‘నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి.. కరెంటు కష్టాలు చెప్పనవసరం లేదు.. మంచినీటి ఇబ్బందులు కోకొల్లలు.. సామాన్య మానవుడి గోడు పట్టించుకునేవాడే లేడు..’ ఇదీ నేటి జాతీయ రాజధానిలో నెలకొన్న పరిస్థితి.. ప్రజా ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో.. ఎప్పుడు తమ కష్టాలు గట్టెక్కుతాయోనని ఢిల్లీవాసులు ఎదురుచూస్తున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో ఎన్నికలు జరుగుతాయా లేక ప్రభుత్వం ఏర్పాటవుతుందా అన్న దానిపై మళ్లీ చర్చ ఊపందుకుంది. అసెంబ్లీని వెంటనే రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్‌ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయం చర్చనీయాంశంగా మారింది.ప్రజా తీర్పు వృథా కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని సుప్రీంకోర్టు నోటీసుకు కేంద్రం ఇచ్చిన జవాబు ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి బీజేపీలో తెరవెనుక ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న ఊహాగానాలను బలపరిచింది.. అయితే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే
అవకాశాలు లేవని, డిసెంబర్‌లో ఎన్నికలు జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాజకీయ అనిశ్చితిని తొలగించడం కోసం బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తామని ఢిల్లీ బీజేపీ అంటున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఎన్నికల పట్ల విముఖంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు గురించిన చర్చ పదేపదే తలెత్తుతోంది.ఎన్నికలకు సముఖంగా లేని ఎమ్మెల్యేలు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఎన్నికలు ఇష్టం లేని ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయం ఇంకా బీజేపీ పరిశీలనలో ఉందనే విషయం ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మాటలతో స్పష్టమైంది. ‘మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం పాపం కాదు.. గతంలో మైనారిటీ ప్రభుత్వాలు విజయవంతంగా నడిచాయి..
మేము మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అనడం లేదు.. కానీ రాజకీయాల్లో దేన్నీ తోసిపుచ్చలేమ’ని సతీష్ ఉపాధ్యాయ వ్యాఖ్యానించారు. అయితే మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశం బీజేపీకి లేదని, ఎన్నికలను వాయిదా వేయడానికే ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం పేరిట కాలయాపన చేస్తోందని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా, ధరల పెరుగుదల దృష్ట్యా ఎన్నికలకు వెనుకడుగు వేస్తున్నప్పటికీ ఇతర పార్టీల ను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామన్న అపఖ్యా తి మోయడానికి బీజేపీ అగ్రనాయకత్వం సుముఖంగా లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాము ప్రత్యర్థి పార్టీలను చీల్చే ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆప్‌పై ప్రజలకు సానుభూతి పెరిగి ఆ పార్టీ బలపడవచ్చన్న భయం కూడా బీజేపీ నేతలను వేధిస్తోం దని అంటున్నారు. ఈ కారణాల దృష్ట్యా ఢిల్లీలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు లేవని, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని వారు అంటున్నారు.
ఏం జరుగుతోంది..
Published Tue, Aug 5 2014 10:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement