ప్రచారానికి తెర!
Published Mon, Dec 2 2013 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. దీంతో ఎన్నికల ప్రకటనతో అక్టోబర్‌లో మొదలై, నామినేషన్ల ప్రక్రియతో ఊపందుకున్న ప్రచారానికి తెరపడినట్లయింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న 810 మంది అభ్యర్థులు, వారి బంధుమిత్రులు, పార్టీల కార్యకర్తలు ప్రచారం గుడువు ముగిసే ఆఖరి నిమిషం వరకు వీలైనంత మంది ఓటర్లపై తమ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఓటర్లపై హామీల జల్లులు కురిపించారు. ఎన్నికల కమిషన్ కఠిన వైఖరి కారణంగా ఈసారి ఎన్నికల ప్రచారం సాదాసీదాగానే సాగింది. మొట్టమొదటి సారిగా నగరంలో ఎన్నికల ప్రచారంలో గోడలపై పోస్టర్లు, బ్యానర్లు అతికించలేదు. ఎన్నికల కమిషన్ ఆంక్షలతో గతంతో పోలిస్తే ప్రచారం పేలవంగా సాగినప్పటికీ ఓటర్లను చేరుకోవడానికి అభ్యర్థులు, పార్టీలు గట్టిగానే ప్రయత్నించాయి.
బహిరంగ సభ లు, ర్యాలీలు, రేడియో జింగిల్స్, కరపత్రాలు, రోడ్ షోలు, ఎస్‌ఎంఎస్‌లు, ప్రీ రికార్డెడ్ ఫోన్ కాల్స్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా, టెలివిజన్ అడ్వర్టయిజ్‌మెంట్లు, పోస్టర్లు, బ్యానర్లు, పాదయాత్రలతోపాటు ఇంటింటికీ తిరుగుతూ జోరుగానే ప్రచారం చేశారు. ప్రధానంగా పోటీపడుతున్న మూడు పార్టీల విషయానికొస్తే.. ‘ఫిర్ ఏక్‌బార్.., నహీ రుకేంగీ మేరీ దిల్లీ’ సందేశంతో కాంగ్రెస్... ‘బద్లేగీ దిల్లీ.. బద్లేగీ భారత్’ సందేశంతో బీజేపీ, ఇమాన్‌దార్ పార్టీ నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆక ట్టుకునేందుకు ప్రయత్నించాయి. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ తలపై టోపీలు, చేతుల్లో చీపుళ్లతో, ఆటోల వెనుక పోస్టర్లు, జాడూ చలావ్ యాత్రలతో మొదలుపెట్టివినూత్న ప్రచార వ్యూహాలతో ఓటర్లపై ముద్రవేయడానికి ప్రయత్నించింది.
15 ఏళ్ల పాలనలో తాము సాధించిన విజయాలను చూపుతూ అభివృద్ధి నినాదంతో.. ‘మెరుగైన ఢిల్లీ కావాలంటే తమకే ఓటువేయాలని’ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఏకవ్యక్తి సైన్యంలా అంతా తానై ప్రచారం నిర్వహించారు. ధరల పెరుగుదల ప్రధానాంశంగా బీజేపీ ప్రచారం సాగించింది. నరేంద్ర మోడీని చూపించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే ఆయన బహిరంగ సభలకు జన సమీకరణకు పార్టీ అత్యఅధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అవినీతి వ్యతిరేక నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ ఓసారి తమకూ అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లను కోరింది. రోడ్‌షోలతో పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ జోరుగా ప్రచారం చేసి ఢిల్లీలో ఎన్నికల పోరును ముక్కోణ పుపోటీగా మార్చడంలో సఫలమయ్యారు. మహిళల భద్రత, విద్యుత్తు చార్జీలు, నీటి సరఫరా సమస్యలు, ట్రాఫిక్ సమస్యలపై జనాలు ప్రచారానికి వచ్చిన నేతలను నిలదీశారు. ఉల్లిధరల పెరుగుదల ప్రచారంలో ప్రధానాంశమైంది.
ప్రముఖులతో ప్రచారం..
విధానసభ ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరచడం కోసం అన్ని పార్టీలు జనాకర్షణగల నేతలను, సెలబ్రిటీలను ప్రచారబరిలోకి దింపాయి. కాంగ్రెస్ తరఫున అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అజహరుద్దీన్, రాజ్ బబ్బర్ వంటి సెలబ్రిటీ ఎంపీలు ప్రచారం చేశారు. ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్మృతి ఇరానీ, వినోద్ ఖన్నా, మనోజ్ తివారీ వంటి సెలబ్రిటీలు కమలం పార్టీ కోసం ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ బీజేపీ ప్రచారానికి కేంద్ర బిందువయ్యారు. సెప్టెంబర్ ఆఖరున నిర్వహించిన మోడీ సభతో ఊపందుకున్న పార్టీ ప్రచా రం డిసెంబర్ 1న మోడీ సభతో పతాకస్థాయికి చేరింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూ అభ్యర్థుల విజయం కోసం, మాయావతి బీఎస్పీ అభ్యర్థుల కోసం బహిరంగ సభలు నిర్వహించారు. ఆమ్ ఆదీ పార్టీ కూడా బాలీవుడ్ నటులతో ప్రచారం నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షోలు జనాలను ఆక ట్టుకున్నాయి.
ప్రవాసులను ఆకట్టుకోవడానికి తంటాలు..
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారితోపాటు అస్సాం, బెంగాల్, ఒడిశా రాష్ట్రాత వారు నగరంలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్ తదిరత రాష్ట్రాలవారు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో కీలకంగా మారారు. అలాగే హర్యానా, ఉత్తరాఖండ్‌లకు చెందిన ఓటర్ల సంఖ్య కూడా రాజధానిలో గణనీయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఏర్పాటులో ప్రవాసులకున్న కీలక పాత్రను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఢిల్లీని ప్రవాసుల నగరంగా అభివర్ణించారు. తమిళులు, దక్షిణ భారతీయుల ఓటర్లను దృష్టిలో ఉంచుకొని తమిళ పార్టీ డీఎండీకే విధానసభ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ప్రవాసులను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు ఆయా ప్రాంతాలకు చెందిన నేతలతో ప్రచారం నిర్వహించాయి.
కాంగ్రెస్ తరఫున కేరళ ఓటర్లను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఉత్తరాఖండ్ వాసులను ఆకట్టుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హర్యానా వాసులను ఆకట్టుకోవడానికి భూపిందర్ సింగ్ హూడా, హిమాచలీయులను ఆకట్టుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్‌భద్రసింగ్ ప్రచారం చేశారు. పంజాబీలను ఆకట్టుకునేందుకు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రయత్నించారు. పూర్వాంచలీయులను ఆకట్టుకోవడానికి ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు నగరంలో ప్రత్యేకంగా తిష్ట వేసి ప్రచారం జరిపారు. బీజేపీ పూర్వాంచలీయులను అభ్యర్థులుగా బరి లోకి దింపడమేకాక, మనోజ్ తివారీవంటి భోజ్‌పురి సెలబ్రిటీలతో, ఆ ప్రాంత నేతలతో ప్రచారం నిర్వహించింది. శత్రుఘన్ సిన్హా మినహా జనాకర్షణగల సెలబ్రిటీ నేతలను బరిలోకి దింపి బీజేపీ ప్రవాసులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది.
ప్రచారంలో అడ్డంకులు...
ఢిల్లీలో అధికారం కోసం పోరాడుతున్న మూడు ప్రధాన పార్టీలకు ప్రచారంలో ఊహించని సమస్యలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ సభను రద్దు చేయవలసి రాగా... రాహుల్ గాంధీ సభలకు స్పందన కరువైంది. దక్షిణ పురిలో రాహుల్ గాంధీ సభ నుంచి జనాలు మధ్యలోనే వెనుతిరగడం పార్టీని ఇరుకున పడేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై తలెత్తిన వివాదంతో బీజేపీ ప్రచారం మధ్యలో కొన్ని రోజుల పాటు పట్టాలు తప్పినప్పటికీ ఆ తరువాత సర్దుకుంది. అంతా తానే అన్నట్లుగా పార్టీ తరపున ప్రచారం చేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఉత్సాహం డాక్టర్ హర్షవర్ధన్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తరువాత చతికిల బడింది. స్టింగ్ ఆపరేషన్ వివాదం, అన్నా హజారే లేఖ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఇబ్బందులు సృష్టించాయి.
Advertisement
Advertisement