ఆప్ విజయం పట్ల ప్రవాస భారతీయుల ఆనందం
Published Tue, Dec 10 2013 12:07 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం పట్ల ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆప్ పార్టీ విజయం కోసం అనేక మంది ప్రవాస భారతీయులు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్నారు. ఫలితాలను వెలువడిన తరువాత తమ కష్టాలకు తగిన ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. బోస్టన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మధు నర్సయ్య (35) ఉద్యోగం వదిలిపెట్టి స్వచ్ఛంద సేవకుడిగా ఆప్ పార్టీ ప్రచారంలో భాగస్వామి అయ్యాడు. ఫలితాలలు వెలువడిన అనంతరం ‘‘ఆప్ పార్టీ సాధించిన విజయం భారత రాజకీయాల్లో మేలిమలుపు. అవినీతి వ్యతిరేక పోరాటం నాటి నుంచి నేను స్వచ్ఛంద కార్యకర్తగా ఉన్నాను. ఐఏసీ రాజకీయ మలుపు తీసుకొని పార్టీగా అవతరించింది. దీన్ని మేము ఆహ్వానించాము.
అందుకే ఎన్నికల్లో విజయం సాధించడానికి నేను కార్యకర్తగా రంగంలోకి దిగాను. అనేక నియోజక వర్గాలు తిరిగి అక్కడి ప్రజలకు ఆప్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాను’’ అని తెలిపాడు. నర్సయ్యతో పాటు 50 మందికి పైగా ప్రవాస భారతీయులు ఢిల్లీలో మకాం చేసి ఆప్ పార్టీకి తమ వంతు సేవలు అందించారు. ఆప్ పార్టీ ఇటు పాలక పక్షం కాంగ్రెస్‌కు, అటు బీజేపీకి గట్టి పోటి ఇచ్చింది. మొత్తం 70 శాసనసభ సీట్లలో 28 సీట్లు గెల్చుకోవడం పట్ల ఆమ్‌ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మూడుసార్లు వరుస విజయాలు సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించిన షీలా దీక్షిత్‌ను ఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన నర్సయ్య‘‘భారతీయ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం జరిగిన ఉద్యమంలో మేము భాగస్వాములం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు నర్సయ్య. ఈయన స్వరాష్ట్రం తమిళనాడు.
పవాస భారతీయుల కృషిని వివరిస్తూ‘‘చాలా మంది ప్రవాస భారతీయులు ఆప్ పార్టీ కోసం నిధులు సేకరించారు. స్వయంగా ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన వారే కాక వందలాది మంది వివిధ రకాలుగా సహాయం చేశారు. ఢిల్లీలో మకాం చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పనిచేస్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ బ్రాద్ మిశ్రా (45) శాసనసభ ఎన్నికల్లో ఆప్ పార్టీకి మద్దతు పలకడమే కాక స్వయంగా ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొనడానికి ముందుకు వచ్చాడు. భారతీయ యువత ప్రతిస్పందనను స్వయంగా పరిశీలించడానికి బ్రిటన్ నుంచి జయంత్ మిశ్రా(77) ఢిల్లీకి వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు.
‘‘ఇక్కడి యువకులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను కలిసి మాట్లాడాలని వచ్చాను’’ అని వివరించారు. ఈయన ఏడు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తోడ్పాటు అందించారు. వీరిలో కొందరు నియోజక వర్గాలనే దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కనీస వసతులు, ఆరోగ్యం తదితర రంగాల్లో సేవలందించడానికి ముందుకు వచ్చారు. దాదాపు ఆరు కోట్ల ఆర్థిక సహాయం అందిందని ఓ ఆప్ పార్టీ నాయకుడన్నారు. నర్సయ్య అమెరికా తిరిగి వెళ్తానని చెప్పగా, మిశ్రా మాత్రం తాను ఆప్ పార్టీకి సేవలందించడానికి ఇక్కడే ఉంటానన్నారు. స్వరాష్ట్రం ఒడిశాలో ఆప్ పార్టీని విస్త్రృతం చేస్తానని విశ్వాసంతో పలికాడు. రాజకీయ సామాజిక రంగాల్లో పనిచేయదలిచిన వారి కోసం ఒక అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తాను’’ అన్నారు.
కేజ్రీవాల్ నివాసంలో కోలాహలం
ఘజియాబాద్: ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కౌశాంబిలోని నివాసం సోమరవారంనాడు జాతరగా మారింది. బంధువులు, మద్దతుదారులు, స్నేహితులతో గిర్మార్ ఆపార్ట్‌మెంట్ నంబర్ 401 సందడిగా మారింది. మధ్యతరగతి నివాసమైన కేజ్రీవాల్ మూడు గదుల ఇల్లు పుష్పగుచ్ఛాలు, మిఠాయిలతో నిండిపోయింది. యువ అభిమానులు, కార్యకర్తలు, బంధువులతో జాతరను తలపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా మీద బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందిన కేజ్రీవాల్‌కు అభినందనలు తెలపడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కేజ్రీవాల్ నివాస ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది.
Advertisement