కాంగ్రెస్ విజయం ఖాయం: షీలాదీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ: తన ప్రభుత్వం గత 15 ఏళ్లలో సాధించిన విజయాలను మరోమారు ప్రస్తావించి, తమను మరోమారు అధికారంలోకి తెస్తే ఏమేం చేయాలనుకుంటున్నామో చెప్పి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విధాన సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ ఓటర్లను ఆఖరిసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఢిల్లీ కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని, కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిని మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నామని చెబుతూ.. కాంగ్రెస్‌కు మరోసారి ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. గడచిన 15 ఏళ్లలో ఢిల్లీ ఎంతో అబివృద్ధి చెందిందని, సాంఘిక, ఆర్థిక రంగాల్లో నగరం అభివృద్ధి చెందిందని, మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని ఆమె చెప్పారు.
దేశంతో ఢిల్లీ అభివృద్ధి రేటును పోల్చిచూపుతూ దేశంలో సగటు అభివృద్ధి రేటు 8.33 శాతం ఉండగా, ఢిల్లీ 10.33 రేటుతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. విద్యుత్తు చార్జీలు కూడా దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ఢిల్లీలో తక్కువగా ఉన్నాయన్నారు. సుఖమయమైన జీవితాన్ని కోరుకునేవారిని ఢిల్లీ ఆకర్షిస్తోందన్నారు. తాము అధికారంలోకి వస్తే చే సే పనులను కూడా ఆమె వివరించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ కామన్ ఎకనామిక్ జోన్‌గా రూపొందాలని తాము కోరుతున్నామని, దాని వల్ల ఎన్సీఆర్ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఎదగాలని కోరుతున్నామని ఆమె చెప్పారు. ప్రతి సంవత్సరం 30 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించేలా నైపుణ్యాల ఆధారిత సేవారంగాన్ని విస్తరించాలని ఆశిస్తున్నామన్నారు.
పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం కోసం సెంట్రల్ పార్కింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. నగరంలో కార్లు, ట్రాఫిక్ పెరిగిపోయిందని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. అన్నశ్రీ యోజన, పీడీఎస్, ఆహార భద్రత పథకాల అమలులో పారదర్శకతను సాధించడం కోసం వెండింగ్ మిషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. అనధికార కాలనీలను అనిశ్చితి నుంచి రక్షించడం కోసం క్రమబద్ధీకరించాలనుకుంటున్నామని, కొత్త పాఠశాలలతోపాటు సాయంకాల తరగతులను కూడా ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు.