చౌహాన్‌ను వదలని లోకాయుక్త
Published Fri, Sep 13 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
న్యూఢిల్లీ: మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను లోకాయుక్త గండం వీడేలా లేదు. పన్ను ఎగవేసిన ఓ రిసార్ట్‌ను రక్షించే ప్రయత్నం చేసిన మంత్రిని బర్త్ఫ్ రఫ్ చేయాల్సిందేనని లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరీన్ మరోసారి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆర్కే చౌహాన్‌ను కేబినెట్ నుంచి తొలగించేందుకు ఆదేశించాలంటూ తాను చేసిన సిఫార్సును రాష్ట్రపతి తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరోమారు సమీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ సరీన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒక లేఖ రాశారు. తన సిఫార్సును తిరస్కరిస్తూ పూర్వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని లేదా తన నివేదికను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆయన ప్రణబ్‌కు విజ్ఞప్తి చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రి చర్య తీవ్రమైనదని, అందువల్ల అతడిని దోషిగా పరిగణించి మంత్రిగా కొనసాగకుండా తొలగించేలా ఆదేశించాలని లోకాయుక్త ఫిబ్రవరి, 2011లో అప్పటి రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును ప్రతిభా పాటిల్ జూన్, 2011లో తిరస్కరించారు. రాష్ట్రపతి నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన లోకాయుక్త, నైతిక విలువలను అమలు చేసే విషయంలో ఇటువంటి ప్రతిబంధకాలు సామాన్యమేనని వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఇందుకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని మంత్రి ఆర్కేచౌహాన్ స్పందించారు. లోకాయుక్త సిఫార్సును దేశ అత్యున్నత కార్యాలమే తిరస్కరించిందని, ఇక దానిపై తాను వ్యాఖ్యానించడానికి ఏమీ లేదని పేర్కొన్నారు.
దక్షిణ ఢిల్లీలోని టివోలీగార్డెన్ రిసార్ట్‌లో సోదా చేసేందుకు వెళ్లిన వాణిజ్య పన్నుల బృందాన్ని మంత్రి బెదిరించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 20, 2010లో రిసార్ట్‌లో సోదాకు వెళ్లిన బృందానికి నాయకత్వం వహిస్తున్న వాణిజ్య పన్నుల కమిషనర్‌కు మంత్రి చౌహాన్ టెలిఫోన్ చేశారని లోకాయుక్త తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రజా ప్రతినిధిగా ఉన్న తనకు ప్రజల నుంచి అనేక ఫోన్లు వస్తుంటాయని అలా వచ్చిన ఓ ఫోన్‌కు తాను స్పందించానని చౌహాన్ చెప్పారు. ఈ ఉదంతంపై ఓ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఊహాజనితమైన భావన ఆధారంగా లోకాయుక్త సిఫార్సు చేశారంటూ ఢిల్లీ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. అనంతరం హోం శాఖ నివేదిక మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ లోకాయుక్త సిఫార్సును తిరస్కరించారు.
Advertisement