ఈసీ ప్రచారం ఫలించేనా..!
Published Tue, Dec 3 2013 11:18 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న రాజకీయపార్టీలకు దీటుగా ఈసారి ఢిల్లీ ఎన్నికల సంఘం సైతం వినూత్న పద్ధతుల్లో ప్రచారం నిర్వహించింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ ఆధ్వర్యంలో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
వీధి నాటకాలతో అవగాహన..
దేశ రాజధాని ఢిల్లీలో విద్యావంతులు, విలాసమైన భవంతులున్న ప్రాంతాలకంటే జేజే కాలనీలు, అనధికారిక కాలనీలే ఎక్కువ. ఢిల్లీ జనాభాలో దాదాపు సగం మంది మురికివాడల్లోనే నివసిస్తున్నారు. వారంతా ఓటుహక్కు వినియోగించుకునేలా స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో వీధినాటకాలను ఏర్పాటు చేశారు.అలాగే పిల్లలు చెబితే వారి తల్లిదండ్రులు ఓటుహక్కు తప్పక వినియోగించుకుంటారన్న ఆలోచనతో పాఠశాలల విద్యార్థులకు ఓటుహక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేలా ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. తారల తళుకు బెలుకులు జోడించారు. సైఫ్‌అలీఖాన్, సోనాక్షిసిన్హాతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇండియాగేట్ సమీపంలో నిర్వహించిన రాక్‌బ్యాండ్ మ్యూజికల్ ప్రోగ్రాంతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీటితోపాటు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు.
ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు..
ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం వార్తాపత్రికలు, టీవీచానళ్లు, ఎఫ్‌ఎం రేడియోలు వంటి ప్రసారమాధ్యమాలను వాడుకోవడం పాతదే అయినా ఈసారి వాడకంలో వినూత్న పద్ధతులు వినియోగించారు. ప్రత్యేక ఎన్నికల గీతాలతో ఎఫ్‌ఎం రేడియోల్లో ప్రచారం చేశారు. ఢిల్లీలో జనసమర్థం ఎక్కువగా ఉండే మెట్రోస్టేషన్లను వేదికలుగా చేసుకోవడంలో ఎన్నికల సంఘం అధికారులు విజయవంతమయ్యారు. మెట్రోస్టేషన్ పరిసరాల్లో, మెట్రోరైళ్లలో ‘డిసెంబర్ 4న ఓటుహక్కు తప్పక వినియోగించుకోండి’అంటూ ప్రచారాలతో హోరెత్తించారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో పార్టీ ప్రచారం ముగిసినా ఎన్నికల సంఘం ప్రచారం మాత్రం కొనసాగింది. మంగళవారం అన్ని మెట్రోస్టేషన్లు ఎన్నికల సంఘం ప్రచారంతో హోరెత్తాయి. అన్ని వర్గాల వారిని చేరుకునేందుకు వినూత్న పద్ధతుల్లో ఢిల్లీ ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రచారాలు ఏమేరకు ఫలితాలిస్తాయో బుధవారం సాయంత్రానికి తేలనుంది.
నోటాతో ప్రభావం నిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలపై కొత్తగా చేర్చిన ఆఖరి బటన్ నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) బటన్ నొక్కడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై నోటా బటన్ చేర్చింది. విధానసభ ఎన్నికలలో ఢిల్లీ ఓటర్లు మొదటిసారిగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరికీ ఓటు వేయడానికి ఇష్టపడనివారు నోటా బటన్ నొక్కవచ్చు. అయితే బరిలో ఉన్న అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడినప్పటికీ అత్యధిక ఓట్లు పడిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. నోటాకు అత్యధిక ఓట్లు పడినంత మాత్రాన ఓట ర్లు అభ్యర్థులను తిరస్కరించినట్లు భావించరాదని వారు చెప్పారు. అంటే నోటాకు పడిన ఓట్ల న్నీ లెక్కకురావు. అయితే ఇది ఓటరు మనోభిప్రాయాన్ని రహస్యంగా వెల్లడించడానికి తోడ్పడుతుందని, బోగస్ ఓట్లను కూడా నివారించవచ్చని వారు చెబుతున్నారు.
Advertisement
Advertisement