, ఓటు ప్రాధాన్యత చెప్పేలా స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో వీధి నాటకాలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఓటుహక్కు ప్రాధాన్యా న్ని తెలియజేసేలా ప్రదర్శనలు,
వార్తాపత్రికలు, టీవీచానళ్లు, ఎఫ్‌ఎం రేడియోలు వంటి ప్రసార మాధ్యమాలను వాడుకోవడంతోపాటు ఎన్నికల గీతాలతో ఎఫ్‌ఎం రేడియోల్లో ప్రచారం చేశారు. మెట్రోస్టేషన్ పరిసరాల్లో, మెట్రోరైళ్లలో ప్రచారాలతో హోరెత్తించారు. ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా ఒక్కో వర్గం ప్రజలను చేరుకునేందుకు ఒక్కోరకమైన పద్ధతిని అనుసరించింది. అయితే బుధవారం ఉదయం ఓటింగ్ మందకొడిగా సాగడంతో అధికారులు కాస్త నిరాశకు గురయ్యారు. క్రమంగా పోలింగ్ శాతంలో మార్పు వచ్చింది. సాయంత్ర ఐదు గంటల వరకు రికార్డు స్థాయిలో 65 శాతానికి పోలింగ్ చేరుకుంది. సమయం పూర్తయినప్పటికీ లై న్లలో వేల సంఖ్యలో ఓటర్లు బారులు తీరడంతో 8.30 గంటల వరకు లైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఓటు హక్కు వినియోగంపై దేశ రాజధానివాసుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమయింది.
నిర్మానుష్యంగా కన్నాట్‌ప్లేస్‌మార్కెట్:
నిత్యం వేలాది మంది కొనుగోలు దారులతో సందడిగా కనిపించే కన్నాట్‌ప్లేస్ వంటి అత్యంత రద్దీ మార్కెట్లు సైతం బుధవారం వెలవెలబోయాయి. పోలింగ్ కారణంగా ముందుగానే సెలవు ప్రకటించడంతో ఆ ప్రాంతంలో జనసంచారం లేదు. దాదాపు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ఢిల్లీలోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో స్థానిక కన్నాట్‌ప్లేస్ పరిసరాలు ప్రతిబింబించాయి.
Advertisement